• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET Results: విడుదలైన తెలంగాణ‌ ఎంసెట్‌ ఫలితాలు

* ఇంజినీరింగ్‌ తొలి పదిలో 7.. అగ్రికల్చర్‌లో 9 ర్యాంకులు బాలురవే

* ఉత్తీర్ణతలో మెరిసిన అమ్మాయిలు

* విశాఖ విద్యార్థి అనిరుధ్‌కు  ఇంజినీరింగ్‌లో మొదటి ర్యాంకు

* టాపర్లలో ఏపీ విద్యార్థులే అధికం

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ ఫలితాల్లో అబ్బాయిలు అదరగొట్టారు. అగ్రికల్చర్‌లో తొలి 10 ర్యాంకుల్లో తొమ్మిది, ఇంజినీరింగ్‌లో 7 ర్యాంకులను వారే కైవసం చేసుకున్నారు. అగ్రికల్చర్‌లో 155 మార్కులతో బూరుగుపల్లి సత్యరాజ జస్వంత్‌, ఇంజినీరింగ్‌లో 158.89 మార్కులతో సనపల అనిరుధ్‌ ప్రథమ ర్యాంకులు సాధించారు. మొత్తంగా ఇంజినీరింగ్‌లో మొదటి పది ర్యాంకుల్లో 8, అగ్రికల్చర్‌, ఫార్మసీలో మొదటి పదిలో 7 ర్యాంకుల్ని ఏపీ విద్యార్థులు దక్కించుకున్నారు. ఎంసెట్‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి మే 25న‌ విడుదల చేశారు. తొలి పది ర్యాంకులను అబ్బాయిలు అధికంగా కైవసం చేసుకున్నా.. ఉత్తీర్ణత శాతంలో మాత్రం అమ్మాయిలదే పైచేయిగా ఉంది. ఇంజినీరింగ్‌లో దాదాపు 3 శాతం, అగ్రికల్చర్‌లో సుమారు 2.50 శాతం ఎక్కువగా అమ్మాయిల ఉత్తీర్ణత ఉండటం విశేషం. గత ఏడాది ఇంజినీరింగ్‌ విభాగంలో తొలి 10 ర్యాంకర్లలో అందరూ అబ్బాయిలే ఉండగా.. ఈసారి అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు. 7, 8, 10 ర్యాంకులను వారు సొంతం చేసుకున్నారు

    

ఇంజినీరింగ్‌లో 80.33%.. అగ్రికల్చర్‌లో 86.31% ఉత్తీర్ణత

పరీక్ష రాసిన వారిలో ఇంజినీరింగ్‌ విభాగంలో 80.33%, అగ్రికల్చర్‌లో 86.31% మంది కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. మొత్తం 160 మార్కులకు 40 మార్కులు వస్తే ఉత్తీర్ణులవుతారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కనీస మార్కుల నిబంధన వర్తించదు.

    

రెండుమూడు రోజుల్లో కౌన్సెలింగ్‌ తేదీలు

ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ నిర్వహణకు రెండు మూడు రోజుల్లో కాలపట్టిక జారీచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. రాష్ట్రం నుంచి సివిల్స్‌లో విజయం సాధించిన అభ్యర్థులకు ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలిపారు. సివిల్‌ సర్వీసెస్‌లో మూడో ర్యాంకర్‌, తెలంగాణకు చెందిన ఉమాహారతి నాలుగు సార్లు అపజయం ఎదురైనా సవాల్‌గా తీసుకొని అయిదో ప్రయత్నంలో అగ్రస్థానంలో నిలిచారని, చిన్న వాటికే కుంగిపోయే వారు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌మిత్తల్‌, జేఎన్‌టీయూహెచ్‌ ఉపకులపతి కట్టా నరసింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌కుమార్‌, కోకన్వీనర్‌ విజయకుమార్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌హుస్సేన్‌, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు వెంకటరమణ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ వీసీ కవితా దర్యానీ పాల్గొన్నారు.

    

వారికి అదనంగా 3 మార్కులు

ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షను మే 14న రాసిన విద్యార్థులకు 3 చొప్పున మార్కులు కలిపారు. ఆ రోజు జరిగిన 5, 6 విడతల ఆన్‌లైన్‌ పరీక్షల ప్రశ్నపత్రాల్లో గణితంలోని 3 ప్రశ్నల్లో స్పష్టత లేకపోవడంతో అదనపు మార్కులు కలిపి ర్యాంకులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల అభ్యంతరాలను పరిశీలించి నిపుణుల కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్‌ మార్కులకు వెయిటేజీని శాశ్వతంగా రద్దు చేయడంతో.. ఎంసెట్‌ స్కోర్‌ ఆధారంగానే విద్యార్థులకు ర్యాంకులు ఇచ్చారు.

* తెలంగాణ నుంచి ఇంజినీరింగ్‌ పరీక్షను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వరుసగా 16,370; 10,426 మంది రాయగా.. అగ్రికల్చర్‌ పరీక్షను 18,976; 11,070 మంది రాశారు. దీనిని బట్టి ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ఎక్కువ మంది ఎంసెట్‌ అగ్రికల్చర్‌కు పోటీపడుతునట్లు స్పష్టమవుతోంది. బీసీ, ఓసీ విద్యార్థుల్లో అధికశాతం ఇంజినీరింగ్‌ విభాగానికి పోటీపడుతున్నారు.

    

26 మంది బీసీ గురుకుల విద్యార్థులకు 10వేల లోపు ర్యాంకులు

ఎంసెట్‌ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థులు అధిక ర్యాంకులు సాధించారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 26 మంది విద్యార్థులు 10వేల లోపు ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. బీసీ గురుకుల విద్యాలయాలకు చెందిన 2,016 మంది ఎంసెట్‌ పరీక్షలో అర్హత సాధించినట్లు వివరించారు. మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేసిన బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టును అభినందించారు.

    

ఐఐటీ సీటే లక్ష్యం..

‘తొలి ర్యాంకు సాధించడం ఆనందంగా ఉంది. జేఈఈ మెయిన్స్‌లోనూ 122వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో రాణించి ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా చదువుతున్నా’ అని అనిరుధ్‌ తెలిపాడు. అనిరుధ్‌ తండ్రి ఖగేశ్వరరావు ఎస్సై, తల్లి ఝాన్సీ గృహిణి.    - అనిరుధ్‌, ఇంజినీరింగ్‌ 1వ ర్యాంకు, విశాఖపట్నం

    

పాఠ్యపుస్తకాలపై ఎక్కువ దృష్టి సారించా

‘ఇంటర్‌బోర్డు పాఠ్యపుస్తకాలపై ఎక్కువగా దృష్టిసారించా. పాఠాలు శ్రద్ధగా వినడం, సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవడం చేశా. జేఈఈ పరీక్షలకు ప్రత్యేకంగా సిద్ధం కావడం ఎంసెట్‌కు ఉపయోగపడింది. ఐఐటీ ముంబయిలో ఇంజినీరింగ్‌ చేయాలనుకుంటున్నా’ అని అభినీత్‌ తెలిపాడు. ఈ విద్యార్థి నాన్న శశిధర్‌, అమ్మ క్రాంతికుమారి ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.   - మాజేటి అభినీత్‌, ఇంజినీరింగ్‌ 4వ ర్యాంకు, హైదరాబాద్‌

    

ఐఏఎస్‌ కావటమే లక్ష్యం

‘కళాశాల అధ్యాపకులు, నాన్న సలహాలు, సూచనలతో చదివి 7వ ర్యాంకు సాధించా. ముంబయి   ఐఐటీలో కంప్యూటర్స్‌లో సీటు సాధించాలనేది కోరిక. ఆ తర్వాత సివిల్స్‌ రాసి ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం’ అని  శాన్వితరెడ్డి తెలిపింది. విద్యార్థిని తండ్రి వడ్డె మధుసూదన్‌రెడ్డి ఉపాధ్యాయుడు, తల్లి లలిత గృహిణి.  - శాన్వితరెడ్డి, ఇంజినీరింగ్‌ 7వ ర్యాంకు, నల్గొండ జిల్లా

    

సొంతంగా నోట్సు తయారు చేసుకున్నా..

‘మంచి ర్యాంకు వస్తుందనుకున్నా.. కానీ, మొదటి ర్యాంకు ఊహించలేదు. నాన్న సాయిరామకృష్ణ రైతు. అమ్మ రజని గృహిణి.  అమ్మానాన్న ప్రోత్సాహంతో రోజుకు 13 గంటలు కష్టపడ్డా. ముఖ్యమైన అంశాలతో నోట్సు తయారు చేసుకున్నా. దాన్నే నిత్యం నెమరు వేసుకున్నా. అలా చదవడం వల్లే మొదటి ర్యాంకు వచ్చింది’ అని జస్వంత్‌ తెలిపాడు.  - జస్వంత్‌, అగ్రికల్చర్‌ 1వ ర్యాంకు, కాతేరు, తూ.గో. జిల్లా

    

స్వయంగా మంత్రి సబిత ఫోన్‌ చేసి అభినందించారు

‘ఈ విజయంలో ఉపాధ్యాయులు, కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉంది. 3వ ర్యాంకు వచ్చిన విషయాన్ని స్వయంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫోను చేసి చెప్పారు. ఇటీవల రాసిన నీట్‌లోనూ ఉత్తమ ర్యాంకు సాధించాలని కోరుకుంటున్నా. భవిష్యత్తులో మంచి వైద్యుడిగా స్థిరపడి పేదలకు సేవలందిస్తా’ అని సఫల్‌ తెలిపాడు. ‘నా నియోజకవర్గానికి (మహేశ్వరం) చెందిన విద్యార్థి 3వ ర్యాంకు సాధించడం.. నాకెంతో సంతోషాన్ని కలిగించింది’ అని మంత్రి చెప్పి, అభినందించారని వెల్లడించాడు. లక్ష్మీసఫల్‌ తండ్రి సాయిచరణ్‌ వైద్యులు. ఎమర్జెన్సీ ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. తల్లి శ్రీదేవి ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదివారు.  - లక్ష్మీసఫల్‌, అగ్రికల్చర్‌ 3వ ర్యాంకు, కొత్తపేట, హైదరాబాద్‌ 

    

బృంద చర్చలతో పట్టు సాధించా..

‘అధ్యాపకులు బోధించిన అంశాలతో సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకొని వాటిని నిత్యం పునశ్చరణ చేశా. మా నాన్న మల్లీశ్వర్‌రెడ్డి ఓ సంస్థలో శాస్త్రవేత్తగా, అమ్మ సుష్మ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. హాస్టల్‌లో సహ విద్యార్థులతో బృంద చర్చలు చేస్తూ, వివిధ అంశాలపై పట్టు సాధించా. అయిదారేళ్ల కిందటి ప్రశ్నపత్రాలతో సన్నద్ధమయ్యా. న్యూరాలజీ వైద్యుడు కావాలనేది నా కోరిక’ అని శశిధర్‌రెడ్డి తెలిపాడు.  - దేవగుడి గురుశశిధర్‌రెడ్డి, అగ్రికల్చర్‌ 6వ ర్యాంకు, హైదరాబాద్‌

    


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.