* ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) జూన్ 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను వాయిదా వేయడానికి హైకోర్టు నిరాకరించింది. కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేస్తూ విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలను కనీసం 2 నెలలు వాయిదా వేయాలని కోరుతూ వివిధ జిల్లాలకు చెందిన 36 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మే 25న జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టారు. పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ఈనెల 11న టీఎస్పీఎస్సీకి ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని తగిన ఆదేశాలు జారీచేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. సాధారణంగా గ్రూప్-1, 2, 3, 4 పరీక్షల మధ్య తగినంత విరామం ఉండేలా పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. టీఎస్పీఎస్సీ తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, న్యాయవాది ఎం.రాంగోపాల్రావులు వాదనలు వినిపిస్తూ ప్రిలిమ్స్ పరీక్షల తేదీని మార్చి 17న ప్రకటించామని, అంటే సుమారు 85 రోజులు గడువు ఉందని నివేదించారు.
ప్రస్తుతం పిటిషనర్లు అడుగుతున్న 2 నెలల కంటే ఎక్కువ సమయం ఉందన్నారు. అంతేకాకుండా పిటిషనర్లు గతంలో ప్రిలిమ్స్ రాశారని, 36 మందిలో కేవలం అయిదుగురు మాత్రమే అర్హత సాధించారన్నారు. గ్రూప్-4 జులైలో నిర్వహిస్తున్నామని, దీనికి కూడా తగినంత సమయం ఉందని తెలిపారు. గ్రూప్-1 పరీక్షలకు 3.50 లక్షల మంది దరఖాస్తు చేసినా గతంలో 2.80 లక్షల మంది మాత్రమే హాజరయ్యారన్నారు. గ్రూప్-4కు 9.51 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారన్నారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైందని, ఇంతమందికి అభ్యంతరం లేనిది కేవలం పిటిషనర్లు మాత్రమే కోర్టుకు వచ్చారని, ఇందులో ప్రజాప్రయోజనమేమీ లేదన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ప్రస్తావిస్తూ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి పరీక్షలను వాయిదా వేయడానికి గానీ, పిటిషనర్లు ఇచ్చిన దరఖాస్తును పరిష్కరించాలని గానీ ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. పిటిషన్ను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులైన హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి, సిట్లకు నోటీసులు జారీచేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ తెలంగాణ పాలీసెట్ -2023 ఫలితాలు
‣ డిగ్రీ, పీజీతో ఫ్యాక్ట్లో ఉద్యోగాల భర్తీ
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.