* కష్టపడి చదివితే గురుకుల టీచర్ కొలువు
* రాత పరీక్షలకు 45 రోజుల నుంచి రెండు నెలల సమయం
* దరఖాస్తు సాంకేతిక సమస్యల పరిష్కారానికి హెల్ప్‌లైన్
* దరఖాస్తు చేయడానికి చివరి తేదీ వరకు వేచి చూడవద్దు
* ‘ఈనాడు’తో గురుకుల నియామకబోర్డు సీఈవో మల్లయ్యభట్టు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించనున్నామని గురుకుల నియామకబోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో), బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి బోర్డు ఒకేసారి తొమ్మిది ప్రకటనలు వెలువరించిందని పేర్కొన్నారు. వివిధ పోస్టులకు విద్యార్హతలు, పరీక్షఫీజుల్లో మార్పులేమీ చేయలేదని చెప్పారు. 2023-24 ఏడాదిలోనే కొత్త ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో చేరేలా ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు. అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సరైన ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు ఇవ్వాలని, లేకుంటే ఓటీపీలకు ఇబ్బంది అవుతుందని తెలిపారు. ఓటీఆర్ ఐడీ, పాస్‌వర్డ్ ఇతరులకు ఇవ్వకూడదని, అభ్యర్థుల హాల్‌టికెట్లు, ఫలితాలు, ఇతర వివరాలన్నీ వ్యక్తిగత ఓటీఆర్ లాగిన్‌లో ఉంటాయని చెప్పారు. గడువు తేదీ వరకు వేచిచూడకుండా, సర్వర్‌పై ఒత్తిడి పెరగకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బ్యాక్‌లాగ్ ఖాళీలు ఏర్పడకుండా ఉండేందుకు, ఉన్నతహోదా పోస్టుల నుంచి ప్రారంభించి.. కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేస్తామని వెల్లడించారు. నియామక ప్రక్రియపై మల్లయ్యబట్టు ‘ఈనాడు’తో మాట్లాడారు.
* గురుకుల పోస్టులకు ఓటీఆర్‌తోపాటు ఇతర సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని చెబుతున్నారు. దీన్ని ఎలా అధిగమిస్తున్నారు..
ఒకే అభ్యర్థి డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు అర్హత కలిగి ఉండవచ్చు. వారు ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా ప్రాథమిక సమాచారంతో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానం తీసుకువచ్చాం. ఓటీఆర్ ప్రారంభమైన రెండు, మూడు రోజుల్లోనే సాంకేతిక సమస్యలను పరిష్కరించాం. ఇబ్బందులుంటే అభ్యర్థులు 040-23317140 నంబరులో సంప్రదించవచ్చు. treirbhelpline@gmail.comకు, helpdesk-treirb@telangana.gov.inకు మెయిల్ చేయవచ్చు.
* రాతపరీక్షలు ఎప్పుడు నిర్వహించే అవకాశాలున్నాయి? షెడ్యూలు ఎప్పుడు వస్తుంది..
దరఖాస్తుకు నెల రోజుల గడువు ఇచ్చాం. అది ముగిసిన తరువాత రాతపరీక్షలకు 45 రోజుల నుంచి రెండు నెలల సమయం ఇస్తాం. పరీక్షల తేదీకి కనీసం నెలన్నర రోజుల ముందు షెడ్యూలు ప్రకటిస్తాం.
* టీఎస్‌పీఎస్సీ, ఇతర నియామక సంస్థలు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటిస్తున్నాయి. గురుకుల నియామక బోర్డు ఏ విధంగా ముందుకు వెళ్లనుంది..
ప్రస్తుతం రాష్ట్రంలో ఒకేసారి 33 వేల మందికి మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించేందుకు సదుపాయాలున్నాయి. గురుకుల నియామక పరీక్షలు ఓఎంఆర్ పద్ధతి లేదా కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఈ విషయాన్ని ఉద్యోగ ప్రకటనల్లోనూ పేర్కొన్నాం. మరోసారి సమావేశమై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం.
* గురుకులాల్లో 10,615 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తే, 9210 పోస్టులకే ప్రకటనలు వచ్చాయి. మిగతా వాటి మాటేమిటి..
గురుకులాల్లో కొన్ని కొత్త కోర్సులొచ్చాయి. వాటి బోధనకు ప్రత్యేక సబ్జెక్టు నిపుణులు అవసరం. వీటి భర్తీకి ఆయా సంక్షేమశాఖలు, సొసైటీల నుంచి సర్వీసు నిబంధనలు జారీ కావాల్సి ఉంది. మరికొన్నింటికి టీఎస్‌పీఎస్సీ మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ఇంకొన్ని పోస్టుల విషయంలో కోర్టు వ్యాజ్యాలున్నాయి. దివ్యాంగుల సంక్షేమశాఖ పరిధిలోని విద్యాలయాల పోస్టులకు సర్వీసు నిబంధనలు, విద్యార్హతలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చిన వెంటనే వాటికీ ప్రకటనలు జారీ చేస్తాం.
* గురుకుల పోస్టుల్లో 80 శాతం ఉద్యోగాలు మహిళలకే రిజర్వు అయ్యాయని, తమకు అన్యాయం జరుగుతోందని పురుష అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు..
సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు మహిళలు, బాలికల విద్యాసంస్థల్లోని పోస్టులకు మహిళలే అర్హులు. సంక్షేమ సొసైటీల పరిధిలోని గురుకులాల్లో సగానికి పైగా బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. వీటిలో పోస్టులన్నీ మహిళలకే ఉంటాయి. ఈ నేపథ్యంలో బాలురు, బాలికల విద్యాసంస్థలన్నీ కలిపి చూస్తే పోస్టుల్లో అత్యధికంగా మహిళలకు రిజర్వు అయినట్లు కనిపిస్తోంది. బాలుర పాఠశాలల్లో 33 శాతం రిజర్వేషన్ల మేరకు మహిళలకు పోస్టులు కేటాయించాం. కొత్త రోస్టర్ అమలు చేస్తున్నందున మహిళలకు పోస్టులు ఎక్కువగా ఉంటున్నాయి.
* అభ్యర్థులకు మీరిచ్చే సూచనలు..
గతంలో గురుకుల నియామక బోర్డు 3,476 పోస్టులు భర్తీ చేసింది. ఈ దఫా ఇప్పటికే 9,210 పోస్టులకు నోటిఫికేషన్లు వచ్చాయి. మధ్యవర్తులను, వదంతులను నమ్మి మోసపోవద్దు. కొందరు అభ్యర్థులు ఓటీఆర్, దరఖాస్తులో పొరపాట్లు చేస్తున్నారు. ఒక పోస్టుకు బదులు మరో పోస్టును ఎంపిక చేసుకుని, తరువాత ఆందోళన చెందుతున్నారు. ఇలాంటివారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. హడావిడి పడకుండా.. సబ్జెక్టు ఆప్షన్లు, విద్యార్హతలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.