* 20 మార్కుల కేటాయింపు
* ఈ విద్యాసంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు అమలు
* ‘బోర్డు’ ఇతర నిర్ణయాలు వాయిదా
ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్‌లో ఇప్పటి వరకు భౌతికశాస్త్రం, రసాయన, జీవ, వృక్ష శాస్త్రాలతో పాటు ఒకేషనల్(వృత్తి విద్య) కోర్సుల్లోనే ప్రయోగాలు (ప్రాక్టికల్స్) ఉండేవి. ఇక నుంచి ఆంగ్లం సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ కొత్త విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఫస్టియర్ విద్యార్థులకు వీటిని అమలు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తారు. రాత పరీక్ష 80 మార్కులకే పరిమితమవుతుంది.
* కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలుచేయాలని గత నవంబరులో జరిగిన ఇంటర్ బోర్డు పాలకమండలి నిర్ణయించింది. అందులో ఇంగ్లిషులో ప్రాక్టికల్స్ అమలు ఒకటి. ఆంగ్లంలో సంభాషించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని, దానివల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రాక్టికల్స్‌కు సిలబస్ కూర్పుపై భాషా నిపుణులతో బోర్డు అధికారులు చేసిన కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడిస్తారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాలు చెప్పి.. ఆంగ్లంలో ఎలా మాట్లాడతారో పరీక్షిస్తారు. అందుకు ఆంగ్ల నిపుణులు మాడ్యుళ్లు రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకు వైవా తరహాలోనే ఈ పరీక్ష ఉంటుందని ఒకరు వ్యాఖ్యానించారు. జూనియర్ కళాశాలల తరగతులు ప్రారంభమయ్యే నాటికి ప్రాక్టికల్స్‌పై ఇంటర్ బోర్డు స్పష్టత ఇవ్వనుంది.
పాత సిలబస్‌తోనే ద్వితీయ భాష పుస్తకాలు
ఇంటర్‌లో ద్వితీయ భాష సబ్జెక్టులైన తెలుగు, సంస్కృతం, హిందీ తదితరాల సిలబస్ మార్చాల్చి ఉంది. కొత్త విద్యాసంవత్సరం(2023-24)లో ప్రథమ, 2024-25లో ద్వితీయ పాఠ్యపుస్తకాలు మార్చాలని బోర్డు నిర్ణయించింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా భాషా విధానం మారింది. దానిపై జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) కసరత్తు చేస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం భాషా సబ్జెక్టులకు కొత్త సిలబస్ రావొచ్చని అంచనాకు వచ్చిన అధికారులు ఈ ఏడాది ఇక్కడ మార్పు చేస్తే ఇబ్బంది అవుతుందని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్‌కు సూచించినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతానికి ద్వితీయ భాషను పాత సిలబస్ ప్రకారమే బోధించనున్నారు.
ప్రత్యేక గణితం... గ్రూపు ఈసారి లేదు
కొన్ని దశాబ్దాలుగా ఎంఈసీ, సీఈసీ గ్రూపులకు ఒకే స్థాయి గణితాన్ని అమలుచేస్తున్నారు. మరీ ఎక్కువ స్థాయి గణితం సీఈసీ విద్యార్థులకు అవసరం లేదని భావించిన బోర్డు.. కొత్త విద్యాసంవత్సరం నుంచి మార్చాలని గతంలో నిర్ణయించింది. కామర్స్ విద్యార్థులకు అవసరమైన మేరకు సిలబస్ ఉంచి.. కొన్ని మార్పులతో ప్రత్యేకంగా గణితం సబ్జెక్టు తీసుకురావాలని నిర్ణయించారు. అది కూడా ఈసారి అమలులోకి రావడం లేదు. ప్రత్యేకంగా సీఈఏ (కామర్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్) గ్రూపును తీసుకురావాలని నిర్ణయించినా.. అది కూడా ఈ విద్యాసంవత్సరం అమలుకావడం లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ మెడికల్ డివైజెస్ కోర్సులకు డిమాండ్
‣ బోధన ఉద్యోగాలకు తొలి మెట్టు.. నెట్
‣ ఆయుధాలు చేపట్టి.. ఆంగ్లేయులను అదరగొట్టి!
‣ సివిల్స్ ప్రిలిమ్స్‌కు తుది సన్నద్ధత
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.