* పాఠశాల విద్యార్థులకు అమలు
* వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదన
* క్రీడలకు ప్రాధాన్యం... ఆట స్థలాల అభివృద్ధి
* వచ్చే విద్యా సంవత్సరానికి విద్యాశాఖ కార్యాచరణ ప్రణాళిక
ఈనాడు, హైదరాబాద్: పాఠశాలల్లో ప్రమాణాలను పెంచేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణతో సమాయత్తమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై ముందస్తుగానే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ రాష్ట్రంలో స్థితిగతులు, వచ్చే ఏడాది కార్యాచరణ ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం (2023-24) ముఖ గుర్తింపు హాజరు (ఫేస్ రికగ్నైజేషన్) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ఈ విధానంలో పిల్లల హాజరును చేపడతామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 18 జిల్లాల్లో ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజరును అమలుచేస్తున్న విషయం తెలిసిందే.
సాంకేతికత వినియోగంపై దృష్టి..
పాఠశాలల్లో అగ్మెంటెడ్ / వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌ల ఏర్పాటుకు విద్యాశాఖ ప్రతిపాదించింది. హైస్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 8, 9, 10 తరగతులకు డిజిటల్ తరగతులను అందుబాటులోకి తెస్తారు. విద్యార్థుల హాజరుతో పాటు విద్యా సామర్ధ్యాలను నమోదు చేయడానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ట్యాబ్‌లను ఇస్తారు. పాఠశాల విద్యాశాఖలో నిర్వహించే అన్ని కార్యక్రమాల కోసం డ్యాష్‌బోర్డును అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటుచేస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 1-5 తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలను పెంచేందుకు తొలిమెట్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది 6-9 తరగతుల్లో కూడా విద్యా ప్రమాణాలను పెంచేందుకు అదే మాదిరి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
కార్యాచరణ ప్రణాళికలో మరికొన్ని ముఖ్యాంశాలివీ..
* ప్రతి పాఠశాలలో విద్యార్థుల భద్రతపై అవగాహన పెంచేందుకు సేఫ్టీ క్లబ్‌లను ఏర్పాటుచేస్తారు.
* ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంచుతారు.
* కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరుస్తారు. వంటశాలలను పూర్తిగా ఆధునికీకరిస్తారు.
* సిలబస్‌కు అనుగుణంగా ఉండేలా ఇంటిగ్రేటెడ్ సైన్స్ ల్యాబ్‌లను అభివృద్ధి చేస్తారు.
* ఆట స్థలాలను అభివృద్ధి చేస్తారు. చదువులో క్రీడలను కూడా ఒక భాగంగా చేస్తారు.
* జాయ్‌ఫుల్ లెర్నింగ్ విధానాన్ని ఇప్పటికే మహబూబాబాద్, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేశారు. దాన్నివచ్చే ఏడాది అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ప్రతిపాదించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేఎల్ వర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల
‣ వైద్యవిద్య కోర్సుల ఫీజుల నిర్ణయానికి ఆర్థిక వివరాలు పంపండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.