* కొత్త తేదీలు వెల్లడించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయిన, వాయిదా పడిన అయిదు పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు పూర్తి చేసింది. లీకేజీ నేపథ్యంలో నాలుగు నోటిఫికేషన్ల పరీక్షలను కమిషన్ రద్దు చేయగా, రెండింటిని వాయిదా వేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీతో పాటు డివిజనల్ అకౌంట్స్ అధికారి (డీఏవో), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షలు రద్దు కాగా.. టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ (టీపీబీవో), వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తేదీని కమిషన్ ఇప్పటికే ఖరారు చేసింది. ఈ పరీక్షను జూన్ 11న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మిగతా రద్దయిన పరీక్షలతో పాటు వాయిదా పడిన వాటికి మార్చి 28 లేదా 29న కొత్త తేదీలు వెల్లడించే అవకాశాలున్నాయి. వీటిలో కొన్ని పోస్టుల రాతపరీక్షలను గతంలో ఓఎంఆర్ పద్ధతిలో కమిషన్ నిర్వహించింది. తాజాగా వీటికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఏయే పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించనున్నారు? ఏయే పరీక్షలు ఓఎంఆర్ పద్ధతిలో ఉంటాయన్న అంశాన్నీ కొత్త తేదీలతో పాటు ప్రకటించే అవకాశాలున్నట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.
హార్టికల్చర్ పరీక్ష.. యథాతథమా? రీషెడ్యూలా?
ఉద్యాన (హార్టికల్చర్) అధికారుల పోస్టు పరీక్షపై కమిషన్ మార్చి 28న నిర్ణయం తీసుకోనుంది. ఈ పరీక్షను యథావిధిగా నిర్వహిస్తుందా? లేక కొంత వ్యవధితో రీషెడ్యూలు చేస్తుందా అన్న విషయమై స్పష్టత ఇవ్వనుంది. ఉద్యాన అధికారుల పోస్టులకు ఏప్రిల్ 4న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రెండు పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నట్లు గతంలో కమిషన్ ప్రకటించింది. ఈ పరీక్ష తేదీకి వారం రోజుల ముందు ప్రవేశపత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచాల్సి ఉంది. ఈ లెక్కన మార్చి 28న అవి అందుబాటులోకి రావాలి. 22 ఉద్యాన అధికారుల పోస్టులను భర్తీ చేయనుండగా.. తక్కువ సంఖ్యలోనే అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఒకవేళ ఈ పరీక్షను వాయిదా వేస్తే.. స్వల్ప వ్యవధిలోనే తిరిగి నిర్వహించేందుకు అనువైన తేదీలను కమిషన్ పరిశీలిస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ శాంతిభద్రతల సంరక్షణసేనలోకి స్వాగతం!
‣ ప్రఖ్యాత సంస్థలో పరిశోధన డిగ్రీ
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.