* పోలీసు కస్టడీకి టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ నిందితులు
* హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో విచారణ
ఈనాడు, హైదరాబాద్: సంచలనం రేకెత్తించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. 9మంది నిందితులను ఆరు రోజుల కస్టడీకి తీసుకున్నారు. తొలిరోజు వీరిని హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయంలో విచారించారు. ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు అనుసరించిన వ్యూహంపై ప్రశ్నించారు. కంప్యూటర్లలో భద్రపరచిన అంశాలను గుర్తించగలిగారు. వీరికి కార్యాలయంలో సహకరించిన ఉద్యోగులు ఎవరనే విషయమై కూపీ లాగుతున్నారు. యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను ఎలా సేకరించారనే వివరాలు రాబట్టడం సిట్ అధికారులకు సవాల్‌గా మారింది. కార్యాలయ సమయం ముగిశాక రాత్రి వేళల్లో ప్రవీణ్, రాజశేఖర్ ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని తాజాగా గుర్తించారు. ఆ సమయంలోనే ప్రశ్నపత్రాలను పెన్‌డ్రైవ్‌లోకి మార్చి, ప్రింట్లు తీసుకున్నట్లు అంచనాకు వచ్చారు. వీటిని నిర్ధారించేందుకు అవసరమైన సమాచారంపై దృష్టి సారించారు. కమిషన్ కార్యాలయంలోని కంప్యూటర్లను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. కార్యాలయంలో అణువణువూ తెలిసి, సాంకేతిక పరిజ్ఞానమున్న ప్రధాన నిందితుడు ఏఎస్‌వో ప్రవీణ్‌కుమార్, నెట్‌వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డి ఇద్దరూకలిసే మోసానికి పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు.
కింగ్ కోఠిలో వైద్య పరీక్షలు
నిందితులు ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి, రేణుక, ఢాక్యానాయక్, రాజేశ్వర్‌నాయక్, నీలేష్‌నాయక్, గోపాల్‌నాయక్, శ్రీనివాస్, కె.రాజేంద్రనాయక్‌లను పోలీసులు శనివారం(మార్చి 18) ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి సుమారు రెండు గంటలపాటు వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం నిందితులను టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లిన సిట్ అధికారులు అందులోని కాన్ఫిడెన్షియల్, కార్యదర్శి విభాగాలను పరిశీలించారు. ప్రవీణ్, రాజశేఖర్‌లు ఇచ్చిన సమాచారంతో ప్రశ్నపత్రాల చోరీకి ఉపయోగించిన రెండు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మధ్యాహ్నం అందరినీ హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆరు రోజుల కస్టడీలో భాగంగా మొదటిరోజు సిట్ చీఫ్ ఎ.ఆర్.శ్రీనివాస్ సారథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుకలను వేర్వేరుగా ప్రశ్నించారు. మొదట్లో పోలీసులకు సహకరిస్తున్నట్లు నటించినా తర్వాత పొంతనలేని సమాధానాలతో ఒకరిపై ఒకరు తప్పులను నెట్టేసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం.
తికమక సమాధానాలు
ప్రవీణ్, రాజశేఖర్‌లు ప్రశ్నపత్రాలను తస్కరించేందుకు సాంకేతికపరమైన మార్గాలను అనుసరించినట్లు తెలిసింది. కాన్ఫిడెన్షియల్ విభాగంలో భద్రపరిచే ప్రశ్నపత్రాలను కాజేసేందుకు సంబంధిత అధికారి కంప్యూటర్‌కు డైనమిక్ ఐపీ అడ్రసు బదులు స్టాటిక్ ఐపీ ఇచ్చినట్లు రాజశేఖర్ అంగీకరించాడు. ఆ అధికారికి కేటాయించిన ఐపీ అడ్రసును రాజశేఖర్ తన కంప్యూటర్ ద్వారా లాగిన్ అయ్యాడు. అనంతరం ప్రశ్నపత్రాలకు సంబంధించిన ఫోల్డర్‌ను ప్రవీణ్ ఇచ్చిన నాలుగు పెన్‌డ్రైవ్‌లలో కాపీ చేశాడు. అయితే... యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లు ఎలా వచ్చాయనే దానిపై ప్రవీణ్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. కమిషన్ కార్యదర్శి డైరీ నుంచి సేకరించానంటూ మొదట అంగీకరించాడు. మరోసారి కాన్ఫిడెన్షియల్ సూపరింటెండెంట్ వద్ద డైరీ నుంచి తన పుస్తకంలో రాసుకున్నానంటూ సిట్ బృందాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. లీకైన ప్రశ్నపత్రాలను ఎవరికి విక్రయించారు? ఎంత లబ్ధి పొందారనే వివరాలు రాబట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సిట్ అధికారులు తెలిపారు.
వచ్చిన సొమ్ముతో జల్సా
అసిస్టెంట్ ఇంజినీర్ సివిల్ ప్రశ్నపత్రాన్ని అమ్మడం ద్వారా రేణుక దంపతుల నుంచి ప్రవీణ్‌కు విడతల వారీగా రూ.10 లక్షలు అందినట్లు తెలిసింది. మార్చి 6 వరకు ఈ నగదును ఇంట్లోనే భద్రపరిచాడు. అనంతరం అతని బాబాయి బ్యాంకు ఖాతాలో రూ.3.50 లక్షలు జమ చేశాడు. మరో రూ.6 లక్షలు తన బ్యాంకు ఖాతాలో వేశాడు. మిగిలిన రూ.50 వేలతో జల్సా చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ప్రశ్నపత్రాలను కాపీ చేసేందుకు సహకరించిన రాజశేఖర్‌కు మరోవిధంగా లబ్ధి చేకూర్చుతానని ప్రవీణ్ హామీ ఇచ్చాడని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అయితే... ప్రవీణ్ తన ఖాతాలో నగదు జమ చేసినట్లు చెప్పడం అవాస్తవమని పోలీసుల దర్యాప్తులో అతని బాబాయి చెప్పినట్లు సమాచారం.
సన్నిహితుడికి రూ.లక్షల్లో డబ్బు బదిలీ?
మల్యాల, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఏ2 నిందితుడైన రాజశేఖర్ తన సన్నిహితుడైన ఓ యువకుడికి రూ.లక్షల్లో డబ్బు పంపించినట్లు తెలిసింది. రాజశేఖర్ స్వగ్రామమైన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లికి చెందిన యువకుడికి డబ్బు పంపించినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. దాన్ని ఇంట్లో వారికి, తాను చెప్పిన వ్యక్తులకు అందేలా చూసేవాడని సమాచారం. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన కొందరు యువకుల నుంచి కూడా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు స్థానికంగా దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.