* ఎస్సెస్సీ, ఐబీపీఎస్ తరహాలో నిర్వహణ
* తొలుత ప్రొఫెషనల్ పోస్టులకు అమలు
భవిష్యత్తులో గ్రూప్స్ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ కార్యాచరణ
ఈనాడు - హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పోటీపరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) భావిస్తోంది. వేగంగా రాత పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించేందుకు ఆన్‌లైన్ విధానం దిశగా అడుగులు వేస్తోంది. పరీక్ష పత్రాల తయారీ, భద్రత, తదితర సాంకేతిక ఇబ్బందులు లేకుండా భారీ సంఖ్యలో ప్రశ్నలనిధి రూపొందించి, అభ్యర్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ విడతల వారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు మాత్రమే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీఆర్‌టీ) అమలు చేస్తోంది. అంతకు మించి అభ్యర్థులు హాజరయ్యే పరీక్షలకు ఈ విధానాన్ని విస్తరించనుంది. అభ్యర్థులందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా పరీక్షలు నిర్వహించి, నార్మలైజేషన్ విధానం అమలు చేయాలని భావిస్తోంది. తొలుత ప్రొఫెషనల్ పోస్టుల ఉద్యోగాలతో ప్రారంభించి, భవిష్యత్తులో అన్ని ఉద్యోగాలకు అమలు చేయాలని నిర్ణయించింది. పరీక్షలను సీబీఆర్‌టీ లేదా ఓఎంఆర్ విధానంలో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది. ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో ఈ విధానం ఇప్పటికే అమలవుతున్నందున ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. స్టాఫ్ సెలక్షన్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ), ఐబీపీఎస్, ఇతర పీఎస్సీలతో పాటు విద్యాసంస్థల్లో ప్రవేశ కమిటీలు నార్మలైజేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థుల సంఖ్య ఓవైపు గణనీయంగా పెరుగుతోంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులకు ఒకేరోజున పరీక్షలు నిర్వహించడం సవాళ్లతో కూడుకుంటోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు విడతల వారీగా ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక్కోసారి ఈ పరీక్షలు వారం రోజుల పాటు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 25 వేల మంది అభ్యర్థుల వరకు మాత్రమే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక వనరులు ఉన్నాయి. తాజాగా ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల్లోని కంప్యూటర్ ల్యాబ్‌లు వినియోగించుకుంటే 50 వేల మంది వరకు పెరుగుతుందని అంచనా. అభ్యర్థుల సంఖ్య ఇంకా పెరిగినా ఇబ్బందులు లేకుండా అవసరమైతే విడతల వారీగా నిర్వహించాలన్న ఆలోచన చేస్తోంది. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఈ పరీక్షలు, విధానంపై ఇప్పటికే అభ్యర్థుల్లో అవగాహన ఉందని భావిస్తోంది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించే వెటర్నరీ అసిస్టెంట్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్, ఏఎంవీఐ, పాలిటెక్నిక్ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ తదితర పరీక్షలకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనుంది. గ్రూపు సర్వీసుల ఉద్యోగాలకు ఈ విధానం అమలు చేయాలని గతంలోనే భావించినప్పటికీ, నిరుద్యోగుల్లో కొంత గందరగోళం నెలకొంటుందని పాత విధానాన్ని కొనసాగించింది. ప్రస్తుతం ఓఎంఆర్ పద్ధతి అవలంబించినప్పటికీ, భవిష్యత్తులో నార్మలైజేషన్ ఆధారితంగా విడతల వారీగా పరీక్షలు పూర్తిచేసేలా నిబంధనలు సవరించనుంది.
నార్మలైజేషన్‌తో మార్కుల ఖరారు
ఏదేని నియామక పరీక్ష, ప్రవేశపరీక్షకు లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఉంటే విడతల వారీగా నియామక సంస్థలు వివిధ సెట్లు నిర్వహిస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్న వేళల్లో వీటిని రెండు, మూడు రోజుల పాటు అందరూ హాజరయ్యేలా ప్రణాళికలు చేసి పూర్తి చేస్తున్నాయి. ఈలెక్కన రాష్ట్రంలో ఎంసెట్, ఐఐటీ, మెడికల్ తదితర పరీక్షలకు కంప్యూటరైజ్డ్ విధానం అమలు అవుతోంది. ఉదయం కొంత మందికి, మధ్యాహ్నం మరికొంత మందికి పరీక్షలు జరుగుతున్నాయి. ఒకపూట నిర్వహించిన పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వచ్చిన ప్రశ్నలు మరోపూట పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రావు. ఈ మేరకు భారీ సంఖ్యలో ప్రశ్నల నిధి ఉంటుంది. ప్రశ్నల కాఠిన్యతలోనూ తేడా ఉంటుంది. ఉదయం పూట పరీక్ష ప్రశ్నల కాఠిన్యత ఎక్కువగా ఉంటే, ఇక మధ్యాహ్నం కాఠిన్యత తక్కువగా ఉండొచ్చు. ఈ వ్యత్యాసాల నేపథ్యంలో నార్మలైజేషన్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలో గరిష్ఠంగా మార్కులు వచ్చిన అభ్యర్థుల సగటు, స్టాండర్డ్ డీవియేషన్ తీసుకుని మార్కులు లెక్కిస్తారు. అలాగే మధ్యాహ్నం పూట పరీక్షరాసిన అభ్యర్థులకు ఇదే పద్ధతిని పాటించి నార్మలైజేషన్ ఫార్ములా ప్రకారం తుది మార్కులు లెక్కిస్తారు.
టీఎస్‌పీఎస్సీ > గ్రూప్-III > స్టడీమెటీరియల్
2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
3. జనరల్ సైన్స్: సైన్స్ అండ్ టెక్నాలజీలో భారతదేశం సాధించిన విజయాలు
4. పర్యావరణ సమస్యలు: విపత్తు నివారణ - నిరోధం, తగ్గించే ఉపాయాలు
మరిన్ని Subjects కోసం క్లిక్ చేయండి.....
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!
‣ ఇంటర్‌తో వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.