• facebook
  • whatsapp
  • telegram

TSPSC: ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయి?

* ఆధారాల సేకరణపై సిట్‌ దృష్టి

* ప్రవీణ్‌, రాజశేఖర్‌, డాక్యా, రాజేంద్రలను మరోసారి ప్రశ్నించాలని నిర్ణయం  

* తాజాగా అరెస్టయిన ముగ్గురిని సైతం కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఏడుగురు నిందితుల కస్టడీ కోరుతూ సిట్‌ పోలీసులు నగర న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకూ 12 మంది అరెస్టయిన సంగతి తెలిసిందే. తొలుత అరెస్ట్‌ అయిన 9 మందిని ఇటీవలే కస్టడీకి తీసుకొని విచారణ జరిపారు. వీరిలో ప్రవీణ్‌కుమార్‌, రాజశేఖర్‌రెడ్డి, డాక్యానాయక్‌, రాజేంద్రనాయక్‌లను రెండోసారి ప్రశ్నించాలని సిట్‌ నిర్ణయించింది. వీరితోపాటు... మార్చి 22న‌ అరెస్టయిన షమీమ్‌, రమేష్‌కుమార్‌, సురేష్‌లను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు ఇంకెన్ని చేతులు మారాయనేది రాబట్టేందుకు మరోసారి వీరిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై మార్చి 25న‌ న్యాయస్థానం నిర్ణయం తీసుకోనుంది.

డబడిన ఆ ముగ్గురు...

గ్రూప్‌-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు వచ్చిన 121 మందిని సిట్‌ పోలీసులు విచారిస్తున్నారు. శుక్రవారం వరకూ 40 మందిని ప్రశ్నించారు. వీరిలో పరీక్ష తీరు, ప్రశ్నల శైలిపై పోలీసులు అడిగిన ప్రశ్నలకు సురేశ్‌, షమీమ్‌, రమేష్‌కుమార్‌లు తడబడ్డారని, పొంతనలేని సమాధానాలిస్తూ దొరికిపోయారని సమాచారం.  

సాక్ష్యాల సేకరణ ఇలా...

ఈ కేసులో ప్రధాన సాక్షిగా కమిషన్‌ కాన్ఫిడెన్షియల్‌ విభాగం సూపరింటెండెంట్‌ బి.శంకరలక్ష్మి నుంచి సిట్‌ పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. కమిషన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ కె.అనురాజ్‌, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ (పొరుగు సేవల ఉద్యోగి) బి.హరీశ్‌కుమార్‌ నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు. మార్చి 4న హైదరాబాద్‌ కర్మన్‌ఘాట్‌లోని ఆర్‌ స్క్వేర్‌ హోటల్‌లో రూమ్‌ నంబరు 106, 107లను కె.నీలేష్‌నాయక్‌, పి.గోపాల్‌నాయక్‌, డాక్యా, రాజిరెడ్డి, మరో ఇద్దరి పేర్లతో అద్దెకు తీసుకుని, మంతనాలు జరిపిన ఆధారాల ఫుటేజిని స్వాధీనం చేసుకున్నారు.

రూ.7.50 లక్షలకు ఏఈ పేపరు కొనుగోలు?

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: లీకేజీ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న రేణుక ఇంటిని సిట్‌ అధికారులు శుక్రవారం పరిశీలించారు. మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌లో ఆమె కిరాయికి ఉన్న ఇంటి యజమాని నుంచి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నవాబుపేట మండలంలో ఉపాధి హామీ పథకం ఈసీ(ఇంజినీరింగ్‌ కన్సల్టెంటు)గా పనిచేస్తున్న ప్రశాంత్‌రెడ్డిని మార్చి 24న‌ మధ్యాహ్నం 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని నవాబుపేట ఠాణాలో అర్ధరాత్రి వరకు విచారించారు. నలుగురు వ్యక్తులు రూ.7.50 లక్షల చొప్పున ఇచ్చి ఏఈ ప్రశ్నపత్రాన్ని కొన్నట్లు దర్యాప్తులో తేలడంతో ఈ విచారణ చేపట్టినట్లు సమాచారం. ప్రశాంత్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటుండగా నవాబుపేటలో ఈసీగా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన మరో వ్యక్తి కూడా రూ.7.50 లక్షలకు కొన్నట్లు సమాచారం. అతని కోసం అధికారులు షాద్‌నగర్‌కు వెళ్లగా పరారీలో ఉన్నట్లు తెలిసింది.

వాట్సప్‌ ద్వారానే చేతులుమారిన ప్రశ్నపత్రాలు

ఈ కేసులో నిందితులు పకడ్బందీగా ప్రశ్నపత్రాలను పంచుకొని లాభపడే ప్రయత్నం చేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కమిషన్‌ కార్యాలయం కేంద్రంగానే దందాను కొనసాగించినట్లు అంచనాకొచ్చారు. వాట్సప్‌ ద్వారానే గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలు పలువురి చేతులు మారినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో తాజాగా అరెస్టయిన అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ షమీమ్‌(43), నలగొప్పుల సురేశ్‌(30), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ దామెర రమేష్‌కుమార్‌(34)ల రిమాండ్‌ రిపోర్టులో ఈమేరకు పలు అంశాలను అధికారులు ప్రస్తావించారు. మార్చి 22న‌ సిట్‌ బృందాలు ఈ ముగ్గురి నివాసాల్లో తనిఖీలు నిర్వహించి ఒక ల్యాప్‌టాప్‌, 4 మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాయి. వారికి వాట్సప్‌ ద్వారానే ప్రశ్నపత్రాలు చేరినట్టు మొబైల్‌ఫోన్ల విశ్లేషణ ద్వారా నిర్ధారణకు వచ్చారు. ఏ12 రమేష్‌కుమార్‌ ఇంట్లో లభించిన ల్యాప్‌టాప్‌ నుంచి కీలక సమాచారం సేకరించారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ గీతం ప్రవేశ పరీక్షలు 31 నుంచి

‣ కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

‣ ఉన్నత విద్యకు రమ్మంటోంది.. యూకే!

‣ ఎన్‌ఎఫ్‌సీలో కొలువులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.