• facebook
  • whatsapp
  • telegram

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి ఏర్పాట్లు

* ఓఎంఆర్‌ విధానంలో పరీక్ష నిర్వహణ
* పరీక్షకు వారంరోజుల ముందు హాల్‌టికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ నిర్వహణపై నెలకొన్న అనిశ్చితికి హైకోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 11న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందుగా ప్రవేశపత్రాలు జారీ చేయనుంది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ (ఆప్టికల్‌ మార్క్‌ రికగ్నైజేషన్‌) పద్ధతిలో నిర్వహించనుంది. తెలంగాణ తొలి గ్రూప్‌-1 కింద అత్యధికంగా 503 ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ గతేడాది ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనకు రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు దరఖాస్తు చేశారు. అక్టోబరు 16న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఆ పరీక్షను రద్దుచేసి, జూన్‌ 11న తిరిగి నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కొందరు అభ్యర్థులు ఆ పరీక్ష వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. దీంతో పరీక్ష యథావిధిగా నిర్వహించేందుకు కమిషన్‌ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసింది. త్వరలోనే గ్రూప్‌-1 ప్రిలిమినరీ ప్రవేశపత్రాలను వెబ్‌సైట్లో పొందుపరచనుంది. 

సీబీఆర్‌టీ విధానం పరిశీలన..
గ్రూప్‌-1 ప్రిలిమినరీ పునఃపరీక్ష నిర్వహణపై కమిషన్‌ లోతుగా చర్చించింది. లీకేజీ వ్యవహారం నేపథ్యంలో కమిషన్‌ నిర్వహించే పరీక్షలను మల్టీసెషన్ల విధానంలో నిర్వహించి, నార్మలైజేషన్‌ కింద మార్కులు లెక్కించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. ఈ నేపథ్యంలో గ్రూప్‌-1 పరీక్షపై చర్చ జరిగింది. అయితే రాష్ట్రంలో ఒకేసారి 40 వేల మందికి మాత్రమే సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉంది. ఈ లెక్కన 3.8 లక్షల మందికి పరీక్ష నిర్వహించేందుకు దాదాపు పదిరోజుల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని కమిషన్‌ నిర్ణయించింది. ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ పోస్టును సృష్టించి, ఐఏఎస్‌ అధికారికి బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ అప్పగించింది. గ్రూప్‌-1 రాత పరీక్ష ప్రక్రియను ఈ ప్రత్యేక విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది. 
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.