* తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో నియామకానికి కసరత్తు
* అధికారులకు వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో నియమించే 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారి మెరిట్ జాబితాను మూడు రోజుల్లోగా ప్రకటించాలని అధికారులను వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ కళాశాలల నిర్మాణం వేగవంతం చేసి, భారతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు పొందేలా చూడాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో 21 వైద్య కళాశాలలను ఏర్పాటుచేయడం సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని చెప్పారు. కళాశాలల పనులపై శనివారం(మార్చి 25) తన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష జరిపారు. ఈనెల 28న 9 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ప్రిన్సిపల్స్, ఇంజినీర్లతో పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రి మాట్లాడుతూ 9 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 87 మందికి ప్రమోషన్లు ఇచ్చినట్లు చెప్పారు. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్‌లు ఇవ్వాలన్నారు. కొత్తగా 1442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరిందని, మూడు రోజుల్లో వారి పేర్లతో ప్రాథమిక మెరిట్ జాబితా విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలివ్వాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఆయాజిల్లాల కలెక్టర్లతో హరీశ్ మాట్లాడారు. గతేడాది 8 వైద్య కళాశాలలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగామ, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ కళాశాలలు కొత్త విద్యాసంవత్సనికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ తొమ్మిదింటితో కలిపి వైద్య కళాశాలల సంఖ్య 26కు, ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 3690కి పెరుగనున్నట్లు చెప్పారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును మంత్రి కోరారు. కేంద్ర ప్రభుత్వం 157 వైద్య కళాశాలలు మంజూరు చేయగా.. అందులో తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదని, అయినప్పటికీ ముఖ్యమంత్రి ప్రజలకు వైద్యం, వైద్యవిద్యను చేరువ చేసేందుకు జిల్లాకో కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.