* ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాం: సీఎస్ సోమేశ్‌కుమార్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ యువతకు విదేశాలలో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇందుకోసం శిక్షణ, సామర్థ్య పెంపుదలతో పాటు విదేశీ ఉద్యోగ మార్కెట్‌పై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణ విదేశీ మానవ వనరుల సంస్థ(టామ్‌కాం)కు ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం, సలహా మండలిని ఏర్పాటు చేస్తామన్నారు. విదేశీ ఉద్యోగావకాశాల కల్పనపై అక్టోబర్ 27న బీఆర్‌కే భవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర యువతకు విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి పుష్కలమైన అవకాశాలున్నాయి. అక్కడి సంస్థలు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నాయి. ప్రధానంగా వైద్యఆరోగ్య రంగంలో నర్సింగ్ పూర్తి చేసిన వారికి ఉద్యోగాలిచ్చేందుకు ముందుకొస్తున్నాయి. వీటిపై ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో నర్సింగ్ కోర్సు చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించాలి. విదేశాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న సాంకేతిక కోర్సుల జాబితాను సిద్ధం చేసి వాటిపై శిక్షణ ఇవ్వాలి. విదేశాల్లో ఉద్యోగాలు నిర్వహించేందుకు వీలుగా ఆంగ్లం, ఇతర సమాచార నైపుణ్య కోర్సులపై నిపుణుల ద్వారా బోధించాలి. దీని కోసం అన్ని ప్రభుత్వ, సాంకేతిక విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పించాలి’’ అని సూచించారు. సమావేశంలో కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, రిజ్వీ, సాంకేతిక విద్య, కార్మిక శాఖల కమిషనర్లు నవీన్‌మిత్తల్, అహ్మద్ నదీం తదితరులు పాల్గొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.