పీఎంశ్రీ పథకానికి 974 పాఠశాలల ఎంపిక
18లోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికి ఆదేశం
కంచికచర్ల, చందర్లపాడు, న్యూస్‌టుడే: భారతదేశాన్ని విద్యావ్యవస్థలో తలమానికంగా నిలిపేలా, విద్యార్థుల్లో పరిశోధనాత్మక దృక్పథం పెంపొందేలా ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత నాణ్యమైన విద్య (హై క్వాలిటీ ఎడ్యుకేషన్) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎంశ్రీ (ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద పాఠశాలలను అభివృద్ధి చేసి ల్యాబ్‌లు, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు సహా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. ఎంపిక చేసిన బడులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించనుంది.
పిల్లల సంఖ్యే ప్రామాణికంగా..
పీఎంశ్రీ పథకం కింద పాఠశాలలను ఎంపిక చేయడానికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో యూడైస్ 2021-22 విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారు. 974 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ప్రాథమికంగా ఎంపిక చేశారు. అత్యధికంగా విజయవాడ అర్బన్ మండలంలో 76, మచిలీపట్నం మండలంలో 55, నూజివీడు మండలంలో 38, జగ్గయ్యపేట మండలంలో 35, నందిగామ మండలంలో 34, అత్యల్పంగా పెద్దపారుపూడి, ఘంటసాల మండలాల్లో 04, అవనిగడ్డ మండలంలో 06 ఉన్నాయి. జిల్లా స్థాయి నోడల్ అధికారిగా డీఈవో వ్యవహరిస్తారు. ప్రధానోపాధ్యాయులు తక్షణం చేయాల్సిన పనులపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ నెల 12న డీఈవోలతో వెబ్ కాన్ఫరెన్సు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 18వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.
మార్కుల ఆధారంగా..
గ్రామీణ ప్రాంతాల్లోని బడులకు 60 శాతం, పట్టణాల్లో పాఠశాలలకు 70 శాతం మార్కులు వస్తే ఈ పథకానికి అర్హత సాధిస్తాయి. తొలి దశ(స్టెప్-1)లో పాఠశాలలను రిజిస్ట్రేషన్ చేయాలి. రెండో దశలో పరిశీలన ఉంటుంది. ప్రధానోపాధ్యాయుడి లాగిన్‌లో పీఎంశ్రీ పోర్టల్‌కు వెళ్లిన వెంటనే ఫోన్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. దాని ద్వారా లాగిన్ అయ్యాక అందులో పేర్కొన్న 46 అంశాలను పూర్తి చేయాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులు సరైన నిష్పత్తిలో ఉన్నారా? లేదా?, ఆట స్థలం ఉందా?, వంట శాలలు, మరుగుదొడ్లు ఉన్నాయా? ఏటా చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి రికార్డుల్లో నమోదు చేస్తున్నారా? లేదా? తదితర అంశాలు అందులో ఉన్నాయి. ఆ ప్రక్రియ తరువాత కేంద్ర విద్యాశాఖ ఆయా పాఠశాలలకు మార్కులు కేటాయిస్తుంది. ప్రాథమికంగా గుర్తించిన పాఠశాలల్లో.. మార్కుల ఆధారంగా ఎంపికైన పాఠశాలలకు 5 ఏళ్ల వరకు ఆర్థిక, సాంకేతిక సహకారం అందుతుంది. డిజిటల్ పద్ధతిలో బోధన, ప్రయోగశాలలు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. హరిత పాఠశాలలుగా తీర్చిదిద్ది నీటి సంరక్షణ, వ్యర్థాల రీసైక్లింగ్ తదితర అంశాల్లో విద్యార్థులకు తర్ఫీదునివ్వనున్నారు.
సౌకర్యాలు సమకూరుతాయి: సి.వి.రేణుక, డీఈవో, ఎన్టీఆర్ జిల్లా
ఈ పథకం ద్వారా ప్రభుత్వ బడుల్లో కార్పొరేటు తరహాలో సౌకర్యాలు సమకూరుతాయి. వసతులు, మార్కుల ఆధారంగా పాఠశాలల తుది ఎంపిక ఉంటుంది. నవంబర్ 18లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి, పూర్తి వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపేలా చర్యలు తీసుకుంటున్నాం.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.