• facebook
  • whatsapp
  • telegram

Degree: డిగ్రీలో 25 శాతం ప్రవేశాలుంటేనే కోర్సు కొనసాగింపు

* సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు ఆధారంగా పని గంటల నిర్ణయం

* మిగులుగా తేలిన అధ్యాపకులు ఇతర కళాశాలలకు బదిలీ
 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లోని కోర్సుల్లో 25 శాతం ప్రవేశాలు లేకపోతే వాటిని మూసివేసి, అక్కడ ఉండే అధ్యాపకులను వేరేచోట్ల సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. డిగ్రీలో తీసుకొచ్చిన సింగిల్‌ మేజర్‌తో చాలా కోర్సులు మూతపడుతుండగా.. అధ్యాపక పోస్టుల సంఖ్య తగ్గిపోతోంది. చాలా కళాశాలల్లో భౌతికశాస్త్రం మేజర్‌ కోర్సులో ఎక్కువమంది చేరలేదు. కొన్ని కళాశాలల్లో ఈ మేజర్‌లో సున్నా ప్రవేశాలున్నాయి. ఆర్ట్స్‌ కోర్సుల్లో సెక్షన్‌కు 40, సైన్సు కోర్సుల్లో 60 మంది విద్యార్థులు ఉండాలనే నిబంధన పెట్టింది ప్రభుత్వం. మేజర్‌ సబ్జెక్టుల ఆధారంగా పని భారాన్ని లెక్కించి అధ్యాపకులను సర్దుబాటు చేయబోతోంది. ఇటీవలే డిగ్రీ అధ్యాపకులకు బదిలీలు జరిగాయి. ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో పోస్టులను మార్చితే దూరం వెళ్లాల్సి వస్తుందని అధ్యాపకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిబంధన ప్రకారం డిగ్రీ అధ్యాపకుడికి వారానికి 16 గంటలు బోధన పని గంటలు ఉండాలి. కళాశాల విద్యాశాఖ దీన్ని పట్టించుకోకుండా హేతుబద్ధీకరణ చేపట్టింది. ఇప్పటికే కళాశాలల నుంచి పని భారంపై నివేదిక తీసుకుంది. వీటిపై ఆర్జేడీలు కసరత్తు చేసి, కమిషనరేట్‌కు నివేదిక ఇవ్వనున్నారు.

కౌన్సెలింగ్‌లోనే సర్దుబాటు..


ఈ ఏడాది ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు తక్కువగానే ఉన్నాయి. దీంతోపాటు సెక్షన్‌లో కనీసం 25 శాతం ప్రవేశాలు ఉండాలనే నిబంధన పెట్టడం, మేజర్‌ సబ్జెక్టు ప్రధానంగా పని గంటలను లెక్కించడంతో అధ్యాపకుల మిగులు ఎక్కువగా తేలబోతోంది. సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంలో రెండో ఏడాది నుంచి మైనర్‌ సబ్జెక్టులు ఉంటాయి. ఈ ఏడాది నుంచే ఈ విధానం మొదలైనందున వచ్చే సంవత్సరం మైనర్‌ సబ్జెక్టులు వస్తాయి. కానీ, అధికారులు మైనర్‌ సబ్జెక్టులను పట్టించుకోకుండా మేజర్‌ సబ్జెక్టుల పని గంటల ఆధారంగా అధ్యాపకులను లెక్కిస్తున్నారు. మేజర్‌, మైనర్‌తోపాటు నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు ఉన్నాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. 25 శాతంలోపు ప్రవేశాలున్న కోర్సుల్లోని విద్యార్థులను ఇప్పటికే వేరే కళాశాలలు, కోర్సులకు సర్దుబాటు చేశారు. కౌన్సెలింగ్‌ సమయంలోనే తక్కువగా చేరిన వారిని ఐచ్ఛికాలు మార్చుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చాలామంది వారికి నచ్చిన కోర్సు కోసం ఇతర కళాశాలలను ఎంపిక చేసుకోగా.. కొందరు అదే కళాశాలలో చదివేందుకు కోర్సులను మార్చుకున్నారు. డిగ్రీలో చేరిన వారిలో ఎక్కువమంది సైన్సు సబ్జెక్టుల్లోనే ఉన్నారు. ఇక్కడ సెక్షన్‌కు 60 మందిని అమలు చేయడంతో పని భారం తక్కువగా ఉన్నట్లు చూపుతున్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 31-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.