• facebook
  • whatsapp
  • telegram

Students: విద్యార్థుల కంటే ఉద్యోగులే ఎక్కువ

* ఉమ్మడి జిల్లాలోని విశ్వవిద్యాలయాల్లో పడిపోతున్న ప్రవేశాలు
* పాలకులు పట్టించుకోని ఫలితం
* న్యూస్‌టుడే, తిరుపతి (నగరపాలిక, ఎస్వీయూ), కుప్పం గ్రామీణ

పాలకుల నిర్లక్ష్యానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మూడు విశ్వవిద్యాలయాలు బలవుతున్నాయి. ప్రవేశం దొరకడమే మహద్భాగ్యం అన్న పరిస్థితి నుంచి విద్యార్థులు చేరితే చాలన్న దుస్థితికి చేరాయి. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య కంటే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యే ఎక్కువగా ఉందంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీలను రాజకీయ కేంద్రాలుగా మార్చడం, నిర్వహణలో నిర్లక్ష్యం, నిధుల లేమితో ఎస్వీయూలో ప్రవేశాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. శ్రీ పద్మావతి మహిళా, కుప్పం ద్రవిడ వర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

ఎస్వీయూలో..
ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ కీర్తి విశ్వవ్యాప్తమైంది. 1954లో ఆరు విభాగాలతో ప్రారంభమై.. ప్రస్తుతం 54 విభాగాలతో 88 కోర్సులను వేలాది మంది విద్యార్థులకు అందించే స్థాయికి ఎదిగింది.  ఇందులో 54 విభాగాలు ఉండగా.. ఆర్ట్స్‌లోని 24 విభాగాల్లో 1,004, సైన్స్‌ గ్రూపుల్లో 958 సీట్లు ఉన్నాయి. లా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో వంద సీట్లు, మిగిలిన 22 విభాగాల్లో 120 మందికి పీజీ మొదటి విడత ప్రవేశాలు కల్పించారు. పలు విభాగాల్లో ప్రవేశాలు శూన్యం. సైన్స్‌ గ్రూపుల్లో 387 మందే ప్రవేశాలు పొందినట్లు తెలుస్తోంది.

రాజకీయ పునరావాసంగా మార్చడంతో..: ఎస్వీయూలో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల సంఖ్య కంటే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంది. పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలు  గణనీయంగా పడిపోతుండగా.. ఇటీవలే 300 మందికి పైగా బోధనేతర సిబ్బందిని అనధికారికంగా నియమించుకుని రాజకీయ పునరావాసంగా మార్చినట్లు ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు.

ఇదీ లెక్క..
బోధనేతర ఉద్యోగుల్లో రెగ్యులర్‌ 600 మంది, టైంస్కేల్‌ 300, ఎన్‌ఎంఆర్‌. 358 మంది, హాస్టల్‌ సిబ్బంది 300, పొరుగు సేవల ఉద్యోగులతో కలిపి 1,700 మంది పనిచేస్తున్నారు. వర్సిటీలోని విభాగాల్లో 150 మంది రెగ్యులర్‌, 227 మంది టీచింగ్‌ అసిస్టెంట్లు, 70 అతిథి అధ్యాపకులున్నారు. బోధన, బోధనేతర ఉద్యోగులు, సిబ్బంది 2,150 మంది వరకు పనిచేస్తుండగా.. ప్రస్తుతం రెండు సంవత్సరాల విద్యార్థుల కంటే వీరి సంఖ్య ఎక్కువగా ఉండటం అక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.

కుప్పం ద్రవిడలో..
ద్రావిడ భాషలు.. సంస్కృతి.. సంప్రదాయాలు పరిరక్షించాలనే లక్ష్యంతో  నందమూరి తారకరామరావు ఆశయాలకు అనుగుణంగా తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు కృషితో 1997లో కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. వర్సిటీ రెండు కోర్సులతో ప్రారంభమై... అంచెలంచెలుగా 20కి పైగా కోర్సులు నిర్వహించే స్థాయికి ఎదిగింది. తెదేపా ప్రభుత్వ హయాంలో వర్సిటీ నిర్వహణ, ఉద్యోగల జీతభత్యాలకు సంబంధించి నిధులు సక్రమంగా అందేవి. ప్రస్తుత వైకాపా ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై కక్షతో వర్సిటీకి ఆశించినస్థాయిలో నిధులు సమకూర్చకపోవడంతో కనీసం పొరుగు సేవల  ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందక రోడ్డెక్కుతున్నారు.

ఇదీ లెక్క..
ద్రవిడ విశ్వవిద్యాలయంలో 20కిపైగా విభాగాలు ఉన్నాయి. 386 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య గమనిస్తే యూజీ విభాగంలో  225 మందే ప్రవేశాలు పొందారు. పీజీ విభాగంలో మొత్తం 77 మంది చేరారు. ఆంగ్లం, లింగ్విస్టిక్స్‌, తెలుగు, హిస్టరీ, జానపద, సీడీఎల్‌పీ పీజీ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు లేవు.

మహిళా వర్సిటీలో..

40 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో గతేడాది కంటే ఈ సంవత్సరం విద్యార్థినుల ప్రవేశాల సంఖ్య కాస్త తగ్గింది. గతంలో మహిళా వర్సిటీనే పీజీసెట్‌ నిర్వహించి ప్రవేశాలు కల్పించేది. అప్పుడు ప్రవేశాలు ఎక్కువగా ఉండేవి. కొన్నేళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పీజీసెట్‌ నిర్వహిస్తుండ[టంతో ఏటా ప్రవేశాల సంఖ్య తగ్గుతోంది. వర్సిటీలో మొత్తం 30 విభాగాలు 59 కోర్సులు ఉన్నాయి. వీటిలో 14 విభాగాల్లోని 27 కోర్సులకు పీజీసెట్‌ ద్వారా ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. 27 కోర్సుల్లో మొత్తం 889 సీట్లు భర్తీ కావాల్సి ఉండగా ఈ ఏడాది ఏపీ పీజీసెట్‌ ద్వారా 472 మంది సీట్లు సాధించారు. వీరిలో మొదటి విడత 371 మంది  విద్యార్థినులే ప్రవేశాలు పొందారు. ఇంకా 518 సీట్లు భర్తీ కావాల్సి ఉంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.