• facebook
  • whatsapp
  • telegram

Fake Admissions: విద్యాసంస్థల్లో ఉత్తుత్తి ప్రవేశాలు!  

* పది, ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన వారు తరగతులకు రాకపోయినా హాజరు

* ఇలా రికార్డుల్లోనే నమోదైన విద్యార్థులు 1.70 లక్షల మంది

* అధికారుల ఒత్తిడితో సొంతంగా ఫీజులు చెల్లించిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు

* స్థూల ప్రవేశాల నిష్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ

గత రెండేళ్లల్లో పదో తరగతిలో ఫెయిల్‌ అయిన వారందరూ మళ్లీ రెగ్యులర్‌ విద్యార్థుల్లా చదివేందుకు పునఃప్రవేశాలు కల్పించాలి. పరీక్షలు రాసేందుకు ఫీజులు చెల్లించాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులదే.- విద్యా శాఖ అధికారుల ఆదేశమిది.


ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు రీ-అడ్మిషన్లు కల్పించాలి. అందరితోనూ పరీక్ష ఫీజు కట్టించాలి. - ప్రిన్సిపాళ్లకు అధికారుల హుకుం


జరిగింది ఇదీ..


ఉన్నతాధికారుల ఒత్తిడి కారణంగా విద్యార్థులు రాకపోయినా వారి పేర్లను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు పరీక్ష ఫీజులు చెల్లించేశారు. పలుచోట్ల ఈ విద్యార్థులు రెగ్యులర్‌గా వస్తున్నట్లు హాజరు వేసేస్తున్నారు. ఇప్పుడు ఇలా రికార్డుల్లోనే కనిపిస్తున్న విద్యార్థులు రాష్ట్రంలో 1.70 లక్షలకుపైగా ఉన్నారు. వీరు తరగతులకు రాకపోయినా రికార్డుల్లో మాత్రం కొనసాగుతున్నారు.
పాఠశాల విద్యలో స్థూల ప్రవేశాల నిష్పత్తి(జీఆర్‌ఈ)ని ఎక్కువగా చూపించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. రీ-అడ్మిషన్‌ విధానం పేరుతో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో గందరగోళం సృష్టించింది. విద్యార్థులు తరగతులకు రాకపోయినా పేర్లు నమోదు చేసి హాజరు వేసేస్తున్నారు. దీంతో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో కేవలం రికార్డుల్లోనే నమోదైన విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు రీ-అడ్మిషన్‌ ద్వారా రెగ్యులర్‌ విద్యార్థులుగా చదువుకోవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ-అడ్మిషన్‌ కల్పించాలని, వారితో పరీక్ష ఫీజు కట్టించే బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లదే అని ఆదేశించింది. ప్రైవేటు యాజమాన్యాల మెడపైనా కత్తిపెట్టి పరీక్ష ఫీజులు కట్టించింది. చదువు పూర్తయి బయటకు వెళ్లిపోయిన విద్యార్థులు ఎక్కడున్నారో తెలియకపోయినా ఫీజులు మాత్రం కట్టేశారు. ఇప్పుడు వీరందరూ ఇంటర్మీడియట్‌, పదో తరగతి చదువుతున్నట్లు ప్రభుత్వం లెక్కలు చూపుతోంది. ఒక్క పాఠశాల విద్యలోనే ఇలాంటి విద్యార్థులు 93 వేల మంది ఉన్నారు. వీరి సంఖ్యను చూపుతూ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ఓ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదో తరగతిలో ఫెయిలవగా 11 మంది ఫీజును ఆ పాఠశాల ఉపాధ్యాయులే చెల్లించారు. ఈ విద్యార్థులు బడికి రావడం లేదు. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రెగ్యులర్‌గా పాఠళాలకు వస్తున్నట్లు చూపుతున్నారు.

ప్రైవేటు సంస్థలు, ఉపాధ్యాయులపై భారం

పదో తరగతిలో ఒకటి, రెండు సబ్జెక్టులు.. ఎక్కువ సబ్జెక్టులు ఫెయిల్‌ అయిన వారు మళ్లీ బడికి, కళాశాలకు వచ్చి చదివేందుకు ఆసక్తి చూపడం లేదు. కొందరు పదో తరగతి పరీక్షల తర్వాత ఎక్కడకు వెళ్లారో ఉపాధ్యాయులు, అధ్యాపకులకు తెలియని పరిస్థితి. ఫెయిల్‌ అయిన వారితో పరీక్ష ఫీజు కట్టించాలని ఒత్తిడి చేయడంతో కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు చందాలు వేసుకొని కట్టారు. కొన్ని పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సొంత డబ్బులు చెల్లించారు. ప్రైవేటు యాజమాన్యాలపైనా మండల విద్యాధికారులు, ప్రాంతీయ తనిఖీ అధికారులు ఒత్తిడి చేసి ఫీజులు కట్టించారు. విద్యార్థులు ఎక్కడ ఉన్నారో తెలియదని, కొందరు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారని విద్యా సంస్థలు చెప్పినా పరీక్ష ఫీజు కట్టాల్సిందే అని ఆదేశించారు. ఇప్పుడు ఈ విద్యార్థులకు విద్యా కానుక ఇచ్చినట్లు చూపిస్తున్నారు. పాఠశాల విద్యలో 88 వేల మందికి విద్యా కానుక ఇచ్చినట్లు లెక్కలు చూపుతున్నారు. వాస్తవంగా వీరు అసలు బడికే రావడం లేదు. హాజరు మాత్రం వేసేస్తున్నారు. రికార్డుల్లో ఉన్నందున వీరికి విద్యా కానుక ఇచ్చినట్లు రాసేస్తున్నారు.

విద్యార్థుల సంఖ్య ఎక్కువ చూపేందుకే..

పది, ఇంటర్మీడియట్‌ తర్వాత పైతరగతులకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా నీతి అయోగ్‌ రాష్ట్రాలకు కొన్ని పాయింట్లు ఇస్తోంది. ఈ  విభాగంలో రాష్ట్రం కొంత వెనుకబడి ఉండటంతో ఎక్కువ పాయింట్లు సాధించేందుకు ప్రభుత్వం రీ-అడ్మిషన్‌ విధానం పేరుతో ఉత్తుత్తి ప్రవేశాలు నిర్వహిస్తోంది. సమగ్రశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు ఆమోదిత మండలి(పీఏబీ) 2021లో విడుదల చేసిన నివేదిక ప్రకారం కడప, అనంతపురం, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్‌కు వెళ్లే సమయంలో 30 శాతం మందికి పైగా విద్యార్థులు మధ్యలోనే మానేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఉన్నత విద్యకు వెళ్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. పాఠశాల విద్యలో 1.70 లక్షల మంది విద్యార్థులు పెరిగినట్లు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపుతోంది.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ శ్రద్ధగా.. ఆసక్తిగా విందాం!

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

‣ స్తబ్ధత వీడితే కొలువు కొట్టొచ్చు!

‣ ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

‣ ప్రసిద్ధ సంస్థల్లో పరిశోధనలకు.. సీఎస్‌ఐఆర్‌ నెట్‌

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 10-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.