• facebook
  • whatsapp
  • telegram

Students: సమగ్ర వికాసానికి స‌రికొత్త‌ బోధన

నేడు బాలల దినోత్సవం. ఆహ్లాదకరమైన బాల్యం వ్యక్తి సమగ్రాభివృద్ధిలో కీలకం. తీవ్ర ఒత్తిడితో కూడిన నేటి చదువుల వల్ల బాలలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  మరోవైపు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవడంలోనూ మన పాఠశాల విద్య వెనకంజలో ఉంది.

పాఠశాలల్లో విద్యార్థులు ఎలాంటి భయానికి, ఒత్తిడికి, ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా చదువుకొనే వాతావరణం ఉండాలి. అప్పుడే పిల్లలకు బాల్యం మధురమైన స్మృతులను మిగిలిస్తుంది. పుస్తకాల బరువు, హోంవర్కులు, పరీక్షలు, మార్కులు, ర్యాంకులు వంటి వాటి హోరులో పిల్లలు నేడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆటపాటలు కరవై ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీ పడుతూ ఆహ్లాదానికి దూరమవుతున్నారు. పిల్లల సమగ్ర వికాసంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లలను సమగ్ర వ్యక్తులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దే విద్యావిధానం ఏ దేశానికైనా అవసరం. విషయ పరిజ్ఞానం అందించడంతో పాటు చిన్నారుల్లో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందించే, ప్రశ్నించే తత్వాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించే విధంగా పాఠశాల విద్య ఉండాలి. ప్రాంతీయ భాషల్లో విద్యాభ్యాసం ద్వారానే ఇది సాధ్యమవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జీవితంలో సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యంతో పాటు, నైపుణ్యాలను అందిపుచ్చుకొని ప్రయోజకులుగా మారడానికి విద్య దోహదపడాలి. ఈ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి పాఠ్య ప్రణాళిక ఒక సాధనం. విద్య లక్ష్యాలు, అభ్యసించాల్సిన అంశాలు, బోధనా పద్ధతులు, పరీక్షలు, మూల్యాంకన విధానం తదితరాలను పాఠ్యప్రణాళిక వివరిస్తుంది. ఆధునిక పోకడలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికలో మార్పులు తేవడం తప్పనిసరి.


ఆధునిక అంశాలపై అవగాహన

దేశీయంగా వలస పాలన నాటి ఆలోచనా ధోరణులకు ముగింపు పలికి సమానత్వం, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం కల్పిస్తూ పాఠశాల విద్యను సంస్కరించడం 2000 సంవత్సరం తరవాత ప్రారంభమైంది. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005, ఉపాధ్యాయ విద్య పాఠ్య ప్రణాళిక చట్రం-2009, విద్యాహక్కు చట్టం-2009, నూతన జాతీయ విద్యావిధానం-2020 వంటివి పాఠశాల విద్యలో మార్పులకు శ్రీకారం చుట్టాయి. 21వ శతాబ్ది అవసరాలకు అనుగుణంగా పిల్లల్లో విమర్శనాత్మక దృష్టి, సృజనాత్మకత, భావ ప్రకటన సామర్థ్యం, పరస్పర సహకారం వంటి నైపుణ్యాలను అభివృద్ధి పరచడం జాతీయ విద్యావిధానం-2020 లక్ష్యం. దీని సమర్థ అమలుకు సంబంధించి కస్తూరి రంగన్‌ కమిటీ పాఠశాల విద్యను నాలుగు దశలుగా వర్గీకరించింది. ప్రతి దశలో బోధనా లక్ష్యాలు, పద్ధతులు, అధ్యయన అంశాలను వివరించింది. జాతీయ నూతన విద్యావిధాన లక్ష్యాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాల రూపకల్పనకు కేంద్ర విద్యాశాఖ ఎం.సి.పంత్‌ అధ్యక్షతన పందొమ్మిది మంది సభ్యులతో ఇటీవల కమిటీని ఏర్పాటు చేసింది. యునెస్కో 2015లో వెలువరించిన నివేదిక ప్రకారం సామాజిక సమానత్వం, న్యాయం, ప్రపంచ సంఘీభావం పెంపొందించే విధంగా పిల్లల విద్యాభ్యాసం ఉండాలి. పాఠ్య ప్రణాళికల్లో ప్రజాస్వామ్య విలువలకు ప్రాధాన్యం దక్కాలి. కస్తూరి రంగన్‌ కమిటీ సైతం స్వేచ్ఛ, హేతుబద్ధంగా ఆలోచించడం, జాలి, కరుణ, మానవత్వ విలువలు, ధైర్యం, సృజనాత్మకత, భారతీయత వంటి లక్షణాలు పిల్లల్లో పెంపొందే విధంగా పాఠ్య ప్రణాళికలు ఉండాలని చెప్పింది. జ్ఞానేంద్రియాలను వినియోగించడం, పరిస్థితులను అవగాహన చేసుకోవడం, ఊహించడం, పోల్చడం, అనుభవం ద్వారా నేర్చుకోవడం వంటి ఆరు ప్రాచీన తాత్విక పద్ధతుల ద్వారా విద్యార్థులు జ్ఞానాన్ని పొందే విధంగా బోధన జరగాలని సూచించింది. స్థానిక సమాజాలు, రాష్ట్రాలు, దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యల పట్ల పిల్లల్లో అవగాహన కలిగిస్తూ పాఠ్యాంశాలు రూపొందించాలని వివరించింది. వీటన్నింటితో పాటు కృత్రిమ మేధ వంటి ఆధునిక అంశాలపైనా విద్యార్థులకు అవగాహన కల్పించేలా పాఠ్యాంశాలను రూపొందించాలి.

సమధిక నిధులు కీలకం


గణితం, విజ్ఞానశాస్త్రాల్లో పాఠశాల విద్యార్థుల పరిజ్ఞానం, పరస్పర సహకారం, సమస్యల పరిష్కార సామర్థ్యం తదితరాలను అంచనా వేయడానికి ప్రపంచవ్యాప్తంగా మూడేళ్లకోసారి ‘ప్రోగ్రాం ఫర్‌ ఇంటర్నేషనల్‌ స్టూడెంట్‌ అసెస్‌మెంట్‌’ (పీఐఎస్‌ఏ) పరీక్షను నిర్వహిస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి దీన్ని జరుపుతున్నారు. విద్యార్థులు ఏ మేరకు ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకున్నారో అంచనా వేయడం ఈ పరీక్ష లక్ష్యం. ఇండియా 2009లో మాత్రమే ఈ పరీక్షలో పాల్గొని 74 దేశాల సరసన 72వ ర్యాంకు సాధించింది. దీన్నిబట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాల విషయంలో మన పాఠశాల విద్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల విద్య సంస్కరణల్లో వేగం పెంచాలి. మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. దీనికోసం సమధిక నిధులను ప్రభుత్వాలు విద్యారంగంపై ఖర్చు చేయాలి. విద్యపై చేసే వ్యయాన్ని భవిష్యత్తు సమాజ ప్రగతికి పెట్టుబడిగా పాలకులు భావించాలి. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులపై చదువుల పరంగా అనవసరమైన ఒత్తిళ్లను నివారించి, ఆహ్లాదకర వాతావరణంలో వారు విద్యాబోధన సాగించేలా సమర్థ చర్యలు తీసుకోవడం కీలకమైన అంశం.

మారాల్సిన విధానం

ప్రపంచంలో చైనా, సింగపూర్‌, ఫిన్లాండ్‌ దేశాలు విజయవంతమైన విద్యావ్యవస్థను కలిగి ఉన్నాయి. ఈ దేశాల్లో, భారత్‌లో పిల్లలకు బోధించే విషయాలు దాదాపు ఒక్కటే. అయితే, బోధనా పద్ధతులు, విజ్ఞానాన్ని ఏ విధంగా పిల్లలకు అందిస్తున్నారనే అంశాలలోనే చాలా వ్యత్యాసం ఉంది. తరగతి బోధన కంటే పిల్లలను పని ప్రదేశాలకు, ప్రకృతికి దగ్గరగా తీసుకెళ్ళి పరిశీలన ద్వారా అనుభవం పొందే విధంగా బోధన జరగాలి. జీవన నైపుణ్యాలకు, ప్రయోగాత్మకతకు, సృజనాత్మకతకు బోధన పద్ధతులు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధ్యాయులు సంధాన కర్తలుగా, పర్యవేక్షకులుగా వ్యవహరిస్తూ పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాలి. బోధనలో సాంకేతికత వినియోగానికి ప్రాధాన్యం కల్పించాలి. విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా కాకుండా విషయాల(టాపిక్‌) వారీగా బోధించే పద్ధతిని ఫిన్లాండ్‌ ఇటీవల ప్రవేశపెట్టింది. ఈ తరహా బోధన వల్ల విద్యార్థుల్లో ఒక విషయం పట్ల పూర్తి పరిజ్ఞానం కలిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిని ఇండియా క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. విద్యార్థుల సమగ్ర వికాసానికి తోడ్పడే బోధన పద్ధతులను ప్రవేశపెట్టాలి.
                            

డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ (విద్యారంగ నిపుణులు)
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ భావోద్వేగ ప్రజ్ఞను మెరుగుపరుచుకుందాం!

‣ నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీలు

‣ ఎయిమ్స్‌ భోపాల్‌లో నాన్‌ఫ్యాకల్టీ పోస్టులు

‣ ఆన్‌క్యాంపస్‌, ఆఫ్‌క్యాంపస్‌ ఇంటర్వ్యూ ప్రిపరేషన్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.