• facebook
  • whatsapp
  • telegram

Education: విద్యాదీవెన ‘సంయుక్త ఖాతా’పై వ్యతిరేకత

ఈ దఫాకు మినహాయింపు
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఏదైనా ఒక అంశాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు.. సాధ్యాసాధ్యాలను లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. అదే విద్యార్థుల విషయంలోనైతే వారి చదువులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. గత విడత వరకు విద్యాదీవెన, వసతిదీవెన పథకాల ఆర్థిక సాయాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేవారు. అయితే, ప్రభుత్వం అందిస్తున్న సాయం గురించి ఓటు హక్కు ఉన్న విద్యార్థులకూ తెలియజేయాలనే ఉద్దేశంతో, ఈ నెలాఖరులోగా అందించాల్సిన విద్యాదీవెన ఆర్థిక సాయాన్ని వాయిదా వేయడం విస్మయానికి గురిచేసింది. ఈ దఫా విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాల్లోకి జమ చేస్తామని అధికారులు ఆదేశాలిచ్చారు. అందుకోసం న‌వంబ‌రు 24వ తేదీలోగా అందరూ సంయుక్త ఖాతాలు తెరవాల్సిందేని స్పష్టం చేశారు. దీంతో విద్యార్థులు చదువులు పక్కన పెట్టి బ్యాంకుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల కళాశాలల్లో సెమిస్టర్‌ పరీక్షలు ఉండటంతో ఏం చేయాలో తెలియక విద్యార్థులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ అనాలోచిత నిర్ణయంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో, ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విడత సాయం పాత ఖాతాల్లోనే జమ చేస్తామని కళాశాలల యాజమాన్యాలకు తాజాగా సమాచారమిచ్చింది. తదుపరి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసే మొత్తానికి సంయుక్త ఖాతాలు ఉండాల్సిందేనని స్పష్టం చేసింది
ఎస్సీ విద్యార్థులకు మినహాయింపు
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు చెల్లించే బోధనా రుసుముల్లో 60 శాతం కేంద్రమే అందిస్తోంది. కేంద్రం తన వాటాను నేరుగా విద్యార్థి తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తుండగా, మిగతా 40 శాతాన్ని రాష్ట్రం నాలుగు విడతల్లో ఇస్తోంది. దీనిపై సంయుక్త ఖాతాల మెలికపెడితే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతోనే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు జగన్‌ బొమ్మ పెట్టుకుని ప్రచారం చేసుకుంటుండటంపై ఇటీవలే కేంద్రం అభ్యంతరం తెలిపింది. తీరు మారే వరకు తదుపరి నిధులు విడుదల చేయబోమనీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఎస్సీ విద్యార్థుల విషయంలో సంయుక్త ఖాతాపై వెనక్కి తగ్గినట్టు చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.