• facebook
  • whatsapp
  • telegram

Coding: అరుదైన ప్యాకేజీలు అందుకున్న యువ‌తులు!  

* ఈ ఏడాదిలో స‌త్తాచాటారు

అమ్మానాన్నలకు భారం తగ్గించాలన్నది కొందరి తపన! తామేంటో నిరూపించుకోవాలన్నది మరికొందరి పట్టుదల. కారణం ఏదైతేనేం.. పట్టుబట్టి సాధించారీ యువతులు. తమ సత్తా చాటి రూ.లక్షలు, కోట్ల విలువైన అవకాశాలు వాళ్లని వెతుక్కుంటూ వచ్చేలా చేసుకున్నారు. ఈ ఏడాది అలా అరుదైన ప్యాకేజీలను అందుకున్న వారిలో కొందరిని మీరూ కలుసుకోండి..


రూ.3కోట్ల ఉపకారవేతనంతో..

* విదేశాల్లో చదవడం ఛవీసింగ్‌ కల. ఈమెది ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిన్నపల్లె. అమ్మానాన్న చిరుద్యోగులు. తన కల వాళ్లకి భారమని ఉచితంగా చదువుకునే అవకాశాల కోసం నెట్‌లో వెదికితే.. విదేశీ విశ్వవిద్యాలయాల స్కాలర్‌షిప్‌ల గురించి తెలిసింది. ఓవైపు డిగ్రీ చదువుతూనే వీటికీ సిద్ధమైంది. చాలా పరీక్షలే రాసింది. తన ప్రయత్నం ఫలించి అమెరికాలోని ఒబర్లిన్‌ కాలేజ్‌ నుంచి రూ.3కోట్ల స్కాలర్‌షిప్‌ అందుకుంది. దీంతో తను ఎంచుకున్న ఇంటర్నేషనల్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఆస్ట్రాలజీ కోర్సును ఉచితంగా చదువుకోనుంది. ప్రయాణ ఖర్చులు సహా సంస్థే భరిస్తుంది.

* పదిహేనేళ్లు నిండకుండానే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడం చూస్తూ పెరిగింది జాన్వీ మౌర్య. నాన్న ఉద్యోగి కాకపోయుంటే తనదీ అదే పరిస్థితి. ఎవరికీ లేని అవకాశం తనకు దక్కినపుడు నిరూపించుకోవాలనుకుంది. తనది ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన గ్రామం. వ్యవసాయమంటే ప్రాణం. రైతులకు మేలు చేయాలని అగ్రికల్చర్‌ విభాగంలో డిగ్రీ చేసింది. నిజానికి స్కూలు, కళాశాలలో సరిగా టీచర్లే ఉండేవారు కాదు. అయినా సొంతంగా పుస్తకాలు, నెట్‌ సాయంతో డిగ్రీ పూర్తిచేసింది. విదేశాల్లో వివిధ సాగు పద్ధతుల గురించి తెలుసుకోడానికి లింక్డ్‌ఇన్‌లో విదేశీ ప్రొఫెసర్లను కలుసుకుంది. వాళ్ల సలహాతో దరఖాస్తు చేసి, ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీలో చదివే అవకాశంతోపాటు రూ.1.5 కోట్ల ఉపకారవేతనాన్నీ అందుకుంది. తమ గ్రామం నుంచి విదేశాలకు వెళ్లిన తొలి యువతిగా నిలిచింది.
 

* కెరియర్‌లో ముందుకు సాగడానికి అమ్మతనం అడ్డుకాదని నమ్మింది వాడపల్లి అనూష. అందుకే విదేశాల్లో ఎంబీఏ కల నెరవేర్చుకోవడానికి శ్రమించింది. బాబుని చూసుకుంటూనే ప్రవేశపరీక్ష- జీమ్యాట్‌కి సిద్ధమైంది. ఇంతలో కొవిడ్‌. ఉద్యోగం, బాబు ఆలనాపాలనా, చదువు.. వీలుకాకపోయినా మొండిగా కొనసాగింది. తొలిసారి మంచి ర్యాంకే! కానీ విదేశీ కల నెరవేరదు. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తే స్కోరు తగ్గుతూ పోయింది. దానికితోడు మళ్లీ గర్భం దాల్చింది. అయినా ఈసారి పొరపాట్లపైనే దృష్టిపెట్టి మరీ 800కి 770 సాధించింది. ప్రసవమైన మూడోరోజే ఆసుపత్రి నుంచి ఇంటర్వ్యూ ఇచ్చి.. అమెరికాలోని టాప్‌ బిజినెస్‌ స్కూళ్లలో ప్రవేశావకాశంతోపాటు రూ.కోటి స్కాలర్‌షిప్‌నీ అందుకుంది.

ఆఫర్లు.. కాదని!

* ఎన్‌ఐటీ పట్నాలో చదువు. ప్రాంగణ నియామకాల్లో మంచి ఉద్యోగం ఖాయం. అంతటితో ఆగిపోవాలనుకోలేదు అదితి. తనది పట్నా. ప్రాంగణ నియామకాల్లో రూ.60 లక్షల ఆఫర్‌ వచ్చినా.. అంతర్జాతీయ సంస్థల కోసం ప్రయత్నించింది. దీనికోసం చాలా కసరత్తే చేసింది. సీనియర్లు, ఫ్రొఫెసర్లతోపాటు లింక్డ్‌ఇన్‌లో నిపుణుల సలహాలూ తీసుకొని ప్రయత్నించింది. ఫేస్‌బుక్‌ లండన్‌ ఆఫీస్‌లో ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజినీర్‌గా రూ.1.6 కోట్ల వేతనంతో ఎంపికైంది.

* క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో తొలి ప్రయత్నంలోనే రూ.14లక్షల ప్యాకేజీ వచ్చింది రాశిబగ్గాకి. తర్వాతా మరొకటి. కానీ వాటిని వదులుకుందామె. ఐఐఐటీ నయా రాయ్‌పుర్‌లో బీఈ విద్యార్థిని తను. ఆమె తీరు చూసి.. అత్యాశ పనికి రాదన్నారంతా. ఆమేమో.. ‘వచ్చినదాంతో సర్దుకుపోతే ఆగిపోతాం. ప్రయత్నిస్తూ వెళితేనే గొప్ప విజయాలు సాధ్య’మని ఇంటర్వ్యూలకు హాజరైంది. కోరుకున్నట్లుగానే ‘అట్లాసియన్‌’లో రూ.85 లక్షల వార్షికాదాయంతో ప్రొడక్ట్‌ సెక్యూరిటీ ఇంజినీర్‌గా ఎంపికైంది.
 

కోడింగ్‌కీ సై!

కోడింగ్‌ అంటే అబ్బాయిలకే అనే తీరుని మారుస్తూ దూసుకొస్తున్నారు అమ్మాయిలు. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ మొదటి ఏడాది నుంచే కోడింగ్‌పై దృష్టిపెట్టిన రేపాక ఈశ్వరీ ప్రియ.. రోజూ కొన్ని కోడింగ్‌ సమస్యలను పరిష్కరించాలని నియమంగా పెట్టుకుంది. అమెజాన్‌ కోడింగ్‌ పోటీలో నెగ్గడమే కాదు.. ఈ వైజాగ్‌ అమ్మాయి మూడో ఏడాదిలోనే ‘అట్లాసియన్‌’లో రూ.84.5 లక్షల వార్షికవేతనంతో ఉద్యోగాన్నీ సంపాదించింది. లాక్‌డౌన్‌ కారణంగా రావూరి పూజితకు పాఠాలు అర్థమవలేదు. దీంతో ఈ గుంటూరమ్మాయి యూట్యూబ్‌ సాయంతో కోడింగ్‌పై పట్టు తెచ్చుకుంది. సీనియర్ల సాయంతో మాక్‌ ఇంటర్వ్యూలనూ సాధన చేసి గూగుల్‌లో రూ.60లక్షల ప్యాకేజీతో కొలువు సాధించింది. టాప్‌ విమెన్‌ కోడర్‌ అంటే ముస్కాన్‌ అగర్వాల్‌ పేరే చెబుతారెవరైనా! ఐఐఐటీ- ఉనా విద్యార్థి తను. కోడింగ్‌ పోటీల్లో పాల్గొని గెలవడమే కాదు.. గుర్తింపునీ తెచ్చుకుంది. అందుకే లింక్డ్‌ఇన్‌ రూ.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం ఆఫర్‌ చేసింది.


 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

‣ డిప్లొమాతో ఎన్‌టీపీసీలో అవకాశాలు

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.