• facebook
  • whatsapp
  • telegram

AP Education: 15 శాతం కోటాపై పీటముడి!

విద్యాసంస్థల్లో స్థానికేతరుల ప్రవేశాలపై అస్పష్టత
రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతున్నందున ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతున్నందున కన్వీనర్‌ కోటా స్థానికేతర ప్రవేశాల్లో 15 శాతం సీట్లలో తెలంగాణ విద్యార్థులకు అవకాశం కల్పించాలా? వద్దా? అనే దానిపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని ఉన్నత విద్యామండలి కోరింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలకు మార్గదర్శకాలనివ్వాలని పేర్కొంది. స్థానికేతర కోటాలో తెలంగాణ విద్యార్థులు పదేళ్లపాటు 2% ప్రవేశాలు పొందేలా పునర్విభజన చట్టంలో పొందుపర్చారు. 2014 జూన్‌ 2 నుంచి పదేళ్లపాటు అంటే 2024 జూన్‌ 2 వరకు ఈ గడువు ముగుస్తుంది. ప్రస్తుతం స్థానికేతర కోటా 15 శాతంలో మెరిట్‌ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఇందులో తెలంగాణ విద్యార్థులతోపాటు ఏపీకి చెందినవారు పోటీ పడుతున్నారు. ఈ కోటాలో మార్పు చేసి స్థానికేతర కోటా 15 శాతాన్ని కొనసాగిస్తే ఏపీకి చెందిన శ్రీవేంకటేశ్వర వర్సిటీ జోన్‌వారు ఆంధ్ర వర్సిటీ జోన్‌లో, ఆంధ్ర వర్సిటీ జోన్‌వారు శ్రీవేంకటేశ్వర వర్సిటీ జోన్‌లో పోటీ పడే అవకాశముంటుంది. ఒకవేళ రాష్ట్రం యూనిట్‌గా చేస్తే రాష్ట్రానికి చెందిన వారందరూ స్థానిక కోటాలోకి వస్తారు. దీనిపై ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సి ఉంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కొత్త జిల్లాలతో కలిపి ఆరు జోన్ల వ్యవస్థను తీసుకురానుంది. ఇవికాకుండా రెండు మల్టీజోన్లను ఏర్పాటుచేయనుంది. ప్రవేశాలకు వచ్చేసరికి శ్రీవేంకటేశ్వర వర్సిటీ, ఆంధ్ర వర్సిటీ రెండు జోన్లుగా ఉంచుతారా? మార్పు చేస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఏటా 2 వేల మంది తెలంగాణవారు
ఇంజినీరింగ్‌, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌తోపాటు ఉన్నత విద్యామండలి నిర్వహించే వివిధ సెట్ల ప్రవేశాల కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటా సీట్లలో 85 శాతం ఏపీ స్థానికత ఉన్న విద్యార్థులకు కేటాయిస్తున్నారు. మిగతా 15 శాతం సీట్లకు ఏపీతోపాటు తెలంగాణ విద్యార్థులు పోటీ పడొచ్చు. మెరిట్‌నుబట్టి వాటిని కేటాయిస్తారు. తెలంగాణలో చదివినవారు ఏటా రెండు వేల మంది వరకు ప్రవేశాలు పొందుతున్నారు. స్థానికేతర కోటాలో ప్రవేశాలు పొందేందుకు తెలంగాణవారు ఏపీలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశాల పరీక్షలు రాస్తున్నారు. ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ జులై, ఆగస్టులలో జరిగినా వీటికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ప్రవేశ పరీక్షలు ఏప్రిల్‌, మేలోనే ప్రారంభమవుతాయి. ప్రవేశ పరీక్షలు నిర్వహించాక నిర్ణయం వెల్లడిస్తే తెలంగాణ విద్యార్థులు విలువైన సమయాన్ని నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
ఉమ్మడి రాష్ట్రస్థాయి ప్రవేశాల్లో ఏం చేస్తారు?
ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలవారు విద్య, ఉద్యోగ అవకాశాల్లో నష్టపోకుండా ఉండేందుకు 1973లో ఆర్టికల్‌ 371 (డి) అమల్లోకి తెచ్చారు. దాని ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలను రాష్ట్రస్థాయివిగా నిర్ణయించారు. వాటిల్లోని సీట్లను ఆంధ్ర వర్సిటీ రీజియన్‌కు 42 శాతం, శ్రీవేంకటేశ్వర రీజియన్‌కు 22 శాతం, తెలంగాణలోని ఉస్మానియా రీజియన్‌కు 36 శాతం కేటాయించాలి. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఈ కోటాలో ఉన్నాయి. విభజన తర్వాత కడపలో ఇటీవల ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ వర్సిటీ ఏర్పాటైంది. పదేళ్లు పూర్తయితే 371(డి) ఆర్టికల్‌ వర్తిస్తుందా? లేదా? అనేదానిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు స్పష్టతనివ్వాల్సి ఉంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.