• facebook
  • whatsapp
  • telegram

Abroad Jobs: ఉపాధికి విదేశాలు వెళ్తున్నారా?

* ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలన్న విదేశాంగశాఖ

* ‘క్రియాశీల రిక్రూటింగ్‌ ఏజెంట్ల జాబితా’ పరిశీలించాలని సూచన



ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారు నకిలీ ఏజెంట్ల మాయలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. మోసపోయిన వారి నుంచి వందల సంఖ్యలో ఇండియన్‌ ఎంబసీకి, హెల్ప్‌డెస్క్‌ నంబర్లకు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నకిలీ ఏజెంట్లను అడ్డుకునేందుకు ‘క్రియాశీల రిక్రూటింగ్‌ ఏజెంట్ల జాబితా’ను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డిసెంబ‌రు 28న‌ పేర్కొంది. నిబంధనల ప్రకారం విదేశాలకు వెళ్లాలనుకున్న ఒక్కొక్కరి నుంచి రూ.30,000 ఏజెంటు రుసుము(18శాతం జీఎస్టీ అదనం)గా వసూలు చేయాలి. కానీ నకిలీ ఏజెంట్లు అమాయకుల నుంచి రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు దోచుకుంటున్నట్లు వారి విచారణలో వెల్లడైంది.

సామాజిక మాధ్యమాలతో ఆకర్షిస్తున్న నకిలీలు

విదేశాంగశాఖ లెక్కల ప్రకారం.. బ్లూకాలర్‌ ఉద్యోగాలకు రాష్ట్రం నుంచి విదేశాలు వెళ్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2020లో 8 వేలు, 2021లో 13వేలు, 2022లో 20,200, 2023లో 30 వేల మందికి పైగా ఉపాధిని వెదుక్కుంటూ వెళ్లినట్లు వలసదారుల రక్షణ అధికారులు చెబుతున్నారు. నిర్మాణరంగం, ఎలక్ట్రీషియన్‌, ప్లంబింగ్‌, ఇంట్లో పనిమనిషి తదితర పనులకు ఎక్కువ మంది విదేశాలకు వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఇలా ఉపాధికి వెళ్లినవారి సంఖ్య మొత్తంగా 8 లక్షలకు చేరుకుంది. అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న నకిలీ ఏజెంట్లు ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఫోన్‌ సందేశాల ద్వారా వీరిని సంప్రదిస్తున్నారు. ఆకర్షణీయ ప్యాకేజీలని ఆశచూపుతూ మోసపుచ్చుతున్నారు. పర్యాటక, విజిట్‌ వీసాలతో పంపించి చిక్కుల్లో పడేయడమే కాకుండా ప్రాణాంతక, కష్టతరమైన పనుల్లో చేర్చుతున్నారు. తీరా మోసపోయామని గుర్తించినా.. వివరాలు తెలియకపోవడంతో వారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది.

గమ్యదేశంలోని పరిస్థితులపై అవగాహన..

గమ్యస్థాన దేశంలో స్థానిక పరిస్థితులు, నిబంధనలపై అవగాహన కల్పిస్తూ విదేశాంగశాఖ ప్రీడిపార్చర్‌ ఓరియంటేషన్‌ ట్రైనింగ్‌ (పీడీవోటీ)ను అందిస్తోంది. రాష్ట్రంలో మాసబ్‌ట్యాంక్‌లోని టామ్‌కామ్‌ వేదికగా ఈ శిక్షణ అందిస్తున్నారు. రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్ల లైసెన్స్‌ నంబర్లను తీసుకొని www.emigrate.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి లేదా టోల్‌ఫ్రీ 1800 11 3090 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు.

ఈ నిబంధనలు తప్పనిసరి..

*
ఏజెంట్లు కొన్ని నిబంధనలు పాటించాలని విదేశాంగశాఖ పునరుద్ఘాటించింది.

* ఉద్యోగులను చేర్చుకోవాలనుకునే విదేశీ యజమాని, రిక్రూట్‌మెంట్‌ ఏజెంట్‌, వలస కార్మికుడు సంతకం చేసిన ఉద్యోగ ఒప్పందంతో ఉపాధి కల్పించాలి. వేతనం, ఇతర చెల్లింపులు, నిబంధనలు, షరతులు తప్పనిసరిగా అందులో పేర్కొనాలి.

* పర్యాటక వీసా కాకుండా ఎంప్లాయ్‌మెంట్‌ లేదా వర్క్‌వీసా లేదా దాంతో సమానమైన వీసా అందించాలి.

* ప్రముఖ విదేశీ కంపెనీలు ఉద్యోగానికి వచ్చేవారికి విమాన ప్రయాణ ఖర్చులు, బస, బీమా సదుపాయాలు కల్పిస్తాయి.

* ఉపాధి కావాలని వెళ్లేవారికి ప్రవాసీ భారతీయ బీమా యోజన(పీబీబీవై) పథకానికి దరఖాస్తు చేయించాలని ఏజెంట్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందులో రూ.275 ప్రీమియంతో రెండేళ్లు, రూ.375 ప్రీమియం చెల్లిస్తే మూడేళ్లపాటు వర్తించేలా రూ.10లక్షల బీమా ప్రయోజనం కలగనుంది.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ రక్షణ రంగంలో మేటి కొలువులు

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.