• facebook
  • whatsapp
  • telegram

Schools: బడుల్లో అసౌకర్యాల తిష్ఠ  

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సరైన సదుపాయాలు కొరవడ్డాయి. దాంతో ఎన్నో ఇక్కట్ల మధ్య చిన్నారులు చదువులు కొనసాగిస్తున్నారు. మౌలిక వసతుల లేమి విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఆటంకంగా నిలుస్తోంది.



కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన యూడైస్‌ ప్లస్‌ 2021-22 నివేదిక ప్రకారం భారతదేశ వ్యాప్తంగా 14.89 లక్షల పాఠశాలల్లో 26.52 కోట్లమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. చాలా పాఠశాలల్లో సౌకర్యాల లేమి చిన్నారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముఖ్యంగా సర్కారీ బడులు కనీస వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. 14శాతం బడులకు ప్రహరీ గోడలు లేవని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సమితి(ఎన్‌సీపీసీఆర్‌) నివేదిక గతంలోనే వెల్లడించింది. దీనివల్ల విద్యార్థులు ఆటలు ఆడుకునే సమయంలో బయటకు వచ్చి ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎన్‌సీపీసీఆర్‌ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 22శాతం పాఠశాలలు శిథిలావస్థకు చేరాయి. 34శాతం బడుల్లో తరగతులకు సరిపడా గదులు లేవు. 44శాతం పాఠశాలలకు భద్రతా ధ్రువపత్రాలు లేవు. కేవలం 14శాతం బడుల వద్దే స్పీడ్‌బ్రేకర్లు ఉన్నాయి. అన్ని చోట్లా స్పీడ్‌ బ్రేకర్లు లేకపోవడం వల్ల పాఠశాలల ఎదుట వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
 

* ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు, మౌలిక వసతులు, బోధన నాణ్యత, అభ్యసన సామర్థ్యాలు, విద్యార్థులు-ఉపాధ్యాయుల నిష్పత్తి తదితరాలను ప్రామాణికంగా తీసుకుని కేంద్ర విద్యాశాఖ ఒకటి నుంచి వెయ్యి పాయింట్లను కేటాయిస్తుంది. ఈ పాయింట్ల ఆధారంగా 28 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పాఠశాలలకు గ్రేడ్‌లను నిర్ణయిస్తూ ఏటా పనితీరు వర్గీకరణ సూచీ(పీజీఐ)ని విడుదల చేస్తుంది. గత జులైలో విడుదలైన సూచీలో 701 నుంచి 1000 పాయింట్ల వరకుగల అయిదు గ్రేడుల్లో దేశంలోని ఒక్క రాష్ట్రమూ నిలవలేకపోయింది. 641 నుంచి 700 పాయింట్లతో కూడిన ఆరో గ్రేడును చండీగఢ్‌(659), పంజాబ్‌(647) రాష్ట్రాలు మాత్రమే సాధించాయి. గుజరాత్‌, కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలు 581 నుంచి 640 పాయింట్లతో      ఏడో గ్రేడులో నిలిచాయి. 543.8 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్‌ ఎనిమిదో గ్రేడ్‌కు, 479.9 పాయింట్లతో తెలంగాణ తొమ్మిదో గ్రేడ్‌కు పరిమితమయ్యాయి.

* దేశీయంగా పన్నెండు వేల ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని నిరుడు కేంద్ర విద్యాశాఖ రాజ్యసభలో వెల్లడించింది. ఎకాయెకి అయిదు లక్షలకు పైగా సర్కారీ బడుల్లో కనీసం నల్లా నీటి వసతి సైతం కరవైంది. దాదాపు పద్దెనిమిది వేల స్కూళ్లలో మంచినీటికీ దిక్కులేదు. విద్యాహక్కు ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు సర్కారీ బడుల్లో పెద్దయెత్తున మరుగుదొడ్లు నిర్మించామని చెబుతున్నా, చాలాచోట్ల అవి వినియోగంలో లేవని భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక గతంలో నిగ్గుతేల్చింది. కనీస వసతుల లేమి వల్ల చాలాచోట్ల బాలికలను తల్లిదండ్రులు అర్ధాంతరంగా చదువు మాన్పిస్తున్నారని పరిశీలనలు చెబుతున్నాయి.


 

* పాఠశాలల్లో వసతులు కల్పించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని సుప్రీంకోర్టుతో పాటు పలు హైకోర్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎన్నోసార్లు ఆదేశించాయి. అయినా పాలకుల్లో చలనం ఉండటం లేదు. కనీస సౌకర్యాలు కరవై ఇబ్బందుల మధ్యే విద్యార్థులు కష్టంగా చదువులు కొనసాగిస్తున్నారు. మరోవైపు కేవలం 57శాతం విద్యార్థులే మధ్యాహ్న భోజన పథకం అమలు పట్ల సంతృప్తిగా ఉన్నట్లు ఎన్‌సీపీసీఆర్‌ నివేదిక వెల్లడించింది. పలు సర్వేలు, సంస్థలు సైతం దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై ఆందోళన వ్యక్తం చేశాయి. భోజనం నాణ్యంగా లేక దేశంలో ఏటా రెండు వేల మంది దాకా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అంచనా. పాఠశాలల్లో వసతుల కల్పనకు బడ్జెట్లలో అధిక నిధులను ప్రభుత్వాలు కేటాయించాలి. చిన్నారులకు సరిపడా తరగతి గదులు నిర్మించాలి. శిథిలావస్థకు చేరిన భవనాల స్థానంలో కొత్తవాటిని నిర్మించాలి. పిల్లల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు నిర్మించి వాటిలో నీటి వసతి కల్పించాలి. బడుల చుట్టూ ప్రహరీగోడలు, మధ్యాహ్న భోజనం వండేందుకు వంటశాలలు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్న భోజనం విషయంలో అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి, అది నాణ్యంగా ఉండేలా పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. క్రీడా, భోజన విరామాల సమయంలో విద్యార్థులు బడి బయటకు వెళ్ళి ప్రమాదాలకు గురవకుండా బడుల్లో పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉంది.
                                       

- ఎ.ప్రభాకర్‌రెడ్డి



మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.