• facebook
  • whatsapp
  • telegram

Higher Education: ఉపాధికి ఊతం.. ఉన్నత విద్యలో ‘నైపుణ్యం’!

* ప్రతి కోర్సుకు పరిశ్రమలతో అనుసంధానం

* రాష్ట్రంలో 10 స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు
 

ఈనాడు, హైదరాబాద్‌: నైపుణ్య, ఉద్యోగ ఆధారిత ఉన్నతవిద్యను అందించే దిశగా.. 10 స్కిల్‌ యూనివర్సిటీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని సాధ్యాసాధ్యాలు, ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ 2015లో జాతీయ నైపుణ్య విశ్వవిద్యాలయాల బిల్లును అమల్లోకి తీసుకువచ్చింది. దీనికింద ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కిల్‌ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి. మొట్టమొదటగా హరియాణాలో శ్రీవిశ్వకర్మ స్కిల్‌ యూనివర్సిటీ (ప్రభుత్వ) 2016లో ఏర్పాటైంది. 2020లో ఏర్పాటైన దిల్లీ నైపుణ్య యూనివర్సిటీకి దేశ రాజధాని పరిసరాల్లో 19 క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ నైపుణ్య యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు లోబడి డిప్లొమా, డిగ్రీ, పీజీ కోర్సులను అందించడంతో పాటు ప్రతి కోర్సుకు ఒక పరిశ్రమతో అనుసంధానమవుతాయి. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల సహాయంతో నైపుణ్య శిక్షణ, ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ అందిస్తున్నాయి.

ఎంపిక విధానం


నైపుణ్య యూనివర్సిటీలకు ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులకు అడ్మిషన్లు ఇస్తారు. డిగ్రీ తదితర కోర్సులతో పాటు తక్కువ చదువుకుని వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్నవారి కోసం ఈ వర్సిటీలు స్వల్పకాలిక కోర్సులు నిర్వహిస్తున్నాయి. 8వ తరగతి కనీస అర్హతగా ఆయా రంగాల్లో మెరుగైన నైపుణ్యాలు సాధించేందుకు 1-3 నెలల స్వల్పకాలిక సర్టిఫికెట్‌ కోర్సులు ఉన్నాయి.

ప్రధాన రంగాలు

టెక్నాలజీ, వ్యవసాయం, ఫుడ్‌ టెక్నాలజీ, డిజైన్‌, క్రియేటివిటీ, సుస్థిరత, మొబిలిటీ, మేనేజ్‌మెంట్‌, ఫైనాన్స్‌, టూరిజం, హాస్పిటాలిటీ, వెల్‌నెస్‌, హెల్త్‌కేర్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, ఇన్నోవేషన్‌, లైఫ్‌స్కిల్స్‌, లాంగ్వేజెస్‌, లాజిస్టిక్స్‌, బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఐటీ, నిర్మాణం, టెక్స్‌టైల్‌, గ్రీన్‌జాబ్స్‌, ప్లాస్టిక్‌ టెక్నాలజీ వంటివి.
 

కోర్సులు


స్వల్పకాల వ్యవధితో కూడిన సర్టిఫికెట్‌ కోర్సులు, దీర్ఘకాల పరిమితితో కూడిన డిప్లొమా, డిగ్రీ, పీజీ స్థాయి ఒకేషనల్‌ కోర్సులు ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలు పీహెచ్‌డీ కూడా ఇస్తున్నాయి. డిగ్రీ కోర్సులకు ఏఐసీటీఈ నిబంధనల మేరకు విద్యార్హతలు ఉన్నాయి. డిప్లొమా కోర్సులకు 10 లేదా 8వ తరగతితో ఐటీఐ, డిగ్రీ కోర్సులకు ఇంటర్‌ లేదా 10వ తరగతితో రెండేళ్ల ఐటీఐ కోర్సులు చేసిన వారికి ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 

ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ (ఓజేటీ)


నైపుణ్య కోర్సులు అభ్యసించే విద్యార్థులు అనుభవం కోసం తప్పనిసరిగా సంబంధిత పరిశ్రమల్లో పనిచేయాలి. ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ పేరుతో పిలిచే ఈ తర్ఫీదును అకడమిక్‌ క్రెడిట్స్‌తో అనుసంధానం చేస్తారు. 90 శాతానికి పైగా హాజరుతో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి అకడమిక్‌ క్రెడిట్స్‌ దక్కుతాయి. శిక్షణ సమయంలో నేర్చుకున్న విషయాలు, అనుభవాలు, ఎదురైన సవాళ్లను ఆన్‌లైన్‌ ఓజేటీ పోర్టల్‌లో నమోదు చేయాలి.
 





మరింత సమాచారం... మీ కోసం!

‣ ఫర్నిచర్‌ డిజైన్‌ కెరియర్‌ గైడెన్స్‌

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ ఇగ్నోలో నాన్‌ టీచింగ్‌ కొలువులు

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.