• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగుల కొరత

* మొత్తం 341 మంది అవసరం

* గత సర్కారు ఇచ్చినవి 38 మాత్రమే


ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కీలకమైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసెస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ)లో ఉద్యోగుల కొరత నెలకొంది. తక్కువ మంది సిబ్బంది ఉండటంతో వారిపై పనిభారం పెరగడంతో పాటు ఉద్యోగాల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షా కేంద్రాల గుర్తింపు, అభ్యర్థులకు కేంద్రాల కేటాయింపు, ప్రాథమిక, తుది ‘కీ’ల వెల్లడి, మూల్యాంకనం, 1 : 2 నిష్పత్తిలో జాబితాల ప్రకటన, ధ్రువీకరణ పత్రాల పరిశీలనలు, న్యాయవివాదాల పరిష్కారం, తుది ఎంపికలు, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ తదితర పనులన్నీ కమిషన్‌లో ఉన్న కొద్దిమంది సిబ్బందే చూడాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల పీఎస్సీలతో సమానంగా టీఎస్‌పీఎస్సీలో ఉద్యోగుల సంఖ్యను పెంచాలంటూ కొన్నేళ్లుగా విజ్ఞప్తి చేసినా అందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. ప్రశ్నపత్రాల లీకేజీ అనంతరం కమిషన్‌ బలోపేతం, అదనపు సిబ్బంది నియామకంపై ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. భవిష్యత్తులో ఎలాంటి లీకేజీలకు ఆస్కారం లేకుండా, ఆన్‌లైన్‌ పద్ధతిలో వేగంగా నియామకాలు చేపట్టేందుకు అదనపు సిబ్బందితో పాటు పటిష్ఠమైన ఐటీ కేంద్రం, నిపుణుల నియామకాలు చేపట్టాల్సిన అవసరముంది.


* 127 పోస్టులతోనే టీఎస్‌పీఎస్సీ ఏర్పాటు

ఏపీపీఎస్సీ నుంచి విభజన ప్రక్రియలో భాగంగా 114 మంది సిబ్బందిని టీఎస్‌పీఎస్సీకి కేటాయించారు. అయితే 106 మంది మాత్రమే టీఎస్‌పీఎస్సీకి బదిలీ అయ్యారు. వారిలో 20 మంది నాలుగో తరగతి సిబ్బంది ఉన్నారు. అదనంగా మంజూరు చేసిన వాటితో కలిపి 127 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ ఏర్పాటైంది. నాలుగో తరగతి, పరిపాలన సిబ్బందిని పక్కనపెడితే.. కేవలం 30 మంది మాత్రమే పరీక్షల నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ప్రభుత్వ నియామక పరీక్షలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు కనీసం 341 మంది సిబ్బంది అవసరమని గతంలోనే ప్రభుత్వానికి కమిషన్‌ నివేదిక సమర్పించింది. అదనంగా 214 పోస్టులు మంజూరు చేయాలంటూ వీరభద్రయ్య కమిటీ అయిదేళ్ల క్రితమే నివేదిక ఇచ్చింది. అయితే గత ప్రభుత్వం 38 పోస్టులు మాత్రమే మంజూరు చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీలో సిబ్బంది సంఖ్య 165కి పెరిగింది. కొత్తగా మంజూరు చేసిన పోస్టులకైనా ప్రభుత్వం నియామకాలు చేపట్టిందా అంటే అదీ లేదు. విభజన ప్రక్రియలో బదిలీ అయిన సిబ్బందిలో 30 మందికిపైగా పదవీ విరమణ చేశారు. దీంతో తక్కువ మందితో కార్యకలాపాల నిర్వహణ కష్టంగా మారింది. కీలకమైన కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ బలహీనంగా ఉండటంతోనే గతంలో ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. పరీక్షల నిర్వహణ, కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ పర్యవేక్షణ కోసం ఇతర రాష్ట్రాల పీఎస్సీల తరహాలో కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌(సీవోఈ)ను ప్రభుత్వం నియమించింది. అయితే, సీవోఈ సంతోష్‌ బదిలీ కావడంతో ఈ పోస్టు కూడా ఖాళీ అయింది. కమిషన్‌లో మొత్తం 341 మంది సిబ్బంది ఉండాలంటే.. కొత్త ప్రభుత్వం మరో 176 పోస్టులు మంజూరు చేసి, నియమించాల్సిన అవసరం ఉంది.
 

కేరళలో ఇలా..


టీఎస్‌పీఎస్సీ సంస్కరణ ప్రక్రియలో భాగంగా ఉన్నతాధికారులు ఇప్పటికే కేరళ పీఎస్సీని సందర్శించారు. అక్కడి పీఎస్సీలో దాదాపు 1,600 మంది పనిచేస్తున్నారు. అత్యధిక మంది సిబ్బందితో దేశంలోనే అతిపెద్ద కమిషన్‌గా పేరొందింది. ప్రతిఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తూ, ప్రస్తుతం సర్వీసులోని ఉద్యోగి పదవీ విరమణ చేసేనాటికి కొత్త ఉద్యోగుల నియామకాలు పూర్తి చేస్తోంది. తద్వారా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తుండటమే కాదు.. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలనూ సృష్టిస్తోంది. జిల్లాస్థాయిలో ఉపాధి కల్పన కేంద్రాలను రద్దు చేసి.. వాటిని పబ్లిక్‌ సర్వీసెస్‌లో విలీనం చేసి జిల్లాస్థాయి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఏర్పాటు చేసింది. కేరళ పీఎస్సీ పరిధిలో మూడు ప్రాంతీయ కమిషన్‌ కార్యాలయాలు, 14 జిల్లా కార్యాలయాలు ఉన్నాయి. పోలీసు, పాఠశాల విద్య నియామకాలు మినహా మిగతా పోస్టులన్నీ కేరళ పీఎస్సీయే భర్తీ చేస్తోంది.
 



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.