• facebook
  • whatsapp
  • telegram

Education: నాసిరకం ఇంజినీరింగ్‌ కళాశాలల మూతే!

* గ్రామీణ జిల్లాల్లోని కాలేజీలపైనా తీవ్ర ప్రభావం

* నాణ్యమైన విద్యకు పోటీ పడేలా చేయడమే లక్ష్యమని ఏఐసీటీఈ వెల్లడి


ఈనాడు, హైదరాబాద్‌: విద్యా ప్రమాణాలు పాటించని ఇంజినీరింగ్‌ కళాశాలల మనుగడ ఇక కష్టమే. కొన్ని కొలమానాల ఆధారంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతినివ్వడంతో సరైన ప్రమాణాలు పాటించని కళాశాలల యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న సుమారు 50 కాలేజీలు సమీప భవిష్యత్తులో మూతపడక తప్పదని తెలుస్తోంది. 


సీట్లు 15 వేల వరకు పెరిగే అవకాశం...

రాష్ట్రంలో కంప్యూటర్‌ సైన్స్‌కు డిమాండ్‌ భారీగా ఉన్నా ఈ విద్యా సంవత్సరం (2023-24) కన్వీనర్‌ కోటాలో దాదాపు 6 వేల వరకు సీఎస్‌ఈ, ఐటీ సీట్లు మిగిలిపోయాయి. అవన్నీ నాసిరకం కళాశాలలుగా భావిస్తున్న వాటిలోనివే. ఎంసెట్‌లో అర్హత సాధించిన ప్రతి విద్యార్థీ మంచి కళాశాలలో సీటు సాధించాలని పోటీపడడం సహజం. ఈసారి స్వయంప్రతిపత్తి ఉన్నా,  న్యాక్‌ ‘ఏ’ గ్రేడ్‌ సాధించినా,  50 శాతం కోర్సులకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడేషన్‌ (ఎన్‌బీఏ) గుర్తింపు పొందినా... ఆయా కళాశాలలు ఎన్ని సీట్లయినా పెంచుకునే వెసులుబాటును ఏఐసీటీఈ కల్పించింది. రాష్ట్రంలో 156 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలుండగా...వాటిలో ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం 50-60 కళాశాలలకు సీట్లు పెంచుకునే అవకాశం కలగనుంది. కాకపోతే పెంచుకునే సీట్లకు తగినట్లు మౌలిక వసతులు, అధ్యాపకులు ఉంటే చాలు. ఈ ప్రకారం సీఎస్‌ఈ, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 10 వేల నుంచి 15 వేల వరకు బీటెక్‌ సీట్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నామని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల ప్రతినిధి డాక్టర్‌ శ్రీని భూపాళం అభిప్రాయపడ్డారు. ‘సాఫ్ట్‌వేర్‌ కారణంగా ఇంజినీరింగ్‌లో కొన్ని బ్రాంచీలకు డిమాండ్‌ పెరిగినా కొత్తగా డీమ్డ్‌, ప్రైవేట్‌ వర్సిటీలు రావడం, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో కొత్తగా వర్సిటీ కళాశాలలను నెలకొల్పడం వల్ల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ప్రైవేట్‌ కళాశాలల్లో చేరేవారి సంఖ్యలో పెద్ద మార్పు ఉండడం లేదు. పేరు పొందిన కళాశాలల్లో సీట్లు పెరిగితే ఆ ప్రభావం చిన్న కళాశాలలు, అంతగా ప్రమాణాలు పాటించని, ప్రాంగణ నియామకాలపై దృష్టి పెట్టని కళాశాలల్లో సీట్లకు డిమాండ్‌ తగ్గుతోంది’ అని సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.


ఆ కళాశాలల యాజమాన్యాల్లో వణుకు...

మొత్తం 156 ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కేవలం 36 మాత్రమే గ్రామీణ జిల్లాల్లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ.. సమీపంలోనే 120 కళాశాలలున్నాయి. ఇంజినీరింగ్‌ను హైదరాబాద్‌లో చదివితే కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు పెంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటోందని విద్యార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని కళాశాలల్లో సీట్ల సంఖ్యను ఇబ్బడిముబ్బడిగా మంజూరు చేయవద్దని, దాని ప్రభావం తమ కళాశాలలపై పడుతుందని గ్రామీణ  ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దానికితోడు స్వయంప్రతిపత్తి కళాశాలల్లో మార్కులు ఎక్కువగా వస్తాయన్న భావన ఉంది. వాటిలో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. గ్రామీణ జిల్లాల్లోని కళాశాలల్లో సుమారు 20 వేల సీట్లున్నాయి. కొత్త విధానంతో సీట్ల సంఖ్య పెరిగితే ఆ ప్రభావం తమపై పడుతుందని ఆయన చెప్పారు.
మంచి వాటిని ప్రోత్సహిస్తాం


విద్యా ప్రమాణాలను పెంచేందుకు కళాశాలల మధ్య పోటీ పెరిగేలా చేస్తున్నాం. సీట్ల సంఖ్యపై పరిమితి ఎత్తివేసినంత మాత్రాన 400 సీట్లున్న కళాశాలలకు 4 వేల సీట్లను ఇవ్వం.  సీట్లను క్రమేణా పెంచుతాం. మంచి కళాశాలలకు ఆకాశమే హద్దు. వాటికి ఆఫ్‌ క్యాంపస్‌లు పెట్టుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. ప్రమాణాలు పాటించే వాటిని అన్ని విధాలా ప్రోత్సహిస్తాం. నాసిరకం కళాశాలలపై చర్యలు ఉంటాయి.

                                         - అభయ్‌ జెరే, ఏఐసీటీఈ ఉపాధ్యక్షుడు

 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త ఏడాది.. కొంగొత్త అవకాశాలు

‣ కాలేజీ విద్యార్థులకు కెరియర్‌ ట్రైనింగ్‌

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ సీసీఎంబీలో ఉద్యోగావకాశాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.