• facebook
  • whatsapp
  • telegram

 TG TET: టెట్‌ మార్కుల కేటాయింపు ఎలా?  

* కొన్ని జిల్లాలవారికి ప్రశ్నపత్రాలు సులభం.. మరికొన్ని జిల్లాలవారికి కఠినం

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)ను తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించిన విద్యాశాఖ.. ఇప్పుడు ఏ విధానంలో మార్కులను కేటాయిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఆఫ్‌లైన్‌ పరీక్షలప్పుడు పాటించే సంప్రదాయ విధానంలోనా.. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించినప్పుడు ఇస్తున్న నార్మలైజేషన్‌ విధానంలోనా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏ జిల్లాకు ఆ జిల్లా ప్రశ్నపత్రం వేరుగా ఉండటం.. ఉపాధ్యాయ పోస్టులు జిల్లా స్థాయివి కావడంతో నార్మలైజేషన్‌ విధానం అవసరం లేదని విద్యాశాఖ భావిస్తోంది. నార్మలైజేషన్‌ విధానం లేకుంటే కొన్ని జిల్లాల వారికి లాభం.. మరికొన్ని జిల్లాల వారికి నష్టం

ఆన్‌లైన్‌ విధానంలో వేర్వేరు ప్రశ్నపత్రాలు..

రాష్ట్రంలో టెట్‌ పరీక్షలు జూన్‌  2వ తేదీతో ముగిశాయి. పేపర్‌-1కు 85,996 మంది, పేపర్‌-2కు 1,50,491 మంది హాజరయ్యారు. పేపర్‌-1ను మే 30 నుంచి జూన్‌ 2వ తేదీ వరకు జరిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం పేపర్‌-2ను మే 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించారు. గతంలో ఆఫ్‌లైన్‌ (పెన్ను, పేపర్‌) విధానంలో ఒకే రోజు పరీక్ష జరిపేవారు. అభ్యర్థులందరికీ ఒకటే ప్రశ్నపత్రం ఉండేది. ఈసారి ఆన్‌లైన్‌ విధానం కావడంతో వేర్వేరు ప్రశ్నపత్రాలు ఇవ్వాల్సి వచ్చింది.

అభ్యర్థుల అభ్యంతరమిదీ...

ఆన్‌లైన్‌ విధానం వల్ల కొన్ని జిల్లాల వారికి ప్రశ్నపత్రాలు సులభంగా, మరికొన్ని జిల్లాల వారికి కఠినంగా వచ్చాయి. ఉపాధ్యాయ నియామకాలకు నిర్వహించే డీఎస్‌సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. 150 మార్కులు తెచ్చుకుంటే డీఎస్‌సీ తుది పరీక్షకు 20 మార్కులు కలుపుతారు. అంటే టెట్‌లో ప్రతి ఏడున్నర మార్కులకు(కనీస మార్కులు సాధించి అర్హత పొందినవారికి) ఒక మార్కు డీఎస్‌సీలో కలుస్తుంది. అందువల్ల ప్రతి మార్కూ కీలకమే. మార్కులు పెంచుకునేందుకు కొందరు అభ్యర్థులు ప్రతిసారీ టెట్‌ రాస్తుంటారు. ఈసారి నిర్వహించిన పరీక్షల్లో కొన్ని జిల్లాల వారికి ఇచ్చిన ప్రశ్నపత్రాలు సులభంగా ఉండటంతో డీఎస్‌సీ ర్యాంకుల్లో వారు ముందువరసలో ఉంటారన్నది మిగతా అభ్యర్థుల ఆందోళన. డీఎస్‌సీలో 5 శాతం స్థానికేతర(నాన్‌-లోకల్‌) కోటా ఉంది. టెట్‌లో ప్రశ్నపత్రం సులభంగా వచ్చినవారికి స్కోర్‌ ఎక్కువ ఉండి.. స్థానిక జిల్లాలో పోస్టులు లేనివారు ఇతర జిల్లాల్లో డీఎస్‌సీకి పోటీ పడతారని, తక్కువ స్కోర్‌ వచ్చినవారు పోటీపడలేరని అభ్యర్థులు పేర్కొంటున్నారు.

టీజీటీ పోస్టుల్లో..

గురుకులాల్లోని ట్రైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ టీచర్‌ (టీజీటీ) పోస్టులు జోనల్‌ స్థాయిలో ఉంటాయి. ఆ జోన్‌ పరిధిలోని అన్ని జిల్లాలవారు పోటీపడొచ్చు. టెట్‌ ప్రశ్నపత్రం సులభంగా వచ్చినవారు ఎక్కువ ప్రయోజనం పొందుతారన్నది కొందరు అభ్యర్థుల వాదన. ఉదాహరణకు గురుకుల టీజీటీ పోస్టుల్లో ములుగు జిల్లా కాళేశ్వరం జోన్‌లో ఉంది. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు కూడా అదే జోన్‌లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల వారికి టెట్‌ ప్రశ్నపత్రం వేర్వేరుగా ఇచ్చారు. జనగామ, నల్గొండ జిల్లాలు యాదాద్రి జోన్‌లో ఉన్నాయి. టెట్‌ ప్రశ్నపత్రాలు మాత్రం వేర్వేరు. టెట్‌ ప్రశ్నపత్రం ఒకరికి సులభం.. మరొకరికి కఠినంగా రావడం వల్ల గురుకుల నియామకాల్లో కొందరికి అన్యాయం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నార్మలైజేషన్‌ విధానంలోనే మార్కులు ఇచ్చారని వారు గుర్తుచేస్తున్నారు. ప్రశ్నపత్రాలు కఠినంగా వచ్చినవారికి ఈ విధానంలో మార్కులు కేటాయిస్తే చాలావరకు న్యాయం జరుగుతుందని వారు భావిస్తున్నారు. 

అధికారులు ఏమంటున్నారంటే..

అభ్యర్థులు ఏ జిల్లాలో పరీక్ష రాసినా ఒకే జిల్లా స్థానికత కలిగినవారికి ఒకటే ప్రశ్నపత్రం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, దానివల్ల ప్రశ్నపత్రాలు వేర్వేరుగా ఉన్నా ఒక జిల్లావారు మరో జిల్లావారికి పోటీ కారని చెబుతున్నారు. అందువల్ల నార్మలైజేషన్‌ విధానం అవసరం లేదని, సంప్రదాయ విధానంలోనే మార్కులు ఇవ్వొచ్చని చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ నార్మలైజేషన్‌ విధానం లేకుంటే అన్యాయం జరుగుతుందని కొందరు అభ్యర్థులు చెబుతున్నారని, జిల్లాస్థాయి పోస్టులు అయినందువల్ల సమస్య లేదన్నారు. కాకపోతే స్థానికేతర కోటాలో పోటీకి పలు జిల్లాల వారు వస్తారని, అప్పుడు కొంత సమస్య ఎదురుకావొచ్చని పేర్కొన్నారు. ఈ సమస్యపై అన్ని కోణాల్లో లోతుగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!

‣ డేటాసైన్స్‌తో ఉద్యోగ అవకాశాలు!

‣ ఐటీఐతో ఉద్యోగ అవకాశాలు!

‣ రాతల్లో తగ్గినా.. మాటతో మెరిశారు!

‣ ఇంటర్‌తో త్రివిధ దళాల్లో ఉద్యోగాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.