విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ నైపుణ్యాలు  

 *కృత్రిమే మేధ, ఐఓటీ, క్లౌడ్‌ విభాగాల్లో ఉచితంగా 1500 కోర్సు- మాడ్యూల్స్‌
ఈనాడు - హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), డేటా సైన్సెస్‌, క్లౌడ్‌... వంటి నూతన తరం టెక్నాలజీ విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకులను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో  మైక్రోసాఫ్ట్‌ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని ప్రకారం మైక్రోసాఫ్ట్‌ దాదాపు 1500 కోర్సు- మాడ్యూల్స్‌ ను ఏఐసీటీఈ ఇ -లెర్నింగ్‌ పోర్టల్‌ - ఈఎల్‌ఐఎస్‌ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులకు ఉచితంగా అందిస్తుంది. మైక్రోసాఫ్ట్‌కు చెందిన బోధనా వనరుల కేంద్రం అయిన ‘మైక్రోసాఫ్ట్‌ లెర్న్‌’ ను, ఏఐసీటీఈ కి చెందిన ఈఎల్‌ఐఎస్‌ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానించి విద్యార్థులు తమంతట తాము నేర్చుకునేందుకు వీలు కల్పిస్తారు. అధ్యాపకులకు ‘బోధనా పద్ధతులు - టీచింగ్‌ సామగ్రి’ అందుబాటులోకి తీసుకువస్తారు.
దేశీయంగా టెక్నాలజీ నైపుణ్యాలను బహుముఖంగా పెంపొందించాలనే లక్ష్యానికి అనుగుణంగా ఏఐసీటీఈతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ మహేశ్వరి వివరించారు. కొవిడ్‌-19 వల్ల సాంకేతిక సహకారంతో విద్యార్థులు ముందుకు సాగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకు తమవంతుగా చేయూత అందించదలిచామని ఆయన పేర్కొన్నారు.
            ఏఐసీఈటీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ అనిల్‌ సహస్రబుధే స్పందిస్తూ, విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రావాలంటే వారికి నైపుణ్యాలు ఎంతగానో అవసరమని వివరించారు. మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం ఇందుకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా 18 కంటే పైన వయస్సు గల విద్యార్థులు ‘మైక్రోసాఫ్ట్‌ అజూరే’ కలిసి నడిచే అవకాశం ఉంటుంది. మొబైల్‌ యాప్స్‌ తయారు చేయడం, ఏఐ ఆధారిత సేవలు- ఉత్పత్తులు ఆవిష్కరించడం, బిగ్‌ డేటా అనాలసిస్‌... వంటి విభాగాల్లో పనిచేస్తూ 100 డాలర్ల ‘అజూరే క్రెడిట్‌’ పొందవచ్చు. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తూ, లైవ్‌ వెబినార్‌లను మైక్రోసాఫ్ట్‌ నిర్వహిస్తుంది. అంతేగాక ఆర్థిక స్థోమత లేని విద్యార్థుల కోసం ‘1,000 వరకూ మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ ఎగ్జామ్‌ ఓచర్స్‌’ ను మైక్రోసాఫ్ట్‌ స్పాన్సర్‌ చేస్తుంది.

Updated at : 13-10-2020 12:30:20

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం