• facebook
  • whatsapp
  • telegram

జ‌న‌వ‌రిలోనే పోలీసు ఉద్యోగాల ప్రకటన!

* ప్రత్యేక యాప్‌ ద్వారా నియామక ప్రక్రియ


ఈనాడు - హైదరాబాద్‌: ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోలీసుశాఖలో పోస్టుల నియామకానికి అధికారులు చర్యలు చేపట్టారు. జ‌న‌వ‌రిలోనే ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని తెలిసింది. ఈసారి నియామక ప్రక్రియని మరింత సరళం చేసేందుకు.. ప్రత్యేక యాప్‌ రూపొందించాలని పోలీసు నియామక మండలి అధికారులు యోచిస్తున్నారు. తద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని భావిస్తున్నారు.

పోలీసుశాఖలో ప్రస్తుతం 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పోస్టుల భర్తీని పోలీసు నియామక మండలి చేపడుతుంది. 2018 మేలో నియామక మండలి దాదాపు 16 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి రావడంతో అందుకు తగ్గట్టుగా నూతన సాంకేతిక పరిజ్ఞానాల వినియోగంపై దృష్టిసారించారు.

పోలీసు నియామక ప్రక్రియ మిగతా ఉద్యోగాల భర్తీ కంటే భిన్నంగా ఉంటుంది. సమయమూ ఎక్కువ పడుతుంది. రాత పరీక్షలతో పాటు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలి. అన్నింటిలోనూ ఉత్తీర్ణులై ఎంపికైన వారికి సంవత్సరంపాటు శిక్షణ ఉంటుంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే నియామక ప్రకటన జారీచేయాలని అధికారులు భావిస్తున్నారు. వచ్చే నెలాఖరుకల్లా ప్రకటన విడుదల చేయగలిగితే నియామకాలు పూర్తిచేయడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. తర్వాత సంవత్సర కాలం శిక్షణ కొనసాగుతుంది. ఈ లెక్కన 2021 జనవరిలో ప్రకటన విడుదలైతే అర్హత పొందిన వారు 2022 ఏప్రిల్‌ తర్వాతే ఉద్యోగాల్లో చేరే అవకాశం ఉంటుంది. అది కూడా అంతా సవ్యంగా జరిగితేనే. ఈ అంశాల దృష్ట్యా ప్రభుత్వం ఆమోదం తెలపగానే పోలీసు అధికారులు నియామక ప్రక్రియ ప్రారంభించారు. అన్నీ అనుకూలంగా ఉంటే జనవరి నెలాఖరుకల్లా ఉద్యోగ ప్రకటన జారీ అయ్యే అవకాశం ఉంది.

నియామకాలకు ప్రత్యేక యాప్‌

గత రెండు నియామకాల నుంచి పోలీసు ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశాక.. తమ పేరు తప్పుగా నమోదయిందని, కులం పేర్కొనలేదని చెబుతూ రకరకాల ఫిర్యాదులు అందుతున్నాయి.ఈ సమస్యలను నివారించేందుకు ఈసారి నియామకాల కోసం ప్రత్యేకంగా యాప్‌ రూపొందించే ఆలోచనలో అధికారులు ఉన్నారు. అభ్యర్థులంతా ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు దొర్లినా వెంటనే సరిదిద్దుకోవచ్చు. నియామకాలపై మండలి తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు యాప్‌ ద్వారా అభ్యర్థులకు చేరవేయవచ్చు. అభ్యంతరాల స్వీకరణ, అనుమానాల నివృత్తి చేయవచ్చు. ఇలా మెరుగైన నిర్వహణ కోసం ప్రత్యేక యాప్‌ అభివృద్ధి చేసి దాని ద్వారా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని భావిస్తున్నారు.

Updated Date : 17-12-2020 11:01:55

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం