• facebook
  • whatsapp
  • telegram

పీజీ వ‌ర‌కు అందరికీ ఉచిత విద్య‌!

ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో కొత్త కోర్సులు
2020-21 నుంచి ప్రారంభించేందుకు అనుమతి
‣​​​​​​​ వచ్చే ఏడాదికి మరిన్ని అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గురుకులాలు కొత్తరూపు సంతరించుకున్నాయి. గతంలో ఇంటర్మీడియట్‌ వరకే పరిమితమైన ఈ  విద్యాసంసలు మూడేళ్ల క్రితం డిగ్రీ కోర్సుల్లోకి అడుగుపెట్టాయి. తాజాగా పీజీ కోర్సులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. ఫలితంగా ప్రభుత్వం ప్రకటించిన ‘కేజీ టూ పీజీ ఉచిత విద్య’ కార్యక్రమం అమలు కీలకదశకు చేరుకున్నట్లయింది. గురుకులాల్లో ఐదో తరగతిలో అడుగుపెట్టే పిల్లలు పైసా కట్టనవసరం లేకుండా, ప్రతిభ ఆధారంగా ఉచిత వసతితో పీజీ కోర్సులు చదివేందుకు అవి అవకాశాన్నిస్తున్నాయి. 2020-21 నుంచి తొలుత ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో కనీస మౌలిక సదుపాయాలున్న కళాశాలల్లో పీజీ, ప్రొఫెషనల్‌ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) అనుమతించింది. ఈ ఏడాదికి దక్షిణ తెలంగాణలో ప్రారంభించి, తర్వాత ఉత్తర తెలంగాణ పరిధిలోని కొన్ని గురుకులాల్లో పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. కామన్‌ పీజీ ప్రవేశపరీక్ష(సీపీజీఈటీ)లో సాధించే ర్యాంకుల ఆధారంగా వీటిలో సీట్లు లభ్యమవుతాయి. ఈ ఏడాది నుంచి తొలిసారిగా న్యాయవిద్య కోర్సు ప్రారంభమైంది. 

ఏ సొసైటీ పరిధిలో ఎన్ని కాలేజీలు?

రాష్ట్రంలో ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో 30, ఎస్టీ సొసైటీ పరిధిలో 22, బీసీ సొసైటీ పరిధిలో ఒక డిగ్రీ కళాశాల ఉన్నాయి. బీసీ సొసైటీ పరిధిలో కళాశాలల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఉన్నా అమలు కాలేదు. ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల పరిధిలో డిగ్రీ కళాశాలలు ప్రారంభించి మూడేళ్లయింది. కొన్ని గురుకులాల్లో ప్రత్యేక డిగ్రీ కోర్సులు జరుగుతున్నాయి. వీటిని పీజీ, ప్రొఫెషనల్‌ కళాశాలల సాయికి చేర్చాలన్న ఆలోచన చేశాయి. ఇంజినీరింగ్, నర్సింగ్, పీజీ, న్యాయ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల కోసం ప్రత్యేక కళాశాలలు స్థాపించాల‌ని ప్రణాళికలు వేశాయి. ఇందులో భాగంగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐదు కోర్సులు ప్రవేశపెట్టి 260 సీట్లు అందుబాటులోకి తెచ్చాయి. 
* ఓయూ పరిధి ఎస్సీ గురుకుల సొసైటీ ఆధ్యర్యంలో నడుస్తున్న ఇబ్రహీంపట్నం గురుకుల కళాశాలలో ఎంఏ ఆంగ్లం, బుద్వేల్‌లో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, మహీంద్రహిల్స్‌లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, సంగారెడ్డిలో ఎంకామ్‌ కోర్సులకు అనుమతి లభించింది. న్యాయవిద్య కోర్సుకు బార్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి లభించడంతో ఎల్‌బీనగర్‌లో తరగతులు ప్రారంభమయ్యాయి. 

ఎస్టీ గురుకులాల్లో గిరిజనులకు పీజీ కోర్సులు

ఎస్టీ గురుకుల సొసైటీ ఐదు కోర్సులను మూడు కళాశాలల పరిధిలో ప్రారంభించేందుకు ఇప్పటికే ప్రతిపాదించింది. తుది ఆమోదం రావాల్సి ఉంది. న్యాయవిద్య కోర్సు ప్రారంభానికి బార్‌కౌన్సిల్‌ అనుమతి లభించాల్సి ఉంది. ఈ సొసైటీకి అనుమతి లభిస్తే గిరిజనులకు గురుకులాల్లో పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తాయి. మరిన్ని కోర్సులు ప్రారంభించాలని భావించినా కరోనా కారణంగా సాధ్యం కాలేదు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.