• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏకాగ్రతతో ఎలా చదవాలి?

విద్యార్థులు ఎంతోమంది ఉన్నా.. కొందరికి మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి. కొందరు మాత్రమే కోరుకున్న కోర్సులో సీటు సంపాదిస్తారు. కొందరే కలల కొలువులను సొంతం చేసుకుంటారు. ఎందుకంటే.. వాళ్లంతా ఎంతో ఇష్టంతో చదువుతారు. అలాంటి ఆసక్తిని మనమూ పెంచుకోవాలంటే...

బాగా చదవాలంటే.. చేతిలో పుస్తకం మాత్రమే ఉంటే సరిపోదు. చదవాలనే ఆసక్తి, కోరిక, కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఉండాలి. అలాగే పరీక్షల్లో పాసవ్వడమే ధ్యేయంగా చదవకూడదు. ఇష్టంగా, బాధ్యతాయుతంగా చదవాలి. అనుకున్న కొలువును సాధించాలన్నా, కుటుంబ సభ్యుల ఆశలను నెరవేర్చాలన్నా ఏకైక మార్గం చదువే. కాబట్టి సాధ్యమైనంత వరకు ఏకాగ్రతతో చదవడానికి ప్రయత్నించాలి. 

బలవంతాన చదివితే ఏదీ అర్థంకాదు. చదవడాన్ని విసుగు తెప్పించే వ్యాపకంగా భావించకూడదు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి దక్కిన అవకాశంగా భావించాలి. చదవడం కోసం ఎంత ఎక్కువ సమయాన్ని కేటాయించగలిగితే అంత మంచిది. అప్పుడు సమయాన్ని వృథా చేసే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండగలుగుతారు. 

ఉద్యోగులకు ఎవరికి కేటాయించిన విధులు వాళ్లకు ఉంటాయి కదా.. అలాగే విద్యార్థుల ప్రధాన విధి.. సిలబస్‌ను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయడం. పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడం. వీటి తర్వాతే ఇంటర్నెట్‌ చూడటం, వీడియో గేమ్‌లు, ఆటపాటలు, సినిమాలు, స్నేహితులతో బయటకు వెళ్లడం లాంటివన్నీ. మిగతావాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల చదువును నిర్లక్ష్యం చేయొచ్చు. మిగతా వ్యాపకాలతోనే సమయం పూర్తవ్వడం లేదా బాగా అలసిపోవడం వల్ల కూడా సరిగా చదవలేకపోవచ్చు. 

ఏకాగ్రతకు భంగం కలిగించే వాటిని దూరంగా పెట్టాలి. ముఖ్యంగా చదివేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ను స్విచ్చాఫ్‌ చేసుకుంటే మంచిది. లేదంటే కొత్త మెసేజ్‌లు, నోటిఫికేషన్లు రాగానే వెంటనే మీ దృష్టి వాటి మీదకు మళ్లుతుంది. దాంతో చదివే దాని మీద ఏకాగ్రతను కోల్పోతారు. 

ఉన్నత శిఖరాలను అధిరోహించినవారిలో కొందరు జీవితంలో అతి సాధారణ స్థితి నుంచి వచ్చివారే. నిరంతరం సాధించాలనే తపన, ఆత్మవిశ్వాసం వారిని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. అలాంటివారిని ఆదర్శంగా తీసుకుంటే మీరూ అనుకున్నది సాధించవచ్చు. ఒక విద్యార్థిగా మీ లక్ష్యం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడమే కావాలి. అదే లక్ష్యంతో ముందుకెళితే మీ మీద మీకు నమ్మకమూ పెరుగుతుంది. 

తక్కువ మార్కులు వచ్చిన వెంటనే నమ్మకాన్ని కోల్పోయి ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడతారు కొందరు. ఇది ఎంత మాత్రం సరికాదు. ఇవన్నీ చదువులో భాగమేననే విషయాన్ని గుర్తించాలి. నిజానికి కింద పడటం తప్పుకాదు.. లేవడానికి ప్రయత్నం చేయకపోవడమే అసలైన తప్పు. ఆశించిన మార్కులు వచ్చేంతవరకు ఆ ప్రయత్నాలను ఆపకూడదు.  

నేర్చుకునే సామర్థ్యం అందరికీ ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొన్ని సబ్జెక్టులు త్వరగా అర్థంకాకపోవచ్చు. లేదా చదివిన పాఠాలు ఎక్కువకాలంపాటు గుర్తుండకపోవచ్చు. ఇవన్నీ మీ ఒక్కరి సమస్యలు మాత్రమే కాదు. ఎంతోమంది ఇలాంటి సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. మీకు కాస్త కఠినంగా అనిపించిన అంశాలపై ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. సీనియర్ల, స్నేహితుల సహాయం తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. 

చివరిగా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. తెలివితేటలు, అర్థం చేసుకునే నైపుణ్యం, నేర్చుకునే విధానంలో వ్యక్తుల మధ్య తేడాలుంటాయి. ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుంది. కానీ ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఆసక్తిగా చదవడం ద్వారా మీరూ లక్ష్యాన్ని సాధించొచ్చు. 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జేఈ కొలువులకు మీరెంత సిద్ధం?

‣ బైపీసీతో భద్రమైన భవిష్యత్తు!

‣ తీరదళంలో రక్షకులు!

‣ ఏఐ ట్రెండ్‌.. ఎంఎల్‌ డిమాండ్‌!

‣ కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

Posted Date : 27-08-2022 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌