‣ స్వీయశక్తి సామర్థ్యాలను ప్రజెంట్ చేసుకోవడం ఒక నైపుణ్యమే!
మెరుగ్గా ప్రొజెక్ట్ చేసుకోకపోతే ఎంతటి విలువైన వస్తుసేవలైనా తెరమరుగవుతుంటాయి. అందుకే తమ శక్తి సామర్థ్యాలను ఒక పద్ధతిలో ప్రజెంట్ చేసుకోగలిగినవారు విజేతలవుతారు. క్యాంపస్ సెలక్షన్ అయినా, మరే ఉద్యోగ వ్యాపారాలయినా, మరెక్కడయినా ఇదే సూత్రం వర్తిస్తుంది! మన ప్రతిభ, ప్రత్యేకతలను వేరెవరో వచ్చి వివరించరు కాబట్టి వాటిని ఆకట్టుకునేలా చెప్పటం మనమే నేర్చుకోవాలి.
ఆ ఊళ్లో పేరున్న ఇంజినీరింగ్ కాలేజీలో ప్రాంగణ నియామకాలు మొదలయ్యాయి. చాలా విరామం తర్వాత జరుగుతున్న క్యాంపస్ సెలక్షన్స్ కావడంతో విద్యార్థులంతా ఆసక్తితో, ఉత్కంఠతో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కంపెనీ ప్రపంచంలో చాలా దేశాల్లో విస్తరించి వున్న బహుళజాతి సంస్థ. ప్రతి విద్యార్థీ చేరాలని కలలుగనే ప్రసిద్ధ ఎం.ఎన్.సి. ఇది. ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగే రాత పరీక్ష, ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లాంటి ప్రక్రియలన్నీ పూర్తిచేసుకొని ఇంటర్వ్యూకు సిద్ధంగా ఉంది టీమ్.
ఈ సంస్థ ఆఫర్ చేసే ప్యాకేజీ, ఉద్యోగంలో చేరాక ఎదిగే అవకాశాల గురించి విద్యార్థుల్లో బాగా చర్చలు జరిగాయి. ఈ సంస్థలో వ్యక్తిత్వ వికాసానికి పెద్దపీట వేస్తారనీ, పర్ఫార్మెన్స్ బాగుంటే అమెరికా, కెనడా లాంటి దేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంటుందనీ తెలియటంతో ఈ కంపెనీలో స్థానం దక్కించుకోవాలన్న కోరిక, తపన అందరిలో పెరిగాయి.
ప్రకాష్, రాజేష్‌లు ఇద్దరూ ఉత్సాహంగా ఈ సెలక్షన్స్‌లో పాల్గొన్నారు. అన్ని దశలూ విజయవంతంగా ముగించి ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఈ క్యాంపస్‌కు వచ్చిన కంపెనీల ఇంటర్వ్యూలకు వీరు హాజరు కాలేదు.
నిజానికి వీరిద్దరూ క్లాస్‌లో టాపర్స్. జ్వలించే తపన ఉంది. ఇద్దరికీ కెరియర్‌పరంగా ఉన్నత లక్ష్యాలున్నాయి. ఈ ఇద్దరి కెరియర్ లాంచింగ్‌కు ఈ సంస్థ సరైన వేదికగా వీరి ప్రొఫెసర్లు భావిస్తున్నారు. ఈ ఎం.ఎన్.సి. స్థాయిని అందుకునే సామర్థ్యాలు ఇతర విద్యార్థులకన్నా వీరికి పుష్కలంగా ఉన్నాయన్నది అందరి ఉద్దేశం. వీళ్లు ఎంపికైతే కాలేజీకి మంచి పేరు వస్తుంది; కాలేజీ స్థాయి పెరుగుతుందన్నది కళాశాల యాజమాన్యం ఆలోచన.
ఇంటర్వ్యూ ప్రకటన మొదలైంది. ముందుగా వెళ్లిన ప్రకాష్‌ను అరగంట తర్వాత సంతోషంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత వెళ్లిన రాజేష్ కూడా ఇంటర్వ్యూ హాలునుంచి ఆనందంగానే బయటకు వచ్చాడు. ఓ గంట తర్వాత తీరా ఇంటర్వ్యూ ఫలితాలు ప్రకటించేసరికి ప్రకాష్ ఎంపికయ్యాడు. రాజేష్‌కు అవకాశం రాలేదు. ఇది ప్రకాష్ సంతోషానికీ¨, రాజేష్‌లో అంతర్మథనానికి కారణమయ్యింది. మిత్రుడు రాజేష్ సెలక్ట్ కానందుకు ప్రకాష్ కూడా బాధపడ్డాడు. ఈ ఫలితాలు చూసిన ప్రొఫెసర్లు రాజేష్‌ను ఓదార్చి సాధారణ స్థితికి తీసుకొచ్చారు.
తాను ఇంటర్వ్యూలో ఎందుకు సెలక్ట్ కాలేదన్నది రాజేష్ ముందున్న ప్రశ్న. ఆ కారణం అన్వేషిస్తున్న అతడికి ఇంటర్వ్యూ ప్యానల్లో ఉన్న హెచ్.ఆర్. మేనేజర్.. కెరియర్‌కు సంబంధించి ఎలాంటి గైడెన్స్ కావాలన్నా తనను సంప్రదించవచ్చని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. తమ ప్లేస్మెంట్ ఆఫీసర్ ద్వారా ఆయన్ను కలిసి మాట్లాడినపుడు తన లోపం అర్థమైంది. అదే ప్రజెంటేషన్ నైపుణ్యాల్లో వెనకబడటం. విద్యార్థులపరంగా తరచూ జరిగే పొరబాట్లను కూడా హెచ్.ఆర్. మేనేజర్ తెలియజేశారు.
అత్యంత సహజంగా..
‣ ఇంటర్వ్యూ ప్యానల్‌ను సబ్జెక్టు పరిజ్ఞానంతో, సక్సెస్ స్టోరీస్ జతచేస్తూ ఆకట్టుకోవాలి.
‣ ప్రతి మాటలోనూ నాయకత్వ లక్షణాలు, ఓనర్షిప్ భావన వ్యక్తీకరించాలి.
‣ ఇలా ప్యానెల్‌కు ప్రజెంట్ చేసేటప్పుడు అతికించినట్టు కాకుండా అత్యంత సహజంగా మీ సంభాషణలోకి తీసుకురాగలగాలి.
‣ ఈ లక్షణాలు అలవాటవ్వాలంటే ఎంతో సాధన కావాలి.
‣ టీంవర్క్, ఇతరులకు స్ఫూర్తినిస్తూ తానూ సెల్ఫ్ మోటివేట్ అవడం, సంస్థ విజన్‌నూ, మిషన్‌నూ అర్ధం చేసుకొని వాటి సాధనకు తానెలా అనుసంధానమవ్వగలడన్నది ప్రజెంట్ చేసుకోగలగాలి. ఇవే ప్యానల్‌ను ఆకట్టుకునేవి.
‣ అన్నింటికంటే ముఖ్యంగా- కొంత సృజనాత్మకత, విభిన్నంగా ఆలోచించడం అనివార్యమైన అవసరాలు.
ఇతరులకంటే భిన్నంగా..
మీతోపాటు మీ క్లాస్మేట్లో, స్నేహితులో ఇంటర్వ్యూకు హాజరవుతుంటారు. సంస్థలో ప్లేస్మెంట్ పొందడమే అందరి లక్ష్యం. అకడమిక్‌గా అందరికీ ఒకే విధమైన సామర్థ్యాలుండే అవకాశాలు ఎక్కువ. అందుకే మీరు అక్కడే ఆగిపోకుండా అందరిలో ఒకడిగా కాకుండా ఇతరులకంటే భిన్నంగా తయారవ్వండి. మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకునేందుకు ఎలాంటి లక్షణాలు అవసరమో పరిశీలించి ఇతరులకంటే భిన్నమైన కొన్ని ప్రత్యేక లక్షణాలను పెంపొందించుకోండి. ఇది దీర్ఘకాలిక ప్రణాళిక.
సున్నితమైన ప్రశ్నలు
కొన్నిసార్లు ఇంటర్వ్యూ ప్యానల్ అడిగే కొన్ని ప్రశ్నలు చాలా సున్నితంగా ఉంటాయి. వాటికి సున్నితంగానే స్పందించాలి. ఉదాహరణకు ‘సంస్థ నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారు?’ అనేది చాలా ఇంటర్వ్యూల్లో అభ్యర్థులను సాధారణంగా అడిగే ప్రశ్న. ఇక్కడ ఆశించడమంటే జీతం, ఇతర సౌకర్యాల, ఆర్థిక పరమైన ప్రయోజనాలనుకొని చాలామంది పొరబడుతుంటారు.
ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు మీరు ఇంటర్వ్యూకు హాజరయ్యే సంస్థ గురించీ, ఆ సంస్థలో ఎలా పనిచేయాలనుకుంటున్నారు, మీ అభివృద్ధికి సంస్థ నుంచి ఎలాంటి సహకారాన్ని ఆశిస్తున్నారు, ఆ సంస్థ పని సంస్కృతి ఎలా ఉంటుంది, నైపుణ్యాలు మెరుగు పరచుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి... తదితర విషయాలు వారితో చర్చించండి.
మార్కెటింగ్ వ్యూహం

మీరు విద్యార్థిగా ఏ కోర్సులో చేరినా తొలి సంవత్సరం నుంచే ఇందుకు పునాది, ప్రణాళిక వేసుకోవాలి. ఇది మీ అకడమిక్ సిలబస్‌కు అతీతంగా వ్యక్తిగత అభివృద్ధి (ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ ష్లాన్)లో భాగమవ్వాలి. అదే లక్ష్యంగా తయారవ్వండి. - దొరైరాజ్, సీనియర్ జనరల్ మేనేజర్, హెచ్ఆర్ అండ్ ఐఆర్
*************************************
మరింత సమాచారం ... మీ కోసం!