• facebook
  • whatsapp
  • telegram

జట్టును సమర్థంగా నడిపించాలంటే!

సంస్థలో ఏ స్థాయి ఉద్యోగి అయినా, ఏ ప్రత్యేక అంశంపై పట్టు ఉన్నవారైనా జట్టును ముందుకు నడిపించే నాయకునిగా రాణించాలంటే కార్యనిర్వహణ నైపుణ్యాలు అవసరం.  సభ్యుల సామర్థ్యాలను ఒడుపుగా నిర్వహించగల వ్యక్తి టీమ్‌ లీడర్‌గా రాణిస్తాడు. ఇలాంటి అదనపు ప్రతిభ, నైపుణ్యాలు ఉన్న టీమ్‌ లీడర్లు పనిచేసే సంస్థలు సాధారణ సంస్థలకంటే మెరుగ్గా పనిచేస్తాయి.

ఒక బహుళజాతి సంస్థలో టీమ్‌ మెంబరుగా చేరిన ప్రకాష్‌ ప్రతిభను గుర్తించిన యాజమాన్యం అతణ్ణి టీమ్‌ లీడర్‌ని చేసింది. అయితే అతడు తన తొలి ప్రాజెక్టులోనే విజయం సాధించలేకపోయాడు. ప్రతిభాశాలి అయివుండీ టీమ్‌ లీడర్‌గా ఎందుకు విఫలమయ్యాడో విశ్లేషించిన హెచ్‌.ఆర్‌. కౌన్సిలర్‌- అతడిలో జట్టును సమర్థంగా నడిపించగల నిర్వహణ సామర్థ్యాలు లోపించాయని గమనించారు. ఎలాంటి నిర్వహణ నైపుణ్యాలుంటే టీమ్‌ లీడర్‌గా నెగ్గగలడో తెలియజేశారు.

జట్టులో ఉత్సాహవంతుడైన ఉద్యోగి అయినా, జట్టు నాయకుడైనా నిర్వహణ సామర్థ్యాలనూ, నైపుణ్యాలనూ పెంపొందించుకోడానికి ఏమేం సాధన చేయాలో చూద్దాం.  

నిర్ణయ సామర్థ్యం  

సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది జట్టు నాయకత్వానికి అవసరం. మీరో జట్టును నడిపిస్తున్నా, కీలక సమావేశానికి నాయకత్వం వహిస్తున్నా మంచి నిర్ణయాలు తీసుకుంటే అవి మీ స్థాయిని పెంచుతాయి; సంస్థ అభివృద్ధికీ  సహాయపడతాయి. సంస్థ విజయం టీమ్‌ లీడర్ల నిర్ణయాలపై ఆధారపడి వుంటుంది. సరైన సమయంలో సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు సంస్థ అభివృద్ధికి సహకరిస్తాయి.  

సంఘర్షణ  

తీసుకునే నిర్ణయాల్లో బృంద సభ్యులను భాగస్వాములను చేయడంవల్ల, ఒకే సమస్యపై భిన్న దృక్కోణాలను పరిశీలించవచ్చు. సమస్య పరిష్కారానికి సమస్యలోని ప్రతి పార్శ్వాన్ని సృజనాత్మకంగా పరిశోధించే అవకాశం కలుగుతుంది. నిర్ణయంలో పాలు పంచుకున్న ప్రతి సభ్యుడూ ఒక పరిష్కారాన్ని సూచించేముందు తమ దృక్కోణాలను పరిశీలించి పరిగణించినట్లు భావించి వారిలో యాజమాన్య భావనను పెంపొందించాలి.  

అవగాహన పెంచుకోవడం  

జట్టుకు నాయకత్వం వహించే టీమ్‌ లీడర్లు సమస్య గురించీ, జట్టు గురించీ పూర్తి స్థాయిలో అవగాహనతో ఉండాలి. ఈ నైపుణ్యం తమ సహ టీమ్‌ లీడర్లలో సుహృద్భావ స్పర్థను పెంపొందించే అవకాశాలు ఎక్కువ.  

నమ్మకం- ఒక బలం  

సంస్థలో వివిధ జట్టు సభ్యులు కలిసి పనిచేస్తున్నప్పుడు జట్టు సభ్యుల మధ్య మంచి అవగాహన, ఒక సభ్యునిపై మరో సభ్యునికి నమ్మకం అవసరం. జట్టు సభ్యుల మధ్య సత్సంబంధాలుండి వ్యక్తుల పూర్తి వివరాలు ఒకరికొకరికి తెలిస్తే అక్కడ సమస్యలు తక్కువగా, పరిష్కారాలు ఎక్కువగా కనిపిస్తాయి. మానవ సంబంధాలు కేవలం వ్యాపార సంబంధాలుగా, పనికి పరిమితమైన వ్యవహారాలుగా ఉన్నచోట ఉద్యోగుల్లో యాజమాన్య భావన ఉండదు. అలాకాకుండా పని ప్రదేశంలో  వ్యక్తిగత సంబంధాలు బలపడ్డ చోట ప్రతి ఉద్యోగీ యాజమాన్య భావనతో పనిచేస్తారు. ముఖ్యంగా జట్టు సభ్యుల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణి పెరగడం వల్ల పనిలో ఒత్తిడి తగ్గుతుంది. జట్టు సభ్యుల్లో సమైక్యత పెరుగుతుంది. 

మెరుగైన భావ ప్రకటన   

జట్టు నాయకుడిని మెరుగైన భావ ప్రకటనా నైపుణ్యాలు శక్తిమంతుడిగా చేస్తాయి. జట్టు సభ్యులందరికీ అవసరమైన ప్రతి వనరూ అందుబాటులో ఉండేలా చూసుకోవడం ద్వారా వారి విజయానికి సహకరించినట్లవుతుంది. సంస్థాగత మార్పులను హ్యాండిల్‌ చేసే సమయంలోనూ, సవాళ్లను ఎదుర్కొనే సందర్భాల్లోనూ పారదర్శకంగా ఉండటం మేలు. వ్యవస్థలో వచ్చే మార్పులను నిరంతరం టీమ్‌ సభ్యులకు తెలియజేస్తూ మార్చులను ఎదుర్కొనేందుకు వారిని సమాయత్తపరచాలి. 

పనితీరు... మదింపు  

సాధారణంగా జట్టులో పనిచేస్తున్న ఉద్యోగుల పనితీరును సంవత్సరాంతంలో మదింపు చేస్తారు. ఈ క్రమంలో టీమ్‌ లీడర్‌ తన టీమ్‌లోని ఉద్యోగుల పనితీరులో వస్తున్న హెచ్చుతగ్గులు, వారు ఏ అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించారో, వేటిలో సరైన పనితీరు ప్రదర్శించలేకపోయారో అన్నవి చర్చిస్తుంటారు. ఉద్యోగి పనితీరుకు సంబంధించినంతవరకు నష్ట నివారణ చర్యలు చేపడుతుంటారు. ఈ మదింపు పనివరకే కాకుండా పనికి సంబంధించని ఇతర వ్యక్తిగత ఉదంతాలను గురించీ మదింపు చేయగల చొరవ అవసరం. 

ఒక్కరే చేస్తే....

టీమ్‌ లీడర్‌ ప్రధాన బాధ్యత- బృందానికి ప్రాతినిథ్యం వహించడం. జట్టు లీడర్‌గా, వ్యక్తిగతంగా ప్రతిభావంతుడైన ఉద్యోగి అయినా ఒక్కరే పనిచేస్తే బృంద విజయం సాధ్యపడదు. అంటే ఇతర సభ్యుల్లోని నైపుణ్యాలు వెలికితీసి వాటిని సరైన పద్ధతిలో నడిపించగల కార్య నిర్వహణ సామర్థ్యం అత్యవసరం. సొంతంగా పనిచేయడం వల్ల సాధించే ఫలితం కంటే జట్టును సమర్థంగా నిర్వహిస్తే వచ్చే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ముందుగా బృంద లక్ష్యాలు, బృంద సభ్యుల పాత్ర, వారి లక్ష్యాలపై టీమ్‌కు అవగాహన కల్పించాలి. జట్టు తన లక్ష్య సాధనకు పని ప్రారంభించేముందు ఇలాంటి ప్రారంభం నమ్మకం కలిగిస్తుంది. ప్రతి అంశంపైనా ప్రతి సభ్యుడికీ స్పష్టత ఉన్నందువల్ల, నిర్వహణ క్రమంలో ఎక్కడైనా పక్కకు మళ్లినా జట్టు నాయకుడిగా తిరిగి టీమ్‌ను ట్రాక్‌పైకి సులభంగా తీసుకురావచ్చు.

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 17-01-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం