• facebook
  • whatsapp
  • telegram

ఆలోచన భిన్నమైతే అందుతాయి అవకాశాలు

విశ్లేషణాత్మక నైపుణ్యాల మెరుగుకు సూచనలు

ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదివిన విద్యార్దులకు భిన్నమైన కార్య నిర్వహణ సామర్థ్యం ఉంటుంది. అయితే అటువంటి కళాశాలల్లో చదివే అవకాశం అందరికీ ఉండదు. అలాంటపుడు వీలైనంత వరకూ మూసకు భిన్నమైన ఆలోచనా ధోరణి అభివృద్ది చేసుకుంటే అరుదుగా వచ్చే గొప్ప అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. అందుకు అవసరమైనవాటిలో విశ్లేషణాత్మక నైపుణ్యాలు ముఖ్యమైనవి.  

ఒక సమస్యను గుర్తించి, దాని మూల కారణాలను శోధించే లక్షణం- తార్కిక పరిష్కార మార్గాలను కనుగొనే సామ ర్థ్యాన్ని సూచిస్తుంది. కార్పొరేట్‌ సంస్థలు ఈ విశ్ల్లేషణాత్మక నైపుణ్యాలను ప్రధానమైనవిగా, అత్యవసరమైనవిగా పరిగణిస్తున్నాయి. వాస్తవ పరిస్థితిని అనుసరించి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ నైపుణ్యాలు ఉపయోగపడతాయి. వీటిని పెంచుకోవాలంటే సహనం, ఉత్సాహం- రెండూ అవసరమే.  

ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అందుకు అవసరమైన గణాంకాలు (డేటా) సేకరించాల్సిందే. గతంలో జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న అంశాల గణాంకాలు పరిశీలించి, సరైన విశ్లే˜్లషణ చేస్తే నిర్ణయాలు తీసుకునేందుకు వీలవుతుంది. డేటా విశ్లే్లషణ ప్రతి విభాగానికీ చాలా అవసరం.   

సమాచార పంపిణీ  

సమస్యలను గుర్తించి, వాటికి తగిన పరిష్కార మార్గాలను కనుగొన్నప్పటికీ ఆ నిర్ణయాలనూ, పరిశోధన ఫలితాలనూ సమర్థంగా తెలియజేయకపోతే ఈ ఆవిష్కరణలన్నీ నిరుపయోగాలవుతాయి. అందుకే నిర్ణయాలు తీసుకునే స్థాయి వ్యక్తులకు ఈ సమాచార పంపిణీ నైపుణ్యం చాలా అవసరం. ఈ విశ్లే్లషణలు, పరిశోధనలు, పరిశీలనల ద్వారా కనుగొన్న విషయాలను యాజమాన్యాలకు సమావేశాల్లో ప్రజెంటేషన్ల ద్వారానూ, నేరుగానూ తెలపాల్సివుంటుంది. దీనికి మెరుగైన భావ వ్యక్తీకరణ అవసరం.  

సృజనాత్మకత  

ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా పరిష్కరించాలంటే పరిధి దాటి ఆలోచించగలగాలి. దానికి సృజనాత్మక లక్షణం అవసరం. సాంకేతికంగా ఒక సిద్ధాంతం ప్రకారం అనుసరించాల్సిన పరిష్కార మార్గాలూ, సమాధానాలూ కొన్నిసార్లు సరైన ఫలితం సాధించలేవు. అలాంటపుడు చిట్కాలూ, సృజనాత్మకంగా ఆలోచించే పద్ధ్దతులూ పరిష్కారాలను సూచిస్తాయి. 

ఉద్యోగ రంగంలో మీ నైపుణ్యాలే మీ సంపద. సంక్లిష్టమైన అంశాలను సాధారణ అంశాలుగా మార్చగల మీ విశ్లేషణ శక్తి మీరు ఏ సంస్థలో చేరినా ఆ సంస్థకు మేలు చేసేదే.

లోతైన విశ్లేషణ శక్తి అనేది సాధారణ, అసాధారణ ఉద్యోగుల మధ్య ఉన్న తేడాను సూచిస్తుంది. ఇది సంక్లిష్టమైన, సూక్ష్మ సమస్యలను కూడా పరిష్కరించగలదు.  

సమర్థ ఆలోచనాపరులు, విమర్శనాత్మక ఆలోచనాపరులు హేతుబద్ధ్దంగా ఆలోచించగలరు.  

మీ చుట్టూ ఉన్న పరిస్థితులనూ, వ్యక్తులనూ, వారి ప్రవర్తననూ నిశితంగా గమనిస్తుండండి. ఒక్కో సందర్భంలో ఒక్కో వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడు, ఒక్కో అంశానికి ఎలా స్పందిస్తాడన్న అంశాలను పరిశీలించండి.

మెరుగుపరుచుకోవడమెలా?  

వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలకు సంబంధించి నిర్దిష్ట నిర్ణయాలు తీసుకుని వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ నైపుణ్యాలు విద్యార్థులకు అవసరం. నిజానికి డేటా సైన్స్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, న్యాయ శాస్త్రం, అకౌంటింగ్‌ - ఇలా ఏ రంగంలో రాణించాలన్నా విశ్లే్లషణాత్మక నైపుణ్యాలు అవసరమే. ఆలోచనాశక్తిని సానపెట్టుకుంటూ విశ్లేషణ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. 

నిరంతర పఠనం: పుస్తక పఠనం మేధను పోషించే ఓ ఆరోగ్యకరమైన అలవాటు. పాఠ్యాంశాలూ, నిర్దేశించిన సిలబస్‌కు అతీతంగా వివిధ మేనేజ్‌మెంట్, సాంకేతిక, సాహిత్యాలనూ, వ్యక్తి వికాసానికీ దోహదపడే పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. పుస్తక పఠనం తార్కిక సామర్థ్యాన్ని ఉత్తేజపరుస్తుంది.  

డైరీ నిర్వహించండి: రోజూ మీరు ఎన్నో సమస్యలను చూస్తుంటారు. మీ పరిధిలో సమస్యా పరిష్కారానికి ఆలోచించాలి. అందుబాటులో ఉన్న సమస్యలు ఎన్ని? పరిష్కరించలేని సమస్యలు ఎన్ని? వాటిని గుర్తించి డైరీలో పొందుపరచండి. ఈ అపరిష్కృత అంశాలను పరిశీలించినప్పుడు మీలో ఉత్సాహం, పరిష్కరించాలన్న కసి పెరుగుతాయి. మీ ఆలోచనా సామర్థ్యంలో కొత్త కోణం ఆవిష్కారమవుతుంది. డైరీ రాయడం వల్ల మీ సామర్థ్యాన్ని అనేక కోణాల్లో పెంచవచ్చు. ఒక వ్యక్తిగా మిమ్మల్ని  తీర్చిదిద్దుకోవచ్చు.  

తరచుగా ప్రశ్నించుకోండి: ప్రతి అంశాన్నీ ప్రశ్నిస్తున్నారంటే ఆ అంశంపై మీరు లోతుగా ఆలోచిస్తున్నారని అర్థం. ఒక విషయంపై మీరు ఎంత లోతుగా వెళ్ళగలిగితే అంతటి సామర్థ్యం మీలో పెరుగుతుంది. సమస్యతో పూర్తిగా మమైకమైనప్పుడు మీ ఆలోచనా సామర్థ్యం మీ విశ్లే్లషణాత్మక నైపుణ్యాన్ని పెంచుతుంది.  

విద్యార్థి దశలోనే...

ఆధునిక వ్యాపార ప్రపంచం ఎన్నో సంక్లిష్ట సమస్యలతో కూడివుంది. వీటికి వేగవంతమైన, సమర్థ పరిష్కార మార్గాలు అవసరం. అందువల్ల విద్యార్ది దశలోనే విశ్లే్లషణాత్మక నైపుణ్యాలు ఉన్నవారిని ఎంపిక చేసుకునేందుకు సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. అందుకే చదువుకునే  దశలోనే ఈ నైపుణ్యాలు పెంచుకోవడానికి సాధన చేయాలి.

 

 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 24-03-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం