• facebook
  • whatsapp
  • telegram

ఆఫర్‌ చేజారితే?

చాపకింద నీరులా వ్యాపించి ఉన్న ఆర్థిక మాంద్యం ఉద్యోగ విపణిని ప్రభావితం చేస్తోంది. ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు ఆశించే విద్యార్థుల అవకాశాలకు గండి కొడుతోంది. ప్రాంగణ నియామకాలకు కష్టపడి సన్నద్ధమవుతూ, ఇంటర్వ్యూలో ఎంపిక కాగానే ఇక జీవితంలో స్థిరపడొచ్చనే భరోసాతో ఉండే అభ్యర్థులకు.. ‘మీ ఆఫర్‌ను రివోక్‌ చేస్తున్నాం’ అనే చేదు సమాచారం నిరాశ కలిగిస్తుంటుంది. మరి ఇటువంటి సందర్భాలను ఎలా ఎదుర్కోవాలి? 


చాలా విద్యాసంస్థల్లో ఒక నిబంధన ఉంది. ప్రాంగణ ఎంపికల్లో ఒక కంపెనీకి ఎంపికైన విద్యార్థులు వేరే కంపెనీల ఎంపిక ప్రక్రియలకు హాజరు కాకూడదు. ఒకవేళ అయినా, అంతకంటే ఎక్కువ ప్యాకేజీ ఇవ్వజూపే వాటికి మాత్రమే వారు ప్రయత్నించాలి. దీనివల్ల ఒక ఆఫర్‌ రాగానే విద్యార్థులు ఇక వేరే వాటికి ప్రయత్నించే వీలులేక దాని మీదనే ఆధారపడుతున్నారు. తీరా చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరే క్రమంలో ఆ ఆఫర్‌ను వివిధ కారణాలతో కంపెనీలు వెనక్కి తీసుకుంటుంటే.. అభ్యర్థులు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడుతున్నారు. గత ఏడాది ఆఖరి నుంచే ఇటువంటి ఘటనలు అధికంగా నమోదవుతూ వారిని మరింత ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.    ముందే జాగ్రత్త    

క్యాంపస్‌లో ఉద్యోగం వచ్చిందని ధీమా పడకుండా, బయట కూడా ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. ఒక పక్క చదువు, పరీక్షల సంగతి చూసుకుంటూనే ఇతర అవకాశాలు ఏం లభిస్తున్నాయనేది చూస్తూ ఉండాలి. ఇతర అవకాశాలను  సొంతంగా వెతుక్కునేందుకు ప్రయత్నించడం ద్వారా కేవలం ఒక్క ఆఫర్‌ మీదనే ఆధారపడి సమయం వృథా కాకుండా ఉంటుంది. ఒకవేళ అంతకంటే మెరుగైన అవకాశం దొరికితే అందులోనే చేరవచ్చు. ఏదైనా కారణంతో ఈ ఆఫర్‌ వెనక్కి వెళ్లినా భయం లేకుండా ఉంటుంది. అయితే ఏ ఉద్యోగంలో చేరినా, మనకు ఉద్యోగావకాశం ఇచ్చిన ఇతర కంపెనీలకు వారి వద్ద ఎందుకు చేరలేకపోతున్నామో తెలియజేస్తూ, ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలపడం ద్వారా ప్రొఫెషనల్‌గా ఉండవచ్చు.    తెలుసుకుని..     

నిజానికి ఒక మంచి అవకాశాన్ని కోల్పోవడం అంటే కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం మనపై ఉంటుంది. దాన్ని జీర్ణించుకోవడం అంత సులభం కాదు. అయితే దీన్ని ప్రొఫెషనల్‌గానూ, మర్యాదతోనూ స్వీకరించాలి. సంస్థను ఏం జరిగిందో అడిగి తెలుసుకోవడంతోపాటు అర్థం కాని విషయాలు ఏమైనా ఉంటే ప్రశ్నించి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. దాని ద్వారా మొత్తంగా మనం ఏం చేయాలనేది ప్లాన్‌ చేసుకోవడం సులభమవుతుంది.    వేరే మార్గం    

మన ప్రవర్తన, ప్రదర్శనకు సంబంధం లేని విషయాల కారణంగా ఆఫర్‌ వెనక్కి తీసుకుంటే వేరే ఏదైనా మార్గం ఉందేమో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. ఇతర విభాగాలు, టీమ్‌లో ఎక్కడైనా నియమించగలరా అనేది అడగటం ద్వారా వారితో కలిసి పని చేసేందుకు మనకున్న ఆసక్తిని తెలియజేయవచ్చు. శాశ్వత ఉద్యోగిగా కాకపోయినా, అప్పటికి చేతిలో వేరే అవకాశాలు ఏవీ లేకపోతే తాత్కాలికంగా అయినా ప్లేస్‌మెంట్‌ ఇమ్మని కోరవచ్చు.    ఎందువల్ల?   

కంపెనీలు అనేక కారణాలతో జాబ్‌ ఆఫర్లను వెనక్కి తీసుకుంటాయి. సంస్థ ఉద్యోగుల అవసరాల్లో తేడాలు రావడం, ఉన్న బడ్జెట్‌లో లోటు ఏర్పడటం, అభ్యర్థి బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌లో సంతృప్తికరంగా లేకపోవడం, రెజ్యూమెలో ఉన్న వివరాలతో వాస్తవ వివరాలకు తేడా రావడం, నెగిటివ్‌ రిఫరెన్సులు, ప్రవర్తనా లోపాలు, ఇలా ఏదైనా కారణం కావొచ్చు.     మరింత బలంగా..     

ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు ఎలా మారినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అవసరం. అప్పుడే మార్కెట్‌ ఒడిదొడుకులకు తట్టుకోగలం. ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, యూఎక్స్‌ డిజైన్, డేటా సైన్స్, మార్కెటింగ్‌ అనలిటిక్స్‌ వంటి అనేకానేక డిమాండ్‌ ఉన్న కోర్సులతో అప్‌స్కిలింగ్‌ చేసుకోవడం ద్వారా ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులను సులభంగా అధిగమించవచ్చు.     ప్రేరణ కోల్పోకుండా..    

చాలా సందర్భాల్లో ఉద్యోగావకాశం కోల్పోవడానికి మనం కారణం కాకపోవచ్చు. కంపెనీ అంతర్గతంగా ఎదుర్కొంటున్న పరిస్థితుల ప్రభావం వల్ల జరిగి ఉండవచ్చు. అందువల్ల సంబంధం లేని విషయాల వల్ల కలిగిన ఇబ్బందితో బాధపడకుండా వీలైనంత త్వరగా అందులోంచి బయటపడి మన ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయామంటే అంతకంటే మంచి చాన్స్‌ మనకోసం ఎదురుచూస్తున్నట్టే లెక్క!


 

Some more information

‣  "From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"

Posted Date: 14-05-2024


 

ఉద్యోగాన్వేష‌ణ‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం