• facebook
  • whatsapp
  • telegram

స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

* సైబర్‌ మోసాలపై అప్రమత్తత అవసరం


విద్యార్థులు, ఉద్యోగార్థులు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా.. వారి కోసం కాసుకుని కూర్చునే స్కామర్లు ఏదో ఒక విధంగా వల విసురుతూనే ఉన్నారు. తాజాగా వరంగల్‌లో కొందరు విద్యార్థులు ఇటువంటి సైబర్‌ మోసం బారిన పడటంతో ఈ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. మరి వీటి పట్ల అప్రమత్తంగా ఉండేది ఎలా? 


సైబర్‌ మోసగాళ్లు ఫేక్‌ ఉద్యోగాలు, నకిలీ వ్యాపార అవకాశాల పేరుచెప్పి బాధితుల నుంచి డబ్బు, విలువైన సమాచారం తస్కరిస్తున్నారు. ఇప్పటికే వందలమంది వీరి బారినపడ్డారు. ఇటువంటి మోసాల గురించి పూర్తిగా తెలుసుకోవడం ద్వారానే వీటి నుంచి తప్పించుకోగలం.


ఎక్కువగా కనిపిస్తున్న మోసాలను పరిశీలిస్తే.. 


ఫేక్‌ జాబ్స్‌ 


సోషల్‌ మీడియా వేదికలను ఉపయోగించి మోసగాళ్లు విసిరే వల ఇది. యూట్యూబ్‌ టాస్కుల పేరుతో, పోస్టులకు కామెంట్లు పెట్టాలంటూ, ఒక చోట ఉన్న కంటెంట్‌ను మరోచోట పోస్ట్‌ చేయాలంటూ.. ఇలా వివిధ రకాలుగా ఉంటున్నాయివి. అవకాశాలు, సులభ ఆదాయ మార్గం, ఇంటి వద్ద నుంచే పని అంటూ ఆకర్షించే ఏ పోస్టునైనా అంత సులభంగా నమ్మేయకూడదు. నిజానికి అందరూ ఉపయోగించే నమ్మకమైన సైట్లలో కూడా అబద్ధపు ఉద్యోగ ప్రకటనలు ఉంటూ ఉంటాయి. దేనికైనా స్పందించే ముందు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం అవసరం. 


రీషిప్పింగ్‌ 


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఉద్యోగాల్లో ఇదొక పాపులర్‌ రకం. వారు పంపిన ప్యాకేజ్‌లను అందుకుని, వాటిని రీషిప్పింగ్‌ చేస్తే చాలు.. అదే ఉద్యోగమని నమ్మిస్తాయివి. ఇందులో పెద్దగా కష్టపడాల్సింది ఏముందిలే అనుకుంటూ కొందరు వీటిని ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఆ ప్యాకేజీల్లో ఉన్న వస్తువులు దొంగిలించినవి, తస్కరించిన క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేసినవి అయి ఉంటాయి. అటువంటివాటిని ఒకచోట నుంచి మరొక చోటికి చేర్చడంలో భాగస్వాములం కావడం అంటే కోరి ఇబ్బందులను కొని తెచ్చుకున్నట్లే. 


మనీ మ్యూల్‌ 


కొంత డబ్బును మన ఖాతాలోకి జమచేసి దాన్ని వేరే ఖాతాలకు జమ చేయమనడం, గిఫ్ట్‌ కార్డుల రూపంలో ఇవ్వడం, నగదుగా అయినా అందజేయమని చెప్పడం.. ఇవన్నీ ఈ తరహా మోసాల కిందికి వస్తాయి. ఈ ప్రక్రియలో తాము మనీ లాండరింగ్‌లో ఉన్నామని తెలియకుండానే అభ్యర్థులు ఆ పనిని చేసేస్తుంటారు. కొన్నిసార్లు ఈ ప్రక్రియ మరింత క్లిష్టంగా తయారై అభ్యర్థులను నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. 


కెరియర్‌ కన్సల్టింగ్‌ స్కాములు


ఇవి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి ఎర వేసే మోసాలు. తమ వద్ద ఉద్యోగాలున్నాయని, అభ్యర్థి తాలూకా ప్రొఫైల్‌ తమకి బాగా నచ్చిందని, అయితే తమ వద్ద ఉన్న ఒకటి రెండు కోర్సులు చేస్తే కచ్చితంగా ఉద్యోగం ఇవ్వగలమని మోసకారులు నమ్మబలుకుతారు. ఆ స్కిల్స్‌లో వెనుకబడి ఉన్నారని అభ్యర్థులను నమ్మించి తమ వద్ద ఉన్న కోర్సులను కొనుగోలు చేసేలా ఒత్తిడి పెడతారు. ఉద్యోగాన్వేషణలో ఉన్న అభ్యర్థులు ఈ మాటలు నమ్మి డబ్బు కడితే కొన్ని రోజులు కోర్సు పేరుతో కాలయాపన చేసి తర్వాత మొహం చాటేస్తారు. 


ఫిషింగ్‌ స్కామ్స్‌ 


విద్యార్థులు, అభ్యర్థుల నుంచి ముఖ్యమైన సమాచారాన్ని తస్కరించడానికి పన్నే వల ఇది. ఫోన్‌ లేదా ఈమెయిల్‌ ద్వారా సంప్రదించి నమ్మకమైన మాటల ద్వారా ఇలా చేస్తారు. తాము పెద్ద పెద్ద సంస్థల తరఫున మాట్లాడుతున్నాం అని వాటి పేర్లు, కొన్ని వివరాలు చెప్పడం వల్ల అభ్యర్థులు సులభంగా నమ్మేస్తుంటారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ‘మిమ్మల్ని ఉద్యోగానికి సెలెక్ట్‌ చేశాం, పర్సనల్‌ వివరాలు ఇవ్వండి’ అంటూ ఆశ పుట్టించి అడుగుతుంటారు.





జాగ్రత్త ఇలా.. 


ఇవాళ్టి రోజుల్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం అంత సులభమేం కాదు.. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ మోసకారుల చేతికి చిక్కకుండా చూసుకోవచ్చు. 


చూడటానికి మరీ బాగున్నట్లు కనిపించే ఆఫర్లు, నమ్మశక్యం కాని జీతభత్యాలు కనిపిస్తే అంత త్వరగా క్లిక్‌ చేసేయకుండా జాగ్రత్తపడాలి. సాధారణంగా ఆ ఉద్యోగాలకు ఎటువంటి రాబడి ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తే సులభంగా ఏది మోసమో, ఏది నిజమో తెలిసిపోతుంది. 


చాలామంది అభ్యర్థులు ఇంటర్వ్యూలు అంటే భయపడతారని స్కామర్లకు తెలుసు. అందుకే కొందరు ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఉద్యోగం అంటూ మభ్యపెడతారు. ఒక సర్వే ప్రకారం ఇటువంటివారు 80 శాతం వరకూ సోషల్‌ మీడియా, ఉద్యోగాన్వేషణ సైట్ల ద్వారానే అభ్యర్థులకు వల విసురుతున్నారట. మిగతా 20 శాతం మాత్రమే వారిని నేరుగా కాంటాక్ట్‌ చేస్తున్నారట. అందువల్ల ఆ విధంగా వచ్చే ఉద్యోగావకాశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 


జాబ్‌ ఆఫర్ల గురించి వచ్చే మెయిల్స్‌ అన్‌ప్రొఫెషనల్‌గా కనిపించినా.. అడ్రస్‌ లేకపోయినా, సందేహాస్పదంగా ఉన్నా, అనుమానించాల్సిందే. 


ఏదైనా సమాచారం అందజేసేటప్పుడు ఆలోచించి ఇవ్వాలి. వీలైనంత వరకూ అన్నీ ఆలోచించి కనీస వివరాలు మాత్రమే ఇవ్వాలి. సున్నితమైన సమాచారం ఇవ్వకుండా జాగ్రత్తపడాలి.


ఏ కంపెనీ నుంచి ఆఫర్‌ వచ్చినట్లు కనిపించినా ముందుగా ఆ కంపెనీ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.  


ఏ కారణంతోనైనా డబ్బు కట్టమని అడిగితే ఆలోచించాలి. నిజంగా ఉద్యోగం ఇచ్చేవారు ఎప్పుడూ డబ్బులు కట్టమని అడగరు. 


కొందరు మోసకారులు చిన్నపాటి వ్యాపార అవకాశం అంటూ కూడా నమ్మబలుకుతారు. ఇటువంటి వాటిపట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. 


వీలైనంత వరకూ ముఖాముఖి ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నేరుగా కలిసి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు ప్రయత్నించాలి. 


ఏ కారణంతోనైనా వీటిలో ఇరుక్కున్నట్లు కనిపిస్తే ఎటువంటి సంశయాలూ లేకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఎంతగా కూరుకుపోయాం అనిపించినా సరే, వారి సాయంతో బయటపడవచ్చు. 


చివరగా.. సులభంగా డబ్బు సంపాదించే మార్గాలు అంటూ ఏవీ ఉండవు. కష్టపడితేనే ఏదైనా సాధ్యమనే విషయాన్ని గుర్తించాలి. ఉద్యోగం సంపాదించాలనే తొందరలో ఏది పడితే అది నమ్మి ఇబ్బందులు కొనితెచ్చుకోకూడదు. 


మరింత సమాచారం... మీ కోసం!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

Posted Date: 08-02-2024


 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం