• facebook
  • whatsapp
  • telegram

ప్లాన్‌ పక్కా... మార్కులు ఎంచక్కా!  

పరీక్షల వేడి ప్రారంభమైంది. ఇంటర్‌, ఇంజినీరింగ్‌, జేఈఈ, నీట్‌, ఎంసెట్‌... ఇలా ఎన్నో. విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోంది. వినయ్‌ పుస్తకం వదలడు. ఎప్పుడూ చదువుతూనే ఉంటాడు. విజయ్‌ పుస్తకం ముట్టడు. ఆటల్లోనే కనిపిస్తాడు. కానీ ఇద్దరికీ మార్కులు ఒకే రకంగా వస్తుంటాయి. ఒక్కోసారి విజయ్‌దే పైచేయి అవుతుంది కూడా. ఎందుకంటే విజయ్‌ ఒక ప్లాన్‌ ప్రకారం అన్నీ చేస్తాడు. ఆటలకు, వారాంత కాలక్షేపాలకు కూడా టైం కేటాయిస్తాడు. వినయ్‌ ఎలాంటి ప్రణాళిక లేకుండా ఎప్పుడూ చదువే అంటాడు. చదవడమూ ఒక నైపుణ్యమే. పక్కాప్లాన్‌తో చేస్తే పర్‌ఫెక్ట్‌గా టార్గెట్‌ హిట్‌ అంటున్నారు నిపుణులు.


    వినయ్‌, విజయ్‌లకు తెలివితేటల్లో తేడా లేకపోయినా చదువుకు సంబంధించిన లక్ష్యసాధనలో తేడా వస్తోందంటే ముఖ్య కారణం - వారి పని తీరు.

    విజేతలను సామాన్యుల నుంచి వేరు చేసే ముఖ్యలక్షణాల్లో ప్రణాళిక ఒకటి. ప్రణాళికకు ముందు లక్ష్య స్పష్టత, బలాబలాలపై సరైన అంచనా, ప్రణాళిక అమలులో క్రమశిక్షణ, సానుకూల
దృక్పథం, అడ్డంకులు ఎదురైనప్పుడు ప్రయత్నం ఆపని పట్టుదల కావాలి.

    'If you are failed to plan, then you are planning to fail' అనే నానుడి వినేవుంటారు. చదువు బుద్ధికీ, మనసుకూ సంబంధించిన పని కాబట్టి, దానిలో ఫలితాల సాధనకు ప్రణాళికే ప్రాణం. దాని అమల్లో విఫలమైనంత మాత్రాన ప్రణాళిక వేసుకోవడం మానకూడదు. అసలు ప్రణాళికే లేకపోవడం కన్నా విఫలమైన ప్రణాళిక మేలు!

    ప్రణాళిక అంటే చేయబోయే పనులను ముందుగానే వూహించుకుని వాటిని ఎప్పుడు, ఎలా చేయాలో నిర్ణయించుకోవడం. బుద్ధిజీవులకు ప్రణాళిక సహజమైన సంగతి. ఏ పని చేయాలన్నా కొద్దో గొప్పో ముందుగా మనసులో వూహించుకోకుండా చేయడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే ఎంత ముందుగా, ఎంత సమగ్రంగా వూహిస్తావు? అనే విషయాల్లోనే తేడా వస్తుంది. అందుకే -Every house is built twice అన్నారు.

    ముందస్తు ప్రణాళిక వల్ల చివరి నిమిషంలో ఉత్కంఠ, ఆందోళన తప్పుతాయి. ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ఎదుర్కోగలుగుతారు. ఈమధ్య ఎన్నో కళాశాలల్లో ప్రణాళిక ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రణాళికబద్ధంగా చదివించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా చాలా చోట్ల అనుకున్న ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా ఆఖరి నిమిషంలో ఉత్కంఠ, ఆందోళన, దానివల్ల వచ్చే ఒత్తిడి, ఆత్మవిశ్వాస లోపం, వాటి దుష్ఫలితాలు అలాగే ఉండిపోతున్నాయి. కారణం ఏమిటి?

ఆచరణీయమైన లక్ష్యం 

    ప్రణాళిక వేసుకొనే ముందు విద్యార్థికి లక్ష్య స్పష్టత ఉండాలి. తాను ఏ పరీక్షలో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటున్నాడో ఆచరణీయమైన లక్ష్యం నిర్ణయించుకోవాలి. విద్యార్థి తన మనసులో 80% చాల్లే అనుకుని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల కోసం 90 శాతానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రకటిస్తే ప్రణాళిక విఫలమవుతుంది.

    లక్ష్య స్పష్టత తర్వాత, బలాబలాల విశ్లేషణ కూడా ముఖ్యమే. ఏ సబ్జెక్టులో, ఏ ఛాప్టర్లో, ఎలాంటి ప్రశ్నల్లో బలంగా ఉన్నదీ, వేటిల్లో బలహీనంగా ఉన్నదీ విశ్లేషించుకోవాలి. లక్ష్యానికీ, ఆచరణకూ మధ్య తలెత్తే అడ్డంకులు, ప్రయత్నం లేకుండానే ప్రయోజనాన్ని కలిగించే అవకాశాల గురించీ ఆలోచించుకోవాలి.

    మంచి ప్రణాళిక ఎలా ఉంటుంది? అది బలాల నుంచి అత్యధిక ప్రయోజనాన్ని పొందేదిగా, బలహీనతల వల్ల అతి తక్కువ నష్టం కలిగించేదిగా, రాబోయే అవకాశాలను గుర్తించి వినియోగించుకునే వీలు కలిగిందిగా, అవరోధాలను బాగా తగ్గించేదిగా ఉంటుంది.

    సమష్టి ప్రణాళికలకు అవసరమైన సమయం, దానివల్ల తాను పొందే ప్రయోజనాలను సరిగా అంచనా వేసుకోవాలి. ఏవైనా సందేహాలుంటే అడిగి తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా సాధించాల్సిన అదనపు ప్రయోజనాలకు మిగిలిన సమయంలో ప్రణాళిక వేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని, అవి సాధించడానికి అవసరమయ్యే సమయం, ప్రయత్నం మీద నిర్దిష్ట అంచనాకు రావాలి. వ్యక్తిగత ప్రణాళికకూ, తరగతి సామూహిక ప్రణాళికకూ మధ్య సమన్వయం లేనప్పుడు ప్రణాళిక కాగితాలకు మాత్రమే పరిమితమైపోయే అవకాశాలే ఎక్కువ.

    సిలబస్‌, పశ్నపత్రం నమూనాల మీద పూర్తి అవగాహన కూడా ప్రణాళికకు ఉపకరిస్తుంది. సిలబస్‌లో వివిధ పాఠ్యంశాలకు దక్కిన ప్రాధాన్యాన్ని (వెయిటేజీ) తెలుసుకోవడమూ ముఖ్యమే.

నెలలవారీ విభజన 

    ఏడాది చివరి పరీక్షల్లో సాధించాల్సిన లక్ష్యాలను నెలలవారీగా విభజించుకోవడంతో చదువుకు సంబంధించిన ప్రణాళిక మొదలవుతుంది. సంవత్సర పరీక్షలకు పది నెలల సమయం ఉండగా అయిదు నెలల్లో 100% సిలబస్‌ పూర్తిచేసి, తర్వాతి అయిదు నెలలు పునశ్చరణకు కేటాయించడం ఇప్పుడు చాలామంది అనుసరిస్తున్న పద్ధతి. కానీ అది అంత శాస్త్రీయం కాదు.

    దీర్ఘకాలిక ప్రణాళికలో కొత్తపాఠాలు నేర్చుకోవడం, పాతపాఠాలను పునశ్చరణ చేసుకోవడం సమపాళ్లలో ఉండాలి. సంవత్సరం మొదట్లో కొత్తపాఠాలు చదివేందుకు ఎక్కువ సమయాన్ని, పునశ్చరణకు తక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ కొత్త పాఠ్యాంశాలకు తక్కువ సమయాన్నీ, పునశ్చరణకు ఎక్కువ సమయాన్నీ కేటాయించుకోవాలి.

    నెలలో మూడు వారాలు కొత్తపాఠాలకు (రాని పాఠాలు నేర్చుకొనేందుకు), ఆఖరి వారం పునశ్చరణకు నిర్దేశించుకోవాలి. వారంలో మొదటి అయిదు రోజులు కొత్తపాఠాలకూ, ఆఖరి రెండు రోజులు పునశ్చరణకూ కేటాయించుకోవాలి. రోజులో రాత్రి ఆఖరి గంట, మర్నాటి ఉదయం మొదటి గంట పునశ్చరణకు కేటాయించుకోవాలి. ఇది శాస్త్రీయమైన పద్ధతి.

రెండంచెల ప్రణాళిక 

సిలబస్‌ను నెలవారీ లక్ష్యాలుగా విభజించుకున్న తర్వాత రెండు అంచెల్లో ప్రణాళికను చేసుకోవాలి.

మొదటి అంచె సమయ ప్రణాళిక. రోజు మొత్తంలో చదువుకు కేటాయించే సమయం, అందులో విద్యార్థి చేతుల్లో లేకుండా అధ్యాపకులు చెప్పినట్లు చేసేందుకు కేటాయించాల్సిన సమయం, పూర్తిగా విద్యార్థి చేతుల్లో ఉండే సమయాలను అంచనా వేసుకోవాలి.

సమయ ప్రణాళికలో శారీరక విశ్రాంతి, మానసికంగా సేదతీరడానికి (రిలాక్సేషన్‌), స్నానాలు, భోజనం తదితర కార్యకలాపాలకు తగిన సమయం కేటాయించుకోవాలి. వీటికి తక్కువ సమయం కేటాయించుకోవడం వల్ల రోజుకు ఒకటి, రెండు గంటలు కలిసొచ్చినట్టు అనిపించినా చివరకు అది ఒత్తిడికే దారి తీస్తుంది.

సమయ ప్రణాళిక తర్వాతి అంచె- పాఠ్యాంశ ప్రణాళిక. అందుబాటులో ఉన్న సమయాన్ని వివిధ సబ్జెక్టులకు విభజించుకుని కేటాయించుకోవాలి. అందులో కొత్తపాఠాలు నేర్చుకొనేందుకు, పాతపాఠాల పునశ్చరణకు, రాత పనికి, చదివేందుకు, చూడకుండా రాసి చూసుకొనేందుకు సరైన సమయాన్ని కేటాయించుకోవాలి.

ఖాళీ సమయాలు ఉంచుకోవాలి

    ప్రణాళిక లక్ష్యం ఒత్తిడినీ, ఆందోళననూ జయించడం. ప్రణాళిక పేరుతో అనవసర ఒత్తిడి పెరగకూడదంటే ప్రణాళికలోని అనుకోని అవాంతరాలకు తగిన సమయం ఉంచుకోవాలి. వారంలో ఒక పూట, నెలలో మూడు రోజుల ఖాళీ వదిలేయాలి. అనుకోని కారణాలవల్ల ప్రణాళిక ఆచరణలో మిగిలిపోయిన లక్ష్యాలను ఆ ఖాళీల్లో పూర్తి చేయవచ్చు. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే పూర్తయితే సేదతీరుతూ మిమ్మల్ని మీరు అభినందించుకోవచ్చు.

అనుకరణ సరికాదు 

    రోజులో అనుకూలమైన, క్లిష్టమైన, కాస్త తక్కువ చురుకుగా ఉండే సమయాన్ని తేలికైన సబ్జెక్టులకు కేటాయించుకోవాలి. ఈ విషయంలో అనుకూలతలను అధ్యాపకులతో చర్చించి వారి అనుమతి తీసుకోవాలి. ఒకరికి అనుకూలమైనది ఇతరులకు కాకపోవచ్చు. అలాగే, ఒకరికి కష్టమైన సబ్జెక్టు అందరికీ అంత కష్టం కాకపోచ్చు. కాబట్టి అనుకూలతలు, బలాబలాలను బట్టి సామూహిక ప్రణాళికను ఆచరణకు అనుకూలంగా అనువర్తింపజేసుకున్నప్పుడే హాయిగా దాన్ని అమలు చేయగలుగుతారు. లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న వారి ప్రణాళికలను అడిగి, చూసి తెలుసుకోవడం మంచిదే కానీ, వాటిని యథాతథంగా అనుసరించడం మంచిది కాదు. ఎవరి ప్రణాళిక వారికే సొంతం. అది మర్చిపోకండి.

- డాక్ట‌ర్ టి.ఎస్‌. రావు, కౌన్సిలింగ్ సైకాల‌జిస్ట్‌

Posted Date: 17-08-2020


 

లక్ష్యం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం