• facebook
  • whatsapp
  • telegram

సుడిగుండంలో పడిపోవద్దు!

ఆలోచనలకు కళ్లెం వేద్దాం  

   ఆకాశ్ చదవడానికి కూర్చున్నాడే గానీ, పుస్తకంలోని విషయాలు బుర్రలోకి వెళ్లడం లేదు. అరగంట నుంచీ అతడు తెరచిన పుస్తకం తెరచినట్లే ఉంది. పేజీ మారలేదు. లైన్ మారలేదు. పుస్తకం ముందుంది. ధ్యాసంతా ఎక్కడో ఉంది. ఆలోచనలు తెరలు తెరలుగా ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉన్నాయి. సెలవుల్లో ఆనందంగా గడిపిన రోజులు.. స్నేహితులు.. గతంలో చూసిన సినిమాల్లోని సన్నివేశాలు.. పాటలు.. బుర్రను తొలుస్తున్నాయి.

   ఎప్పుడో ఒకసారి ఏకాగ్రత కుదరనప్పుడు ఇలా ఆలోచనలు వస్తే నష్టమేం లేదు. కానీ, చదవడానికి కూర్చున్నప్పుడల్లా లేదా ఎక్కువసార్లు ఇలా ఆలోచనలు ముసురుకుంటూ ఉంటే దీని గురించి ఆలోచించాల్సిందే! 
 

ఎందుకు?

   చదువుపై శ్రద్ధాసక్తులు లేనప్పుడే ఇలా ఆలోచనలు చుట్టుముడతాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే అసలు చదవాల్సిన అవసరమేమిటో విద్యార్థులు తెలుసుకోవాలి. విద్యార్థి ఏకైక లక్ష్యం మంచి మార్కులు తెచ్చుకోవడమే. ఇందుకోసం అతడు కొంత శ్రమకోర్చి చదవాల్సి ఉంటుంది.

మన భవిష్యత్తును మనం చదివే చదువే నిర్ణయిస్తుంది. దీన్ని బట్టి చదువు ప్రాధాన్యమేమిటో ఊహించవచ్చు. నిర్లక్ష్యం చేస్తే జీవితమంతా బాధపడాల్సి రావచ్చు. సబ్జెక్టులపై ఆసక్తిని పెంచుకుంటే కష్టమనుకున్న చదువు కాస్తా ఇష్టమవుతుంది కూడా.

మనసు మాట వినకు

     పరిపరివిధాలుగా ఆలోచించడం మన మనసుకున్న సహజలక్షణం. ఎందులో సుఖం ఉంటుందో, ఆనందం ఉంటుందో అదే కావాలని మనసు తహతహలాడుతుంది. మనసు మాట వినడం మొదలుపెడితే ఇక దాని కోరికల చిట్టాకు అంతే ఉండదు. కానీ, ఆలోచనలకు నిలయమైన మనసును అదుపులో పెట్టగల శక్తి 'బుద్ధి' కి మాత్రమే ఉంది. ఇక్కడ విచక్షణాయుతమైన ఆలోచననే బుద్ధిగా చెప్పుకోవచ్చు. అది నిరంతరం మన చర్యలను విశ్లేషిస్తూ, విమర్శిస్తూ ఉంటుంది. అందుకే మనసు మాట వినడం కంటే బుద్ధి మాట వినడం అన్ని విధాలా శ్రేయస్కరం.

సమస్యను సృష్టించుకోవద్దు

     చాలాసార్లు అనవసరమైన ఆలోచనలను మనకు మనమే సృష్టించుకుంటూ ఉంటాం. దీన్ని స్వయంకృతాపరాధంగా పేర్కొనవచ్చు. అతిగా టీవీ, కంప్యూటర్, సినిమాలు చూడటం, ఆటలపై పిచ్చి లాంటివి ఈ కోవలోకే వస్తాయి.
* టీవీ, కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చునే విద్యార్థుల్లో సృజనాత్మకశక్తి నశించిపోతోందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలోచనల్లో వేగం తగ్గి మందకొడితనం పెరుగుతున్నట్లు తేలింది.
*  సినిమాలు, అనవసర కబుర్ల వల్ల మరింత నష్టం పొంచి ఉంది. సినిమా రెండున్నర గంటల పాటూ ఉంటుంది. సినిమా చూసిన తరువాత దాని ప్రభావం విద్యార్థి మెదడుపై కొన్ని రోజులపాటు ఉంటుంది. చదువుకునేందుకు కూర్చుంటే ఆ సన్నివేశాలే గుర్తుకొస్తూ ఉంటాయి. చదువు ముందుకు సాగదు. అంటే, సినిమా చూసిన తరువాత జరిగే నష్టమే ఎక్కువ. స్నేహితులతో జరిగిన చర్చల తాలూకు జ్ఞాపకాలు కూడా చదువుకునేటప్పుడు గుర్తుకొచ్చి ఆటంకపరుస్తూ ఉంటాయి.
*  మానసిక వికాసంలో ఆటలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే వాటికి నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షలు దగ్గర పడినప్పుడు ఈ సమయాన్ని బాగా కుదించుకోవాలి. ఆటలపై ఆసక్తి ఉండాలి కానీ, అదో పిచ్చిలా మారకూడదు.
*  స్నేహితులతో గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ గడపటం, ఇంటర్‌నెట్‌లో చాట్.. వంటివి కూడా అనవసరమైన ఆలోచనలకు తెర తీస్తాయి. ఎక్కువమంది స్నేహితులు ఉండటం అంత మంచిది కాదు. అలాగని మిత్రులెవరూ లేకపోవడం కూడా సరికాదు. అవసరమైనప్పుడు మంచి సలహాలిచ్చి నడిపించే ఒకరిద్దరు సన్నిహితులు అందరికీ అవసరమే.

అనువైన వాతావరణం.

    విద్యార్థులు చదవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించుకోవడం ద్వారా ఆలోచనల ఒరవడి నుంచి కొంతవరకూ తప్పించుకోవచ్చు. ఉదాహరణకు చదువుకునే గది గాలి, వెలుతురూ బాగా వచ్చేలా ఉండాలి. శబ్దాలు వినిపించని ప్రదేశంలో చదవడం మంచిది. చదివేటప్పుడు ఎదురుగా గోడమీద ఏకాగ్రతను పోగొట్టే బొమ్మలో, క్యాలెండర్లో ఉండకుండా జాగ్రత్త పడాలి. వీలైతే సాధించదలుచుకున్న లక్ష్యాన్ని కాగితంపై రాసి ఎదురుగా కనిపించేలా పెట్టుకోవచ్చు. చదువుకునే ముందు అవసరమైన సామగ్రినంతా.. అంటే, పుస్తకాలు, పెన్, మంచి నీళ్లు, గడియారం వంటివన్నీ దగ్గరే ఉంచుకోవాలి. సుమారు రెండు గంటలపాటు చదివిన తరువాత అయిదు లేదా పది నిమిషాల చిన్న విరామం ఇవ్వాలి.

అలవాటు

    శరీరానికి, మనసుకు చదవడం అలవాటయ్యేలా చేయడం మరో మంచి పద్ధతి. 'సాధనమున పనులు సమకూరు ధరలోన..' అని వేమన చెప్పినట్లు రోజూ కదలకుండా కూర్చోవడం శరీరానికి నేర్పాలి. మనసును ఆలోచనల హోరు నుంచి ఏకాగ్రత పట్టాలమీదకు తేవాలి. కొంత కాలం తరువాత ఆశ్చర్యంగా కొన్ని గంటలపాటు కూర్చొని నిరంతరాయంగా చదివే శక్తి మన సొంతమవుతుంది.

అతి ఉత్సుకత అనవసరం

      చదువుతున్నప్పుడు ఎక్కడో ఏదో అలికిడైతే 'అదేమిటి..?' అనుకుంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టే అతి ఉత్సుకత మంచిది కాదు. ధ్యానంలో ఉండే ఏకాగ్రతను చదువులోనూ చూపాలి. అప్పుడే చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు కూడా విద్యార్థిని ఏమీ చేయలేవు.
      అన్నిటికీ మించి బాగా చదివే విద్యార్థి ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా, జీవితంపై ఆశావహమైన దృక్పథంతో ఉంటాడు. నిరాశ, నిస్పృహ, చిరాకు, కోపం వంటి ప్రతికూల ఉద్వేగాలు అనవసరమైన ఆలోచనలకు ఆస్కారమిస్తాయి. విద్యార్థిని లక్ష్యం నుంచి దూరంగా నడిపిస్తాయి. అందుకే విద్యార్థులు ఆలోచనల సుడిగుండంలో చిక్కుకోకుండా చదువులో రాణించి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.

Posted Date: 11-09-2020


 

ఆలోచన