• facebook
  • whatsapp
  • telegram

సమాజమే సహజమైన అద్దం!

 సగం నీళ్లున్న గ్లాసును చూపిస్తే కొంతమంది 'గ్లాసులో సగం నీళ్లున్నాయి అనీ, మరికొందరు 'సగం గ్లాసు ఖాళీగా ఉంది అనీ అంటారు. నీళ్లున్నాయని చెప్పినవారిని సానుకూల దృక్పథం ఉన్నవారిగా, ఖాళీగా ఉందనే వారిని ప్రతికూల ఆలోచనాసరళి ఉండేవారిగా మనం చెప్పుకుంటాం. ప్రతి మనిషికీ కొన్ని స్థిరమైన ఆలోచనలు లేదా అభిప్రాయాలు, ప్రవర్తన ఉంటాయి. వాటన్నిటి కలయికనే ఆ మనిషి వ్యక్తిత్వంగా గుర్తించవచ్చు. వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడం వెనుక తల్లిదండ్రుల నుంచి సంక్రమించే అనువంశిక లక్షణాలు, బాల్యం నుంచీ పెరిగిన పరిస్థితుల ప్రభావం, కుటుంబ, సామాజిక నేపథ్యం.. ఇలా ఎన్నో కారణాలుంటాయి.

విద్యార్థిగా ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఇంకా రూపుదిద్దుకునే దశలో ఉంటుంది. దీన్ని ఉన్నతంగా మలచుకోవడం ఆ విద్యార్థిమీదే ఆధారపడి ఉంటుంది. 

       మన మొహం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఏం చేస్తాం? అద్దంలో చూసుకుంటాం. అలాగే, మన వ్యక్తిత్వం ఏమిటో తెలుసుకోవడం ఎలా?...

సింపుల్.. మన గురించి, మన ప్రవర్తన గురించి మన చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటున్నారో తెలుసుకుంటే చాలు. అంటే ఇక్కడ సమాజమే అద్దం పాత్ర పోషిస్తుంది. 

      ఒక వ్యక్తి పట్ల ఇతరులు ఏర్పరచుకునే అభిప్రాయాలు ఆ వ్యక్తి ప్రవర్తనను బట్టే రూపు దిద్దుకుంటాయి. మన సహజసిద్ధమైన ప్రవర్తనే మన వ్యక్తిత్వానికి దర్పణం లాంటిది. తెచ్చిపెట్టుకున్న మంచితనం, కృత్రిమ ప్రవర్తనల ద్వారా ఎవరి మెప్పునూ పొందలేం. విశిష్టమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకోవడం ప్రతి మనిషికీ లక్ష్యం కావాలి.
 

ఏం చేయాలి? 

        ఎన్నెన్నో అధ్యయనాలు చెబుతున్న విషయమేమిటంటే సానుకూల దృక్పథంతో, ఆరోగ్యకరమైన అలవాట్లతో కూడిన వ్యక్తిత్వం ఉన్నవాళ్లు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని.

* ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం

* చదువుకు సంబంధించిన పనులను ఏరోజుకారోజే పూర్తి చేసుకోవడ

* శారీరక, మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం

* ఇతరులతో సత్సంబంధాలను కలిగి ఉండటం

* క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం

* చదువుతో పాటూ ఆటపాటలవంటి ఇతర రంగాల్లోనూ చురుగ్గా ఉండటం 

      ఈ లక్షణాలను అలవరచుకుంటే విద్యార్థి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకున్నట్లే. అతిగా నిద్రపోవడం, బద్దకం, వాయిదా వేసే మనస్తత్తం, నిర్లక్ష్యం వంటి అవలక్షణాలను ఎప్పుడూ దరి చేరనివ్వకూడదు. కాస్త ఆలస్యమైనా మంచి అలవాట్లను నేర్చుకోవాలి. మంచి అలవాటును నేర్చుకోవడమంటే ప్రాథమికంగా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం, అంతకుముందు లేని అంశాన్ని మన ప్రవర్తనలో భాగంగా చేసుకోవడమే. లేదా అప్పటికే ఉన్న దురలవాటు (ప్రవర్తన)ను వదలివేయడం. దీనికి స్థిరచిత్తం, దృఢసంకల్పం అవసరం.
 

ప్రయోజనాత్మక ప్రవర్తన

        వ్యక్తి ప్రవర్తన లేదా ప్రవర్తనలో మార్పు వికాసం వైపు గమనం సాగించేదిగా ఉండాలి. వ్యక్తిగతంగానే కాదు, సామాజికంగా కూడా ప్రయోజనకరంగా ఉండాలి. అప్పుడే ఆ వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్నవాడని భావించవచ్చు. సైకాలజీలో లోకస్ ఆఫ్ కంట్రోల్ అనే భావన ఉంది. అంటే ఒక వ్యక్తి తన ప్రవర్తనకు, తాను చేసే పనులకూ సంబంధించిన ఫలితాలకు కారణం తానే అనుకుంటాడా? ఇతరులనే బాధ్యులుగా చేస్తాడా? అనేది ఈ భావన. తన ప్రతి చర్యకూ, దాని పరిణామాలకూ తానే బాధ్యుడినని తలచే వ్యక్తికి ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉన్నట్లు భావించవచ్చు. తన చర్యలకు పరిస్థితులో, ఇతరులో కారణమనుకునేవారికి ఎక్స్‌టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉన్నట్లు. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తి పదిమందికీ ఆదర్శప్రాయుడవుతాడు. ఎందుకంటే, తన చర్యలకు లభించే పరిణామాలకు పూర్తిగా తానే (జవాబుదారీగా) బాధ్యుడినని అతడు మనసావాచా అంగీకరిస్తాడు కాబట్టి.
 

అభినందనే బలం

      మనతోటి వ్యక్తి విజయం సాధించినప్పుడు అతడిని చూసి అసూయపడటం మంచి లక్షణం కాదు. అతడిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇతరులు అభివృద్ధి చెందేటప్పుడు ప్రోత్సహించడం, అభినందించడం గొప్పగుణం. మన ఉన్నత వ్యక్తిత్వానికి ఈ గుణం నిదర్శనం. విద్యావంతుల స్వభావంలో ఉండే ప్రత్యేక లక్షణం. ఒక చిన్న అభినందన లేదా ప్రోత్సాహం ఎదుటివ్యక్తికి వెయ్యేనుగుల బలాన్నిస్తుంది. రేపు మనం విజయం సాధించినప్పుడు ఆ అభినందనలే మనల్ని ఇంకా ప్రేరేపించి ముందుకు నడిపిస్తాయి. ఇలాంటి మంచి లక్షణాలే ప్రవర్తనలో గుణాత్మకమైన మార్పులు తెచ్చి ఉన్నత వ్యక్తిత్వం దిశగా పయనింపజేస్తాయి.
 

ఆచరణతోనే సాధ్యం 

       ప్రవర్తనలో మార్పును స్పష్టంగా నిర్వచించుకోవాలి. మరుక్షణం నుంచే దాన్ని అమలు చేయాలి. అనుకున్నది ఆచరణలో పెట్టకపోతే ఎలాంటి మార్పూ రాదు. మంచి అలవాట్లను నిరంతరం ఆచరిస్తూపోతే ప్రవర్తనలో వచ్చిన మార్పును చుట్టూ ఉన్నవాళ్లు గుర్తిస్తారు. క్రమంగా ప్రశంసలు మొదలవుతాయి. వికాసం దిశగా దృఢమైన, సానుకూల, వ్యక్తిత్వాన్ని అలవరచుకోవడంలో ఇది తొలిమెట్టని గ్రహించండి. 'విద్య అంతిమలక్ష్యం వాంఛనీయమైన ప్రవర్తన మార్పు అని డాక్టర్ బెంజిమన్ బ్లూమ్ అనే విద్యావేత్త అన్నాడు. కొన్ని విద్యాలక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో విద్యను కొనసాగించాలని పేర్కొన్నాడు. విద్యార్థి సత్ఫలితాలు సాధించాలంటే మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి. విద్యా లక్ష్యాలను సాధించాలి.  

Posted Date: 11-09-2020


 

వ్యక్తిత్వం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం