• facebook
  • whatsapp
  • telegram

అదనమే ఇంధనం

ప్రాముఖ్యం పెరుగుతున్న అప్‌స్కిల్లింగ్‌

‘నా నైపుణ్యాలు భవిష్యత్‌లో ఉద్యోగానికి సరిపోతాయా?’- విద్యార్థులూ, ఉద్యోగార్థులతో పాటు కొలువుల్లో కొనసాగుతున్న వారినీ కలవరపరుస్తున్న ప్రశ్న ఇది! ఏటా ఉద్యోగ మార్కెట్‌లోకి రాబోయేవారూ, అడుగు పెట్టినవారూ ఈ ప్రశ్నను ఎదుర్కొంటూ ఉంటారు. కానీ గత ఏడాది గడ్డు కాలం ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశ్రమలపైనా ప్రభావం చూపింది. టెక్నాలజీ, సృజనాత్మకత, రెగ్యులేషన్స్‌.. ఇలా ఏదో ఒక మార్పు తప్పనిసరి అవుతోంది. ఈ సమయంలో అందరి దృష్టీ పడుతున్నది అదనపు నైపుణ్యాలు నేర్చుకోవటం (అప్‌స్కిల్లింగ్‌) పైనే! కెరియర్‌ను నడిపించే ఇంధనమిది. కొవిడ్‌ తీవ్ర సమయంలోనూ,  పరిస్థితి మెరుగవుతున్న ఈ సమయంలోనూ నిపుణులందరూ సూచిస్తున్న మార్గమిది.

గత దశాబ్దకాలంగా టెక్నాలజీ ప్రమేయం ప్రతి పరిశ్రమలోనూ పెరుగుతూనే ఉంది. వాటికి అనుగుణంగానే అభ్యర్థుల నుంచి ఆశించే నైపుణ్యాల్లోనూ మార్పులుంటున్నాయి. ఇది సాధారణ విషయమే. కానీ ఏడాది నుంచి మరో ఏడాదికి వచ్చేసరికి వాటిల్లో కొద్ది మార్పులే ఉండేవి. కానీ కొవిడ్‌ పరిస్థితి తరువాత టెక్నాలజీ ప్రమేయం బాగా పెరిగింది. దీనికి ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడమూ తోడైంది. వెరసి సంస్థలు ఉద్యోగులపై లోతైన దృష్టిపెట్టాయి. దీంతో ఎంతోమంది కొలువులను కోల్పోవాల్సి వచ్చింది. కొత్త, ఆధునిక నైపుణ్యాలు చేతిలో ఉన్నవారు ఈ పరిస్థితిలో నిలవగలిగారు. 

ఉద్యోగ మార్కెట్‌లోనూ, పోటీలోనూ నిలవాలంటే అప్‌స్కిల్లింగ్‌గా వ్యవహరించే ఈ ఒరవడిని ఒడిసి పట్టుకోవాలన్నది నిపుణుల మాట. సాంకేతిక ప్రమేయం పెరిగే కొద్దీ ఉద్యోగాలన్నీ స్పెషలైజ్‌డ్‌విగా మారిపోతున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ) ప్రమేయమూ పెరుగుతోంది. వీటితో పనిచేయడానికి అదనపు నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. సంప్రదాయ విద్యా విధానం వీటిని తీర్చలేకపోతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అప్‌స్కిల్లింగ్‌కు ప్రాముఖ్యం పెరుగుతోంది. 

ఎదగటానికి...

వృత్తిపరంగా ఎదగడానికి అవసరమైన అదనపు, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడాన్ని అప్‌స్కిల్లింగ్‌గా చెబుతారు. చాలావరకూ సంస్థలు తమ ఉద్యోగుల్లో కొత్త సామర్థ్యాలు నింపడానికీ, స్కిల్‌ గ్యాప్‌ను తగ్గించడానికీ శిక్షణ కార్యక్రమాల రూపంలో దీన్ని అందించేవి. కొవిడ్‌ తరువాత ఉద్యోగులు/ విద్యార్థులే పరిశ్రమల అవసరాల దృష్ట్యా వాటిపై దృష్టిపెట్టడం అనివార్యమైంది. వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికీ, తమ వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించడానికీ సంస్థలన్నీ డిజిటల్, ఆటోమేషన్‌ బాట పట్టాయి. దీంతో ఒరవడిలో కొనసాగడానికి అప్‌స్కిల్లింగ్‌ తప్పనిసరి అయ్యింది. భవిష్యత్‌లోనూ మార్కెట్‌లో నిలవాలంటే ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నది అధ్యయన నివేదికలు రుజువు చేస్తున్న సత్యం.

ప్రముఖ గ్లోబల్‌ సంస్థ 2020 నివేదిక ప్రకారం 87% మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల అంతరం (స్కిల్‌ గ్యాప్‌) కనిపిస్తోంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం గత ఏడాది ఆగస్టులో దేశంలో నమోదైన నిరుద్యోగితా శాతం 7.7. వీరిలో ఉద్యోగాలు కోల్పోయినవారిదీ ప్రధాన వాటానే. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే.. తాజా గ్రాడ్యుయేట్, అనుభవమున్న ప్రొఫెషనల్‌ ఇలా ఎవరైనా పరిశ్రమతో సంబంధం లేకుండా అదనపు, డిజిటల్‌ నైపుణ్యాలను అందుకోవడం తప్పనిసరి.

ఎలా అందుకోవచ్చు?

మెంటర్‌ 

భవిష్యత్‌పరంగా మీ లక్ష్యాలు, కలలు తెలుసుకుని ఆ దిశగా ప్రోత్సహిస్తూ, మార్గనిర్దేశం చేసేవారే మెంటర్‌. తమ రంగానికి చెందినవారైనా, తాను చదువుతున్న కళాశాల అధ్యాపకుడు లేదా కుటుంబ సభ్యులైనా అయ్యుండొచ్చు. వీరు మీ అభిరుచులను అర్థం చేసుకుంటూనే లక్ష్య సాధనలో అవసరమైన మార్గనిర్దేశం చేయగలుగుతారు. వీరి అనుభవం, పరిజ్ఞానం త్వరితగతిన నేర్చుకునే వీలునూ కల్పిస్తాయి. ప్రాక్టికల్‌ పరిజ్ఞానం ఇక్కడ వీలవుతుంది.

నేరుగా శిక్షణ

కొన్నింటిని ఉదాహరణకు- సాంకేతిక అంశాల వంటివి నిపుణుల నుంచి నేరుగా నేర్చుకోవాల్సి ఉంటుంది. షార్ట్‌టర్మ్‌ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు ఇవన్నీ వీటి కిందకి వస్తాయి. ఇవి ప్రాక్టికల్‌ పరిజ్ఞానాన్ని చేజిక్కించుకోవడానికి సాయపడతాయి.

మైక్రో లర్నింగ్‌

కొద్ది సమయంలో ఎక్కువ విషయాన్ని నేర్చుకోగల వీలును మైక్రో లర్నింగ్‌గా చెపొచ్చు. ఉదాహరణకు- ఒక అంశాన్ని తరగతి గదిలో కూర్చునే తెలుసుకోవాలన్న నిబంధనేమీ లేదు. ఇప్పుడు సులువుగా, చిన్న వీడియో ద్వారా నేర్పించే అవకాశాలు ఇప్పుడు చాలానే అందుబాటులో ఉన్నాయి. చిన్న సూత్రం నుంచి ఎన్నో పెద్ద అంశాలవరకూ ఇప్పుడు ఈ రూపంలో అందుబాటులో ఉన్నాయి. తక్కువ వ్యవధిలో విషయాన్ని నేర్చుకోవాలనుకునేవారు ఈ పద్ధతినీ అనుసరించవచ్చు.

సెమినార్లు

పెద్ద విద్యాసంస్థలు, వ్యాపారవేత్తలు, విదేశీ నిపుణులు.. సెమినార్లు నిర్వహిస్తుంటారు. వాటికి హాజరు కావొచ్చు. ఏదో ఒక అంశంపై ప్రసంగిస్తుంటారు. ఆన్‌లైన్‌లో పాల్గొనే వీలూ ఉంటుంది. అంశాన్ని తెలుసుకోవడంతోపాటు సందేహాలను నివృత్తి  చేసుకునే వీలుంటుంది.

వర్చువల్‌/ ఆన్‌లైన్‌ లర్నింగ్‌

ఇప్పుడు ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు- దేశ, విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో ఎన్నో ఉచిత వేదికలూ అందుబాటులో ఉన్నాయి. నచ్చినవాటిని, వీలైన సమయంలో, మెచ్చిన ప్రదేశంలో నేర్చుకునే వీలు వీటి ద్వారా కలుగుతుంది.

ఉపయోగాలివీ!

సంస్థలో స్థిరమైన స్థానం, ఆదరణ ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగార్థులకు అదనపు వెయిటేజీ లభిస్తుంది.

నిరంతరం మారుతున్న ఉద్యోగ ధోరణులకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండొచ్చు. అదనపు అర్హతలు రెజ్యూమెకు వచ్చి చేరతాయి.

కెరియర్‌లో నిలకడగా ముందుకు సాగడానికీ, ఎదగడానికీ అప్‌స్కిల్లింగ్‌ సాయపడుతుంది.

సంస్థలో ఉత్తమ స్థానంతోపాటు ఉద్యోగ భద్రతా దక్కుతుంది. విపరీతంగా పెరుగుతున్న పోటీలో అందరికంటే భిన్నంగా ఉండటానికి సాయపడుతుంది.

తాజా పరిస్థితినే గమనిస్తే.. కొన్ని రకాల ఉద్యోగాలే కనుమరుగయ్యాయి. ఇలాంటప్పుడు వాటిపైనే ఆధారపడినవారు/ ఫలానా పని మాత్రమే తెలిసినవారు ఇబ్బందికి గురయ్యారు. ఉపాధినీ కోల్పోయారు. వివిధ నైపుణ్యాలపై దృష్టిపెట్టినవారు వేరే రంగాల్లో స్థిరపడ్డారు. 

వృత్తిపరమైన సామర్థ్యం పెరుగుతుంది. వివిధ విభాగాలు, వాటి పనితీరుపైనా అవగాహన ఏర్పడుతుంది.

గమనించాల్సినవి...

‘నేర్చుకుంటూ ఉండాలి..’ నిపుణులు చెబుతున్న మాట ఇది! కానీ ఏం నేర్చుకోవాలి అనేది వ్యక్తిగత ఆసక్తి, అవసరం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ గమనించాల్సిందేంటే.. తాజా ధోరణులు, నూతన సాంకేతికతలను నేర్చుకోవాలన్న ఆలోచన మంచిదే. కానీ.. అది మీకెంతవరకూ సాయపడుతుందన్న అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు- బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీని నేర్చుకోవాలనుకున్నారనుకుందాం. కానీ మీ రంగానికికానీ, మీకు కానీ సమీప భవిష్యత్తులో ఏమాత్రం ఉపయోగం లేనపుడు అది నేర్చుకోవడం వల్ల లాభమేమీ ఉండదు. కాబట్టి.. తాజా పరిస్థితుల్లో అవసరమైనవీ, తప్పనిసరి అవుతున్నవాటినీ నేర్చుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆన్‌లైన్‌ వేదికలు, చిన్న వీడియోలు.. ఆసక్తి ఉండాలేకానీ ఏ అంశాన్నైనా వివరించే వేదికలెన్నో. కేవలం వింటూపోతే మాత్రం ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పరీక్షించి, ప్రయోగాత్మకంగా ఉపయోగించి చూసుకోవాలి. అప్పుడే ఎంతవరకూ అర్థమైందో, ఆ అంశంలో ఏమేరకు పట్టు తెలియాలంటే నేర్చుకున్నదేదైనా ఆచరణలో పెట్టి/ ప్రయత్నించి చూడాలి. ఉదాహరణకు- మార్కెటింగ్‌ విశ్లేషణను నేర్చుకున్నారనుకుంటే.. దానిని సామాజిక మాధ్యమాల్లో ఎలా ఉపయోగించవచ్చో ప్రయత్నించవచ్చు.

కొత్త సాంకేతికతల గురించి వెబ్‌నార్లు, సమావేశాలు నిర్వహిస్తుంటారు. పాల్గొనేవారి సంఖ్యా ఎక్కువగానే ఉంటుంది. రెజ్యూమెల్లో వీటిని ప్రస్తావించుకోవచ్చు. అయితే చాలామంది విద్యార్థులు, ఉద్యోగార్థులు వీటిని విరామ సమయంగా భావించి పేరుకే పాల్గొని వస్తుంటారు. అది ఏమాత్రం మంచిదికాదు. కేవలం సర్టిఫికెట్‌ కోసమో, రెజ్యూమెలో వెయిటేజీకి మాత్రమేనో కాకుండా శ్రద్ధగా విషయాలను తెలుసుకోవడానికి  ప్రయత్నించండి. వారు చేసే సూచనలు భవిష్యత్‌లో ఉపయోగపడతాయి.

Posted Date: 11-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం