• facebook
  • whatsapp
  • telegram

ప్రశ్నించే వారికే కార్పొరేట్‌ కొలువులు

‘ఒక పని ఇలానే ఎందుకు జరగాలి? మరోరకంగా ఎందుకు చేయకూడదు?’ అనే ప్రశ్న ఎన్నో ఆలోచనలకు దారితీస్తుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కొత్త ఆవిష్కరణలు ముందుకొస్తాయి. కొత్తవి తెలుసుకోవాలనే ఇలాంటి ఆలోచన విధానం ఉన్నవారికే కార్పొరేట్‌ సంస్థలు నియామకాల్లో ఎర్ర తివాచీ పరుస్తాయి! 

పోటీని విజయవంతంగా ఎదుర్కొని మనుగడ సాగించేందుకు వ్యాపారసంస్థలు సృజనాత్మక మార్గాల కోసం ఎదురుచూస్తుంటాయి. ఒక సంస్థ అభివృద్ధి, మనుగడ ఆ సంస్థ నూతన ఆవిష్కరణలకు చేసే పరిశోధనలపైనా, సంస్థలో పనిచేసే ఉద్యోగుల సామర్ధ్యాలపైనా ఆధారపడి ఉంటుంది. చాలా వ్యాపార సంస్థలు ప్రతి అంశాన్నీ ప్రశ్నించగలిగే యువకులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయి. జిజ్ఞాస (తెలుసుకోవాలనే కోరిక) ఒక నైపుణ్యం. దీన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన లక్షణాలను పరిశీలిద్దాం.  

ప్రతి విషయంపైనా ఆసక్తి  

విద్యార్థులు సాధారణంగా తమ పాఠ్యాంశాలు, కోర్‌ సబ్జెక్టులపై ఎక్కువ శ్రŸద్ధ చూపుతారు. మరి కొంతమంది వివిధ పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఉపయోగపడే ఇతర అంశాలకు సమయం కేటాయిస్తుంటారు. వీటికి అదనంగా జిజ్ఞాస, ఆసక్తి పెరిగేందుకు కొత్త అభిరుచులు పెంచుకోవాలి. ఉదాహరణకు మీరు ఇంజినీరింగ్‌ విద్యార్థి అయితే అదనంగా మీ పాఠ్యాంశాలకు సంబంధం లేని లైబ్రరీ సైన్స్‌లోనో, సాహిత్యంలోనో ఆన్‌లైన్‌ కోర్స్‌ చదవండి. ఇది మీకు అకడమిక్‌గా ఉపయోగపడనప్పటికీ మీ ఆలోచనా తీరు మారడానికి సహకరిస్తుంది. విభిన్న మనస్తత్వాలు, అభిరుచులున్న వ్యక్తులను పరిచయం చేసుకుని వారితో సంభాషించండి. ఇలాంటి చర్యల వల్ల మూస ఆలోచనా పరిధిని దాటుతారు. జిజ్ఞాస పెరుగుతుంది. నూతన ఆలోచనా విధానం అభివృద్ధి చెందుతుంది. కార్పొరేట్‌ సంస్థలు ఈ లక్షణాలనే కోరుకుంటాయి.  

సహజ ఉత్సాహం తగ్గించుకోవద్దు

జిజ్ఞాసకు సంబంధించిన అంశాల్లో సమాధానాలతో కాదు, ప్రశ్నలతోనే సంబంధం. విద్యార్థిని ప్రశ్నలే ముందుకి నడిపిస్తాయి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని, ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలంటే అందుకు ఉత్సాహం, జిజ్ఞాస ఉండాలి. జిజ్ఞాస లేని వ్యక్తులు ప్రశ్నించుకోలేరు. ప్రశ్నించలేని వ్యక్తికి  సమాధానాలు దొరకవు. 

మీరో పుస్తకంలోని పజిల్‌ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారనుకుందాం. ఈ పజిల్‌కు సమాధానాలు కూడా అదే పుస్తకంలో ఏదో ఓ పేజీలో ఉంటాయనుకుందాం. ప్రయత్నించకుండా మీరు నేరుగా సమాధానం ఉన్న పేజీ తెరిచి చూస్తే శ్రమ లేకుండా సమాధానాలు దొరుకుతాయి. అయితే, సమస్యను పరిష్కరించేందుకు ప్రశ్నించే అవకాశం మీకుండదు. ప్రశ్నించలేనపుడు, మీలో ఉత్సాహానికీ తావుండదు. 

సమాధానాలపై దృష్టి పెట్టడం విద్యార్థిలోని సహజ ఉత్సాహాన్ని తగ్గిస్తుందని కాగ్నిటివ్‌ సైంటిస్ట్‌ ‘డేనియల్‌ విల్లింగ్‌ హామ్‌’ తన పరిశోధనల ద్వారా నిరూపించాడు. నిరంతరం తనను తాను ప్రశ్నించుకుంటూ ప్రతి ఆంశాన్నీ ప్రశ్నించేవారికే విజయావకాశాలు ఎక్కువ. 

సొంత ఆలోచనలు ముఖ్యం  

ఏదైనా కొత్త విషయాలను ఆలోచించాల్సి వచ్చినప్పుడు కొన్ని పరిధులు గీసుకుని, ఆ పరిధిలోనే ఆలోచిస్తుంటాం. ఆశించిన సమాధానం దొరకనప్పుడు ఆలోచనలు అక్కడితో ఆపేసి గూగుల్‌లోకి వెళ్ళి అన్వేషిస్తాం. అక్కడ కూడా సమస్య పరిధి తెలుసుకోకుండా విశ్లేషించకుండా తదుపరి చర్యలు చేపడుతుంటాం. ఇది మన ఆలోచనా తీరును నియంత్రిస్తుంది. ప్రారంభంలో సమస్యకు పరిష్కారాలు కొంత ఆలస్యమైనప్పటికీ అనుకున్న సమస్యా పరిష్కారానికి వీలైనన్ని సొంత ఆలోచనలు చేయండి. కొత్త కొత్త గణాంకాలను సేకరించి విశ్లేషించండి. ఇది మీ మానసిక పరిపక్వత స్థాయిని పెంచుతుంది. విజేతలైన చాలామంది వృత్తి నిపుణులకు రెండు లేదా అంతకన్నా ఎక్కువ రంగాల్లో ప్రావీణ్యంతోపాటు వీలైనన్ని ఎక్కువ అంశాల్లో విషయ పరిజ్ఞానం ఉండటం గమనించవచ్చు. కొత్త విషయాలను స్వయంగా తెలుసుకోకుండా తక్షణావసరానికి సాంకేతికతపై అతిగా ఆధారపడేవారు భవిష్యత్తులో సమాచార రాహిత్యంతో ఇబ్బంది పడతారు. విద్యార్థి దశలో వీలైనన్ని ఎక్కువ విషయాలపై ఆసక్తి పెంచుకోవాలి.

వాస్తవ పరిస్థితిని ప్రశ్నించండి.  

నేర్చుకోవడం ఒక పనిగా కాకుండా ఒక భాగంగా భావించండి.

వీలైనన్ని ఎక్కువ పుస్తకాలు చదవండి.

మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించండి. 

‣ Read Latest job news, Career news, Education news and Telugu news

‣ Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 31-03-2022


 

ప్రజెంటేషన్‌

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం