• facebook
  • whatsapp
  • telegram

స‌హానుభూతితో స‌త్సంబంధాలు

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

విలక్షణ లక్షణం.. సహానుభూతి

మహాత్మాగాంధీని జాతిపితగా, జేఆర్‌డీ టాటాను భారత పారిశ్రామిక పితామహుడిగా, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తిని భారత ఐటీ దిగ్గజంగా, బాలీవుడ్‌ విలన్‌ సోనూసూద్‌ను లాక్‌డౌన్‌ హీరోగా నిలిపిందేమిటి? వారి రంగాల్లో గొప్ప ప్రతిభ చూపినందువల్ల మాత్రమే కాదు. వీరందరిలోనూ నిక్షిప్తమైన ఒక లక్షణం మనందరి హృదయాలకు దగ్గర చేసింది. మన మనఃఫలకాలపై ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచింది. అదే సహానుభూతి (ఎంపతీ). ఏ రంగంలో ఉన్నా సహానుభూతి ఉన్నవారు దానిలో ధ్రువతారల్లా మెరుస్తుంటారు!

సహానుభూతి అంటే.. ఇతరులను అర్థం చేసుకోవడం. ఇతరుల అవసరాలను సకాలంలో గుర్తించగలిగే సామర్థ్యం. పరుల మనోభావాలు, కోర్కెలు, అవసరాలను అర్థం చేసుకోగలగడం. మన చుట్టూ ఉన్నవారితో సత్సంబంధాలు ఏర్పరచుకుని, అవి దీర్ఘకాలం కొనసాగాలంటే సహానుభూతి ఉండాలి. మనకు ఎలాంటి అవసరాలు ఉంటాయో ఎదుటివారికీ అలాంటివే ఉంటాయనే అవగాహన గాఢంగా ఉండాలి. తన గురించి మాత్రమే 24 గంటలూ ఆలోచిస్తూ అదే స్వార్థంతో ప్రతి పనీ చేయకుండా పరుల గురించీ ఆలోచించడం, వారి భావాలను అర్థం చేసుకోవడం ఎంత గాఢంగా ఉంటే వారు ప్రజలకు అంత దగ్గరవుతారు. అంద]ుకే సహానుభూతిని ఒక జీవన నైపుణ్యం (లైఫ్‌ స్కిల్‌)గా వర్గీకరించారు.

సహానుభూతిని సహజసిద్ధంగా పెంపొందించుకోవాల్సిన  జీవన నైపుణ్యంగా నిపుణులు చెపుతున్నారు.  భావవ్యక్తీకరణ లాంటి నైపుణ్యాలను శిక్షణ ద్వారా నేర్చుకోవచ్చు. కానీ సహానుభూతి చాలావరకూ వ్యక్తిత్వంలో పొదిగివుండే లక్షణం. అందువల్లే దీన్ని కృతకంగా అరువు తెచ్చుకోలేం. తోటివారిపై  ఆసక్తి చూపడం ద్వారా మాత్రమే దీన్ని సాధించగలం.

నాలుగు దశల్లో ..

స్వీయ అవగాహన: సహానుభూతికి తొలిమెట్టు స్వీయ అవగాహనే. సొంత ఉద్వేగాలు, అనుభూతులపై లోతైన అవగాహన ఏర్పరచుకుంటే ఇతరుల అనుభూతులను త్వరగా అర్థం చేసుకోగలుగుతాం.

దయార్ద్ర హృదయం: ఎదుటివారి కష్టాలను, వారి అనుభవాలను ఓపిగ్గా వినాలి. వివరంగా తెలుసుకోగలిగే సహనం ఏర్పరచుకోవాలి. దీనివల్ల సహానుభూతి ఏర్పడుతుంది.

వ్యక్తీకరణ: బాధల్లో ఉన్నవారి ఇబ్బందులను అర్థం చేసుకోవడంతోపాటు వారిపట్ల సానుభూతి వ్యక్తం చేయాలి. సహానుభూతి ఏర్పడటానికి ఇది దారితీస్తుంది. వారి బాధలు ఓపికగా విని సానుభూతి తెలపడం అలవాటు చేసుకోవాలి.

జీవిత చరిత్రల పఠనం: సహానుభూతి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే ప్రముఖుల జీవిత చరిత్రలు చదవొచ్చు. మదర్‌ థెరిసా జీవిత చరిత్ర చదివితే రోగుల, దీనుల పట్ల ఆమె స్పందించిన విధానం, ఆమె చేసిన సేవలకు కళ్లు చెమర్చకమానవు. ఇదే సహానుభూతి అంకురించడానికి ఆస్కారం కలిగిస్తుంది. 

ప్రముఖుల్లో..

ఆంగ్లేయుల పాలనలో కూడు, గుడ్డకు కటకటలాడుతున్న భారతీయుల దారిద్య్రాన్ని చూసి చలించిన గాంధీజీ కొల్లాయి కట్టి మితాహారంతో ఆశ్రమ జీవితాన్ని గడిపారు. తమ అవసరాలను అర్థం చేసుకున్నందుకు ప్రజలు ఆయనకు  బ్రహ్మరథం పట్టారు. దేశంలో అతి పేదవాని వదనాన్ని గుర్తుకు తెచ్చుకుని, అది అతని ముఖంలో సంతోషం తీసుకు రాగలుగుతుందా? అని ఆలోచించి ప్రభుత్వాధినేతలు విధాన నిర్ణయం తీసుకోమని గాంధీజీ సూచించడం ఆయనకున్న సహానుభూతికి ప్రబల నిదర్శనం.

టిస్కో, టాటా సంస్థలను స్థాపించి లక్షలమందికి ఉపాధి కల్పించిన తొలితరం పారిశ్రామికవేత్త జేఆర్‌డీ టాటా. ఆయన చాంబర్‌ బహుళ అంతస్తుల భవనంలో పదో అంతస్తులోనో, పదకొండో అంతస్తులోనో ఉండేది. ప్రతిరోజూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లడం ఆయనకు అలవాటు. ఒకవేళ ఏదైనా ఒకరోజు పని ఒత్తిడిలో ఇంటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఆయనే లిఫ్ట్‌లో స్వయంగా కిందికి వెళ్లి, డ్రైవర్‌కు ఆ విషయం చెప్పి అతడిని లంచ్‌కు పంపేవారు. తాను లంచ్‌కు వెళ్లనందున డ్రైవర్‌ అలా ఆకలిగా నిరీక్షిస్తూ ఉండటం ఇష్టంలేని జేఆర్‌డీ స్వయంగా కిందకి వెళ్లి చెప్పేవారు. ఇలాంటి సహానుభూతి ఉన్నందువల్లే జేఆర్‌డీ భారతరత్న అయ్యారు.

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి తాను ఐటీ దిగ్గజ సంస్థ ఛైౖర్మన్‌ అయ్యుండీ.. బెంగళూరు ప్రాంగణంలో తన కారును పార్క్‌ చేసే స్థలంలో తాను సకాలంలో వెళ్లలేకపోతే మరో ఉద్యోగి ఎవరైనా కారు పెట్టుకునే స్వేచ్ఛ ఇచ్చేవారు. తాను దూరంగా మరోచోట పార్క్‌ చేసి, తన ఛాంబర్‌కు అంతదూరం నడిచి వెళ్లేవారు. ఇతర ఉద్యోగుల మనోభావాలను గుర్తించగలిగే సహానుభూతి ఉన్నందువల్లే ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని గొప్పగా చెబుతారు.

సహానుభూతికి తాజా నిదర్శనం నటుడు సోనూసూద్‌. లాక్‌డౌన్‌ విధించడంతో లక్షలమంది వలస కూలీలు చంకన చంటి బిడ్డలను వేసుకుని, మండు టెండల్లో జాతీయ రహదారులపై నడిచి సొంతూళ్లకు పయనమైన తీరు అందరి హృదయాలను పిండేసింది. దీనిపై స్పందించిన సోనూసూద్‌ రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి, వేల మందిని వారి గ్రామాలకు పంపారు. దేశ ప్రజల చేత రియల్‌ హీరోగా నీరాజనాలు అందుకున్నారు. ఇలా ఎన్నో సంఘటనల్లో తోటివారి బాధలను ఆయన తన బాధగా భావించి స్పందించారు.

 

Posted Date: 04-01-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం