• facebook
  • whatsapp
  • telegram

ఆకళించుకుంటే సులువే! 

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

పరిస్థితులపై గట్టి పట్టు సాధిస్తేనే విజయం వరిస్తుంది. కెరియర్‌లో ఎదగాలనుకునే విద్యార్థులకూ ఈ జీవన నైపుణ్యం ఎంతో అవసరం!

మొదట్నుంచీ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన భార్గవ్‌ ఆఫ్‌ క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ సెలక్షన్‌లలో వరసగా విఫలమవుతున్నాడు. కానీ ఉత్తరాంధ్రలోని మారుమూల పల్లెకు చెందిన మాధవ్‌ సివిల్స్‌ ఇంటర్వ్యూ కోసం ఢిల్లీకి వెళ్లి చివరికి కోరుకున్న ఐఏఎస్‌ సాధించాడు. వీరిద్దరిలో మాధవ్‌ చేసిందేమిటి? భార్గవ్‌ వెనుకబడింది ఎందులో?

మాధవ్‌కి ఢిల్లీ కొత్త అయినా, సివిల్స్‌ ఇంటర్వ్యూ మొదటిసారి అయినా అతడు పరిస్థితులను త్వరగా ఆకళింపు చేసుకునే సామర్థ్యాన్ని అలవర్చుకున్నాడు. రెండు రోజుల ముందే ఢిల్లీ వెళ్లి నగరాన్నీ, ఒకరోజు ముందే యు.పి.ఎస్‌.సి.కి వెళ్లి అక్కడి పరిస్థితులనూ అర్ధం చేసుకున్నాడు.ఇంటర్వ్యూని పూర్తి స్థైర్యంతో ఎదుర్కొన్నాడు. గెలుపును సొంతం చేసుకున్నాడు. మాధవ్‌ ప్రదర్శించిదీ.. భార్గవ్‌ చూపలేకపోయిందీ పరిస్థితులపై పట్టు (కమాండ్‌ ఆన్‌ సిచ్యువేషన్‌). ఇది ఒక జీవన నైపుణ్యంగా భాసిల్లుతోంది. ఈ దక్షత వున్నవారు హీరోలుగా నిలుస్తుంటే, ఇది లేనివారు జీరోలుగా మిగిలిపోతున్నారు.

ఏమిటీ నైపుణ్యం?

క్రీస్తుపూర్వం 47లో ఈజిప్టు సంక్షోభాన్ని నివారించడానికి వెళ్లిన రోమన్‌ జనరల్‌ జూలియస్‌ సీజర్‌ తన అనుచరుడికి రాసిన మూడే మూడు ముక్కల ఉత్తరంలోనే ఈ నైపుణ్యం దాగివుంది. ‘ఐ కేమ్, ఐ సా, ఐ కాంకర్డ్‌ (నేను వచ్చాను, చూశాను, జయించాను) అని రాశాడు సీజర్‌. ఈజిప్టుకు వచ్చి ఇక్కడి పరిస్థితులను వేగంగా ఆకళింపు చేసుకొని ఆధిక్యం సాధించాను అనేది దీని అర్ధం. ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు, ఒక వ్యాపార ఒప్పందం కావచ్చు, పెళ్లి సంబంధం కావచ్చు, ఆపదలో వున్న స్నేహితుడిని ప్రాణాపాయం నుంచి బయటపడేయడం కావచ్చు. ఇలా విభిన్న జీవన సందర్భాల్లో, సంక్షిష్ట పరిస్థితుల్లో పట్టు సాధించి- కావలసిన ఫలితం రాబట్టడమే నైపుణ్యం.

కేరళకు చెందిన వర్గీస్‌ కురియన్‌ అమెరికాలో ఇంజినీరింగ్‌ పీజీ పూర్తిచేసి తన ప్రాంతం కాని గుజరాత్‌ రాష్ట్రంలోని ఆనంద్‌కి అప్రెంటిస్‌షిప్‌ కోసం వచ్చారు. అక్కడి వనరులు, పాడి రైతుల ఇక్కట్లను అర్ధం చేసుకొని సహకార రంగంలో అమూల్‌ సంస్థను నెలకొల్పారు. దేశంలో పాలవిప్లవానికి నాంది పలికారు. 

యూపీఐ ప్లాట్‌ఫామ్‌పై పేమెంట్‌ యాప్‌ సృష్టించిన విజయ శేఖరశర్మ- పేటీఎం ద్వారా ఈ రంగంలో ఆద్యులయ్యారు. ‘క్యూ ఆర్‌ కోడ్‌’ స్కాన్‌ ద్వారా పర్సు తీయకుండా పనులు పేటీఎం జరిపిస్తుంది. నేడు పేటీఎం బోర్డు లేని దుకాణం అరుదు.  

17 ఏళ్ల రితీష్‌ అగర్వాల్‌ దేశమంతా తిరిగినప్పుడు యాత్రికుల బసకు సంబంధించిన పరిస్థితులపై అవగాహన చేసుకున్నాడు. తక్కువ రేటులో లభ్యమయ్యే ఓయో రూమ్‌లను ప్రారంభించి విజయవంతమయ్యాడు. 

మేనేజ్‌మెంట్‌ కోర్సు కోసం క్యాట్‌ ప్రవేశపరీక్ష రాసిన బైజు రవీంద్రన్‌ ఎడ్యుకేషన్‌కి టెక్నాలజీ జోడించడం ద్వారా ఈ రంగంలోని అవకాశాలపై పట్టు సాధించవచ్చునని గుర్తించి బైజుస్‌ కంపెనీ స్థాపించి విజయం సాధించారు. 

ఏం చేయాలి?

సమాచార సేకరణ: పరిస్థితులపై నియంత్రణ సాధించాలంటే తొలి మెట్టు సమాచార సేకరణ. ఎదుర్కొనబోయే ఎంపిక పరీక్ష ఇంటర్వ్యూ, చేయబోయే పని, ఎదురుకాగల సంకట స్థితులపై సాధ్యమైనంత విషయ సేకరణ చేయాలి. వీలైతే ఇప్పటికే వాటిని ఎదుర్కొన్నవారి అనుభవాలు తెలుసుకోవాలి.

భాగస్వామి కాకూడదు: తటస్థపడే సంఘటనలు, పరిస్థితులలో భౌతికంగా భాగస్వామి అయినా మానసికంగా...కాస్త దూరంగా వుండే ప్రయత్నం చేయాలి. దీనివల్ల పరిస్థితుల్లో ఒక భాగంగా ఒత్తిడి పొందకుండా, దానికి బాహ్యవలయం నుంచి పరికిస్తుంటే తగిన పరిష్కారాలు స్ఫురిస్తాయి.

తలపుల్లో గెలుపు: పరిస్థితుల్ని ఎదుర్కోవడం కంటే...ముందుగా ఆ సన్నివేశాన్ని మదిలో... హృది గదిలో సాక్షాత్కరింపజేసుకోవాలి. ఇదే ‘విజువలైజేషన్‌ టెక్నిక్‌’! తొలిగా తలపుల్లో గెలుపును ఊహిస్తే...అది వాస్తవమూ అవుతుంది

చిన్నచిన్న భాగాలుగా: ఎంత పెద్ద సమస్య అయినా చిన్నభాగమై పోయినప్పుడు చిన్నబోతుంది. అందుకే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోవాలి. అప్పుడు దానిపై అదుపు సాధించడం, పరిష్కరించటం సులువవుతుంది.

Posted Date: 15-02-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం