• facebook
  • whatsapp
  • telegram

నాయ‌కుడై నిల‌వాలంటే..!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

స్వయంకృషితో అలవర్చుకునే నైపుణ్యాల్లో నాయకత్వ సామర్థ్యం ముఖ్యమైనది. సాధనతో, అవగాహనతో ప్రయత్నిస్తే మీరూ లీడర్‌ కావచ్చు!

‘ఇవాళ్టితో మీ ట్రెయినింగ్‌ పూర్తయింది. రేపటినుంచి మీకు కేటాయించిన టీమ్స్‌లోకి వెళ్లిపోవచ్చు. మీరందరూ మీ ఇళ్లనుంచి రావడానికి వెహికిల్స్‌ ఏర్పాటు చేస్త్తాం. మీరంతా సిటీలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి రూట్స్‌ చేయడానికీ, టైమింగ్స్‌ నిర్ణయించడానికీ మీనుంచే మాకు నలుగురి సహాయం కావాలి. రాబోయే 15 రోజులపాటు వీరు గంట ముందు వచ్చి, గంట ఆలస్యంగా వెళ్లాలి. దీనికి ఎవరు ముందుకు వస్తారో చేతులు పైకి ఎత్తండి!’  

హెచ్‌ఆర్‌ జనరల్‌ మేనేజర్‌ మాటలకు అంతటా నిశ్శబ్దం. కొద్దిసేపటి తర్వాత చిన్నగా గుసగుసలు. ‘డ్యూటీ టైమ్‌ కంటే ఎక్కువే పనిచేయాల్సి ఉంటుంది, మనకెందుకులే!’ అని మాట్లాడుకోవడాన్ని హెచ్‌.ఆర్‌. సిబ్బంది గమనించారు.  

కొద్ది నిముషాల తర్వాత హాల్లో ఓ మూలనుంచి ఒకరు చేయి ఎత్తారు. తర్వాత మరో నలుగురు చేతులు ఎత్తారు. వారివైపు హెచ్‌.ఆర్‌. జీఎం అభినందన పూర్వకంగా చూడగా, మిగిలిన వారంతా ‘వేస్ట్‌ పనికి ముందుకు తోసుకెళుతున్నార’ని హేళనగా చూశారు. అయితే హెచ్‌.ఆర్‌. జీఎంకు తెలుసు, ఇలా ఇప్పుడు ముందుకొచ్చిన ఐదుగురే రెండు, మూడేళ్లలో వారివారి విభాగాల్లో అందరికంటే ముందు ప్రమోషన్లు పొందుతారని. ఎందుకంటే నాయకత్వానికి కావలసిన చొరవ, రిస్క్‌ తీసుకునే ధైర్యం, అందరికంటే అదనంగా సంస్థ కోసం పనిచేయాలన్న తపన.. ఈ ఐదుగురికే ఉన్నాయి.  

సమాయత్తపరిచే సామర్థ్యం

నిర్దేశించిన లక్ష్యాల దిశగా తాను చొరవ చూపుతూ, తనతో ఉండేవారిని సమాయత్తపరచగలిగే సామర్థ్యం ఉండటమే నాయకత్వం (లీడర్‌షిప్‌). మార్చును స్వాగతించడం, కొత్త గమ్యాల దిశగా తన బృందాన్ని ముందుకు నడిపి అసాధారణ ఫలితాలను రాబట్టడాన్ని లీడర్‌షిప్‌ నైపుణ్యంగా పరిగణిస్తారు.  

ఉద్యోగులు వేలల్లో ఉన్నా నాయకత్వ లక్షణాలున్న విలువైన సిబ్బంది కోసం కార్పొరేట్‌ సంస్థల యాజమాన్యాలు ఎదురుచూస్తుంటాయి. నాయకుడు తన చుట్టూ ఉన్నవారి ప్రవర్తనను ప్రభావితం చేయడంతోపాటు వారి అభిప్రాయాల్లో మార్పునకు కారణమవుతాడు.  

నాయకుడి లక్షణాలు  

చొరవ-చురుకుదనం: ఒక టీమ్‌లో అందరూ యధాలాపంగా కేవలం చెప్పినవరకు పనిచేస్తుంటే, నాయకుడు సదరు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటాడు. పనిలో అవరోధాలకు వెరవడు. కుంటి సాకులు చెప్పి పనికి విరామం ఇవ్వడు.  

తోటివారి సహకారం:  బృందంలో అందరూ ఎవరి పని వారు చేసుకుపోతుంటే- లీడర్‌ తన పనితోపాటు ఇతరుల పని తీరుతెన్నులను గమనిస్తుంటాడు. అవసరమైతే తానొక చేయివేసి వారి మన్నన పొందుతాడు. తద్వారా ఇష్టపూర్వకంగా వారి సహకారం లభిస్తుంది.  

జ్ఞానం-వనరులు: తన పనికి సంబంధించిన విజ్ఞానాన్ని మిగతావారి కంటే ఎక్కువగా సముపార్జించడం, తగినన్ని వనరులు సమీకరించుకోవడం నాయకత్వ లక్షణాలు. జ్ఞాన సముపార్జన వనరుల్లో నాయకుడు మిగతా వారికంటే ముందుంటాడు.  

ఈ బిజినెస్‌ లీడర్ల ఘనత   

బాబ్‌ ఐగర్‌: దృశ్య ఊహ వినోద జగత్తులో డిస్నీకి ఉన్న పేరు ప్రఖ్యాతులకు ఈ కార్పొరేషన్‌కు సారథ్యం వహించిన లీడర్లే కారణం. ప్రస్తుతం డిస్నీ కార్పొరేషన్‌కి బాబ్‌ ఐగర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌. మంచి సామర్ధ్యం గల కంపెనీలను పసిగట్టి వాటిని డిస్నీ గొడుగు కిందికి తీసుకొని రావడం ఐగర్‌ నాయకత్వంలోని బలం. ఇలా మార్వెల్, పిక్సర్, లూకాస్‌ ఫిల్మ్‌లను డిస్నీలో విలీనం చేయడం ద్వారా కార్పొరేషన్‌ను బలోపేతం చేశారు. 

రీడ్‌ హేస్టింగ్స్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో మార్మోగిన పేరు నెట్‌ఫ్లిక్స్‌. వైరస్‌ భయానికి ఇల్లు కదలని కోట్ల మందికి ఈ ఆన్‌లైన్‌ స్ట్ర్టీమింగ్‌ వినోదాల పంట పండించింది. నెట్‌ఫ్లిక్స్‌ సహ వ్యవస్థాపకుడు సీఈఓ రీడ్‌ హేస్టింగ్స్‌ నాయకత్వంలోని దార్శనికతే (విజన్‌) నెట్‌ఫ్లిక్స్‌ను అగ్రభాగాన నిలబెట్టింది.  

కిరణ్‌ మజుందార్‌ షా: తన కంపెనీ పేరు బయోకామ్‌నే భారతదేశంలో బయోటెక్నాలజీ రంగానికి పర్యాయపదంగా మార్చిన మహిళా పారిశ్రామికవేత్త ఈమె. మగవారికే సాధ్యంకాని రంగానికి నువ్వు వెళ్లడమేమిటన్న వెటకారాన్ని జయించి బిజినెస్‌ లీడర్‌గా మన్నన పొందుతున్నారు.

నాయకత్వ నైపుణ్యాల సాధనకు ఏం చేయాలి?  

ఆత్మ స్థైర్యం: నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఆత్మవిశ్వాసం. తానున్న పరిస్థితులపై ఆకళింపు, లక్ష్యాల గుర్తింపు, తీసుకునే నిర్ణయంతో గమ్యం చేరగలమన్న స్థైర్యం ఉంటేనే రాణించగలుగుతారు.  

నిర్ణయ సామర్థ్యం: నాయకత్వ స్థాయికి ఎదగాలంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోగలగాలి. రాబోయే పర్యవసానాలకు భయపడి నిర్ణయాలు వాయిదా వేస్తే ఎప్పటికీ నాయకులు కాలేరు.   

నిలకడ మనస్తత్వం: ఏ ఎండకా గొడుగు పట్టే పరాధీనత ఉంటే బృందంలోని సభ్యులకు నమ్మకం పోతుంది. అందుకే లీడర్‌కు స్థిర మనస్తత్వం, ఆటుపోట్లను తట్టుకునే సత్తా ఉండాలి.  

జ్ఞాన తృష్ణ-అభ్యసన: తానున్న రంగంతోపాటు సంబంధిత రంగాల ఆనుపానులు సమగ్రంగా తెలిసి ఉండటం కారణంగా బృందంలోని వారంతా లీడర్‌ని సమాచారం కోసం సంప్రదిస్తుంటారు. తనవద్ద వున్న జ్ఞానాన్ని అనుచరులతో పంచుకోవడం ద్వారా నాయకుడు వారికి దగ్గరవుతాడు. 

నిజాయతీ: విశ్వసనీయతే నాయకత్వానికి గీటురాయి. ఆలోచనల్లో, మాటల్లో, నడవడిలో నిజాయతీ చూపడం మంచి నాయకుడి లక్షణం. అటువంటివారినే సభ్యులు నమ్ముతారు; కలిసి నడుస్తారు.


 

Posted Date: 26-04-2021


 

నాయకత్వ సామర్థ్యం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం