• facebook
  • whatsapp
  • telegram

కోపాల్‌ తాపాల్‌.. కష్టాల్‌ నష్టాల్‌! 

యాంగ‌ర్ మేనేజ్‌మెంట్‌పై అవ‌గాహ‌న అవ‌స‌రం

ఆవేశం ఒక మానసిక స్థితి. బాహ్య పరిస్థితులు లేదా ఇతరుల పట్ల ఉత్పన్నమయ్యే మానసిక స్పందన. సాధారణంగా ప్రతికూల స్పందన అవాంఛనీయ పరిస్థితులను ఏర్పరుస్తుంది. ఈ లక్షణం కెరియర్‌కీ అవరోధంగా నిలుస్తుంది.  పరస్పర సంబంధాలను తుంచివేసే ఈ దుర్లక్షణాన్ని నియంత్రించుకోవడం (యాంగర్‌ మేనేజ్‌మెంట్‌) ఒక జీవన నైపుణ్యంగా గుర్తింపు పొందింది! 

ఒక కార్పొరేట్‌ కంపెనీ నిర్వహిస్తున్న నియామక ప్రక్రియలో బృందచర్చ రెండు గ్రూపులుగా సాగుతోంది. ‘సోషల్‌ మీడియా యువతకు హితమా? హానికరమా?’ అనేది అంశం. వాదిస్తున్న ప్రశాంత్‌కి కొద్దిసేపటిలోనే తెలియని ఆవేశం వచ్చేసింది. సోషల్‌ మీడియా చేస్తున్న మేలుని ఎదుటివర్గం వారు అంగీకరించడం లేదన్న ఆగ్రహం కట్టలు తెగింది. బృంద చర్చలో భాగంగానే వారలా వాదిస్తున్నారన్న స్పృహ కోల్పోయాడు. కోపంతో అతని ముఖం ఎర్రబడింది. రక్త ప్రసరణ పెరిగింది. అంతే...నియంత్రణ కోల్పోయి వ్యక్తిగత దూషణలకు దిగాడు. 

దీన్ని గుర్తించిన హెచ్‌.ఆర్‌. అధికారులు అతడిని అనర్హుడిగా నిర్ణయించి బయటకు పంపేశారు.తన వాదనతో ఎదుటివారిని తార్కికంగా ఒప్పించలేక, ఆగ్రహం ప్రదర్శించిన ప్రశాంత్‌ తమ కంపెనీకి ఎంతమాత్రం పనికిరాడనీ, ఎంపిక చేస్తే భవిష్యత్తులో తమకు తలనొప్పులు తెచ్చిపెడతాడనీ, అతడికి ఆవేశకావేషాల నియంత్రణ సామర్థ్యం లేదనీ వారు నిర్ణయించారు. 

అనర్థాలేంటి? 

కోపాన్ని నియంత్రించుకోకపోతే ప్రశాంత్‌ లాగా తొలిమెట్టులోనే ఉద్యోగావకాశాన్ని కోల్పోవచ్చు. కెరియర్‌లో ప్రవేశించాక ప్రతి దశలోనూ ఆవేశం అవకాశాలను దెబ్బతీస్తుంది. 

అసంకల్పిత ప్రవర్తన: కోపం కారణంగా మెదడు మొద్దుబారి విపరీత ప్రవర్తనకు దారితీస్తుంది. చుట్టుపక్కలవారిని తూలనాడే స్థితికి చేరుకుంటే పరస్పర సంబంధాలు (ఇంటర్‌ పర్సనల్‌ రిలేషన్స్‌) దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుంది. కెరియర్‌లో ఎదగాలంటే సహోద్యోగులతో సత్సంబంధాలు అనివార్యం. 

తొందరపాటు నిర్ణయాలు: ఆవేశం ఆలోచనపై ప్రభావం చూపుతుంది. నిలువెల్లా ఆవేశం ఆవహించినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. విచక్షణ లోపిస్తుంది. ఈవిధమైన నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో విపరీత పరిణామాలను ఎదుర్కొనవలసివస్తుంది.  

అవకాశాలు దూరం: ఆవేశకావేషాలతో వ్యవహరించేవారిని యాజమాన్యాలు విశ్వసించవు. వీరికి కీలక బాధ్యతలు అప్పజెప్పేందుకు వెనకాడతాయి. కంపెనీల్లో అంతర్గతంగా, బాహ్యంగా బాధ్యతలు ఇచ్చేందుకు సుముఖత చూపవు.  

వీరికి కలిసొచ్చింది..

సానుకూల దృక్పథం గలవారు తమ ఆగ్రహాన్ని సానుకూలంగా వినియోగించుకుని గొప్ప విజయాలు సాధించగలిగారు.   

‣ మహాత్మాగాంధీ: యువకుడిగా ఉన్నప్పుడు గాంధీజీకి వచ్చిన ఆగ్రహాన్ని సానుకూలపరచుకున్నందువల్ల అది దేశ స్వాతంత్య్ర సముపార్జనకు దారితీసింది. వర్ణవివక్షతతో దక్షిణాఫ్రికాలో రైలుపెట్టెనుంచి బయటకు తోసేయడంతో కలిగిన ఆగ్రహం, ఆత్మాభిమానం కాలక్రమేణా జాతీయోద్యమానికి సారథ్యం వహించేలా చేసింది.  

సుధామూర్తి: ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ సుధామూర్తి ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసే సమయానికి టాటా గ్రూపులోకి మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ గ్రూపు ఛైర్మన్‌ జె.ఆర్‌.డి. టాటాకు ఘాటుగా లేఖ రాశారు. ఆయన పిలిపించి ఉద్యోగం ఇవ్వడం, ఆపై నారాయణమూర్తి అర్థాంగిగా ఇన్ఫోసిస్‌ తొలి స్థాపకుల్లో నిలవడం సుధామూర్తి సాధించిన విజయం.  

అదుపు ఎలా?

వాస్తవాన్ని అంగీకరించడం: కొన్ని విషయాలు మన పరిధిలో ఉండవు. వాటిని సరిదిద్దే అవకాశం మనకుండదు. ఉదాహరణకు శారీరకమైన రంగు, ఎత్తు, రూపం వంటివాటిని మనం మార్చుకోలేం. కానీ వాటిని తలచుకొని అసౌకర్యంగా భావించడం వల్ల అసంతృప్తి తప్ప ప్రయోజనం లేదు. అందుకే పరిమితులను యథాతథంగా అంగీకరిస్తే అశాంతి ఉండదు.

సహనాన్ని సాధన చేయాలి: బుర్రలోకి ఏ ఆలోచన వస్తే దాన్ని తక్షణం అమలు చేయడం వల్ల ఎన్నో అనర్థాలొస్తాయి. ఏ ఆలోచననైనా అమలు చేసేముందు కాస్త స్థిమితంగా తర్కించి చూడటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని అనవసర ఆలోచనలు ఆదిలోనే రాలిపోతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది.

నోరు అదుపులో: కారణం ఏదైనా కోపం పట్టలేనప్పుడు నోరు అదుపు తప్పుతుంది. నోటికొచ్చిన మాటలు బయటకొస్తాయి. దీనివల్ల చుట్టూ ఉన్నవారు మనస్తాపానికి గురవుతారు. అందుకే ప్రతి విషయంలోనూ హేతుబద్ధంగా ఆలోచించడాన్ని సాధన చేయాలి.

రిలాక్సేషన్‌ హాబీలు: చాలా సందర్భాల్లో ఒత్తిడి అసహనం కలిగిస్తుంది. అసహనం వల్ల కోపం బయటకు వస్తుంది. అందుకే ఈ ఒత్తిడిని దూరం చేసుకునేందుకు ఇష్టమైన హాబీలు, పుస్తక పఠనం, సంగీతం వినడం, మంచి మిత్రులతో చాటింగ్, అయినవారి మధ్య గడపడం వంటివి చేయాలి. ఇవి ఒత్తిడినుంచి బయటపడేస్తాయి.

హాస్య చతురత: ఎంతటి గంభీర సంభాషణ, వివాదాస్పద చర్చ అయినా తేలికపరచే మందు హాస్యం. హాస్య స్ఫోరకంగా మాట్లాడటం, హాస్య చతురత పెంపొందించుకోవడం వల్ల క్లిష్టమైన సంవాదాలనుంచి ఇట్టే బయటపడవచ్చు. ఎవరినీ నొప్పించని హాస్య చతురత కోపతాపాలను నివారిస్తుంది. 


 

Posted Date: 17-05-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం