• facebook
  • whatsapp
  • telegram

తొలిముద్ర‌కు కొన్ని మెల‌కువ‌లు

 కొత్త వ్యక్తులను చూసిన తొలి నాలుగు నిమిషాల్లోనే వారిపై సానుకూలంగానో, ప్రతి కూలంగానో ఒక ముద్ర పడిపోతుంది. ఈ ఫస్ట్‌  ఇంప్రెషన్‌ ఎదుటివారికి అవ్యక్తంగా (నాన్‌వెర్బల్‌) ప్రదర్శితమవుతూ వారిని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావంతోనే వారి మధ్య మిగతా సమయమంతా నడుస్తుందని అధ్యయనాల్లో వెల్లడైంది. తొలి ముద్ర (ఫస్ట్‌ ఇంప్రెషన్‌)తో అపరిచితులనుంచీ సానుకూల స్పందన వచ్చి స్వీయ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కుతుంది. అందువల్లనే అందరూ పెంపొందించుకోవాల్సిన జీవన నైపుణ్యంగా ఇది విరాజిల్లుతోంది!   

‘అదిరిపోయే పర్సంటైల్‌.. ఆర్టిఫిషి‡యల్‌ ఇంటలిజెన్స్‌ ప్రాజెక్టు వర్క్‌... కెరియర్‌కు ఉపకరించే హాబీలు..ఇన్ని ఉన్నా ప్లేస్‌మెంట్స్‌లో నేనెందుకు సెలక్ట్‌ కావడం లేదో అర్ధం కావడంలేదు’- నగేష్‌ తన సీనియర్‌ అరవింద్‌తో బాధగా చెప్పాడు. గూగుల్‌లో మంచి పొజిషన్‌లో ఉన్న అరవింద్‌  కొద్ది నిముషాలు ఆలోచించి, ‘నువ్వు ప్లేస్‌మెంట్‌ ఇంటర్వ్యూలకు కొవిడ్‌ ముందువరకూ ప్రత్యక్షంగా హాజరయ్యావు కదా- ఎలా వెళ్లేవాడివి? ఐమీన్‌...నీ డ్రెస్‌... ఇంటర్వ్యూకి తయారయ్యే విధానం?’ అనడిగాడు. 

నగేష్‌ ఆశ్చర్యంతో అరవింద్‌వైపు చూసి  ‘ఎలాగేముంది? నేనిప్పుడెలా ఉన్నానో అలాగే..’ అన్నాడు. అరవింద్‌ అతడిని తేరిపార చూశాడు. చిందరవందరగా ఉన్న జుట్టు, చిట్లిస్తున్న ముఖం, నలిగిన దుస్తులు, కాళ్లకు పాత చెప్పులు, కూర్చున్నా కాస్త వంగి కనిపిస్తున్నాడు. ‘లోపం ఎక్కడుందో...అర్థమైంది నగేష్‌.  ‘ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ద బెస్ట్‌ ఇంప్రెషన్‌’ అన్నారు. వేషధారణ, బాడీ లాంగ్వేజ్‌ నీ విజయావకాశాలను దెబ్బతీస్తున్నాయి. వీటిని నువ్వు సరిచేసుకోవాలి’ అని సలహా ఇచ్చాడు.  

ఏ అంశాల ఆధారంగా?   

తొలి ముద్రను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి?

వస్త్రధారణ: కేశ సంస్కారం, దుస్తులు, పాదరక్షలపైకి ఎదుటివారి తొలిచూపు పడుతుంది. అంటే ఖరీదైన దుస్తులు, పాదరక్షలు ధరించాలని అర్ధం కాదు. ఉన్నవాటిల్లో మంచివి వేసుకోవడం వల్ల నిర్లక్ష్యంగా ఉన్నామన్న దురభిప్రాయం ఏర్పడదు.  

ముఖ కవళికలు-శరీర భాష: దుస్తుల తర్వాత ఎదుటివారి దృష్టిపడేది ముఖ కవళికలపై. డ]స్సిపోయిన భావన, ఆందోళన వ్యక్తమయ్యే వదనాలను చూస్తే ఎదుటివారికే నిరుత్సాహం అనిపిస్తుంది. దానికితోడు వంగిన భుజాలు, ఆత్మవిశ్వాసం లోపించిన నడక కొత్తవారిలో వ్యతిరేక అభిప్రాయాన్ని కలిగిస్తాయి.  

సంభాషణా ఉత్సుకత: మనల్ని చూడగానే సంభాషించాలనే ఉత్సాహం ఎదుటివారిలో కలగాలి. కానీ ఎదుటివారితో ఐ-కాంటాక్ట్‌ చేయకుండా నేల చూపులు చూడటం, నిరాశాపూరిత దృక్కులు ఫస్ట్‌ ఇంప్రెషన్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి  

వీటిపై అవగాహన  అవసరం 

సానుకూలమైన తొలి ముద్ర వేయాలంటే.. 

ముఖ్యోద్దేశం: మనం ఎవరిని కలువబోతున్నాం? అన్నదానిపై ఆధారపడి ఆహార్యం ఉండాలి. ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరు కావడం, బిజినెస్‌ ఆర్డర్‌ కోసం కలవడం వంటి కలయికల వెనుక ఉద్దేశాలను బట్టి వేషధారణ ఉండాలి.  

అనంతరం: తొలిముద్ర పడిన తర్వాత దాని అవసరం ఎంత ఎంతకాలం అనేదానిపై కూడా ఆధారపడి సన్నద్ధత ఉండాలి. ఉదాహరణకు ఉద్యోగాన్వేషణ కోసమైతే తొలిముద్ర ఫలితం జీవితకాలం, అదే ఒకసారితో ముగిసే పరిచయమైతే స్వల్పకాల ఫలితం.  

ఎదుటివారి దృష్టి: మనం కలవాలనుకుంటున్నవారి దృష్టి ఏమిటి? వారు మన నుంచి ఏవిధమైన ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు? మనలో ఎలాంటి వ్యక్తిని చూడాలనుకుంటున్నారో అంచనా వేసుకోవడం ఉత్తమం. వేషభాషలు, ముఖ కవళికలను ఆ పంథాలో మార్చుకోవాల్సివుంటుంది.  

ఎదుటి పక్షం: మనం కలిసే వ్యక్తుల వయసు, వారి సంప్రదాయాలపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరం. ఎం.ఎన్‌.సి.లో యూరోపియన్‌ బాస్‌కు రిపోర్ట్‌ చేసేందుకు వెళ్లేటప్పుడు ఆహార్యం, పలకరింపు, శరీర భాషలను తగ్గట్టుగా మార్చుకోవడంలో తప్పులేదు. కాబోయే బాస్‌కు ఏర్పడే ఇంప్రెషన్‌ సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి.
 

Posted Date: 24-05-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం