• facebook
  • whatsapp
  • telegram

ఒదిగిపోతే.. ఎదుగుదల!  

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

‘సిచ్యుయేషన్‌ని బట్టి సింక్‌ అయిపోవాలి’-  ఈ మధ్య తరచూ వినిపిస్తున్న మాట! చాలా కంపెనీలు ఉద్యోగ ప్రకటనల్లో ‘క్యాండిడేట్‌ షుడ్‌ హ్యావ్‌ అడాప్టబిలిటీ స్కిల్‌ ఇన్‌ ఎనీ వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అని పేర్కొనడం చూస్తున్నాం. ఈ రెండింటికీ ఉన్న సంబంధమేమిటి? సిచ్యుయేషన్‌ను బట్టి సింక్‌ అయిపోవాలన్నా, వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అడాప్టబిలిటీ ఉండాలన్నా ఒక్కటే. సర్దుకుపోవడం. ఇదో కీలకమైన జీవన నైపుణ్యం! 

కంపెనీల్లో పనివాతావరణం (వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌)లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. 2020 ఏప్రిల్‌- మే నెలల్లో కొవిడ్‌ విపత్కర పరిస్థితుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హఠాత్తుగా లాక్‌డౌన్‌ విధించడం, కంపెనీలు అప్పటికప్పుడు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ విధానానికి మారడమే ఇందుకు ఉదాహరణ. అప్పటివరకు మహానగరాల్లో భారీ టవర్స్‌లో వేలాది ఉద్యోగుల మధ్య, అన్ని వనరులతో పనిచేయడం నుంచి స్వస్థలంలో అంతంతమాత్రం సౌకర్యాలతో ఓ గదిలో ఒక్కరే కూర్చొని పనిచేయాలి. నిర్దేశించిన ఫలితాలు చూపించగలగాలి. ఇటువంటి కొత్త పరిస్థితులకు అనుగుణంగా చకచకా అన్నీ చక్కదిద్దుకొని నూతన పనివాతావరణంలో ఒద్దికగా ఒదిగిపోయినవారున్నారు. ఇప్పటికీ సతమతమవుతూ వర్చువల్‌ పని విధానంలో ఇమడలేకపోతున్నవారూ ఉన్నారు.

ఏమిటీ నైపుణ్యం?

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ ఆలోచనా సరళిని వ్యవహార విధానాన్ని మార్చుకోగలిగే నేర్పరితనాన్నే అడాప్ట్టబిలిటీ అంటారు. ఈ ప్రపంచంలో ఏదీ స్థిరం కాదు. స్థిరంగా జరిగేదల్లా మార్పు అన్నారు. ఏ జీవన రంగమైనా చైతన్యశీలంగా మార్పులకు గురవుతుంటుంది. కాబట్టి ఇందుకు అనుగుణంగా తనను తాను మలుచుకునే (అడాప్టబిలిటీ) నేర్పును ఒక జీవన నైపుణ్యంగా, కెరియర్‌ ఉన్నతికి సోపానంగా వర్ధిల్లుతోంది.

మార్పులకు అనుగుణంగా తనను తాను మలుచుకునే (అడాప్టబిలిటీ) నేర్పు ఎవరికైనా తప్పనిసరి. ఇదో విలువైన జీవన నైపుణ్యం! 

ఇవీ మార్గాలు

ఉద్యోగంలో, వృత్తిలో, వ్యాపారంలో, జీవనపథంలో పరిస్థితులకు అనుగుణంగా కలిసిపోవడం ముఖ్య జీవన నైపుణ్యం. ఇదేమీ పుట్టుకతో రాదు. నేర్చుకోలేనంత దుర్లభమూ కాదు. ఇందుకు కొన్ని మార్గాలున్నాయి.

మార్చును స్వీకరించడం: ఒక ఉద్యోగం చేస్తుంటే యాజమాన్యాలు తరచూ మార్పులు తీసుకువస్తుండవచ్చు. పని విధానం, పని సంస్కృతిలో మార్పులు సంభవించవచ్చు. వీటిని విమర్శించకుండా సానుకూలంగా స్వీకరించాలి. స్పందించాలి. అందుకు అనుగుణంగా ఆలోచనా సరళిని, అవసరమైతే జీవనసరళిని మార్చుకోవాలి. ఉదాహరణకు జనరల్‌ షిఫ్ట్‌ ఉన్న కార్యాలయంలో హఠాత్తుగా కంపెనీకి అవసరమయ్యే షిఫ్ట్‌ విధానాన్ని ప్రవేశపెడితే, అందుకు తగ్గట్టు జీవన శైలిని మార్చుకోవాల్సివుంటుంది.

సర్దుకుపోవడం కాదు, సదవకాశం: పరిస్థితులు, పరిసరాలకు అనుగుణంగా మనల్ని మనం మలచుకోవడమంటే అది రాజీపడటం కాదు. ఎంచుకున్న రంగంలో రాణించేందుకు ఎర్ర తివాచీ ఏర్పరచుకోవడమే. దీనివల్ల కొత్త అవకాశాలకు ఆహ్వానం పలుకవచ్చు. సరికొత్త విజయాలకు ఆస్కారం ఏర్పడవచ్చు.
పరిస్థితులకు తగ్గ ప్రణాళికలు: పరిస్థితులు మారినప్పుడు అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ఆ దిశగా సాధన చేయాలి. కొవిడ్‌కు ముందువరకు క్యాంపస్‌ నియామకాలు ప్రత్యక్షంగా జరుగుతుండగా ప్రస్తుతం అన్ని దశలను వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. ఉద్యోగాన్ని ఆశించేవారు, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఇంటివద్దనే సన్నాహాలు చేసుకొని ఎంపికలకు సిద్ధం కావడమే అడాప్టబిలిటీ.

నిరంతర జ్ఞానార్జన: ఏ పరిస్థితులనైనా ఆహ్వానించలేకపోవడానికి ఒక ప్రధాన కారణం- కొత్తది ఏదైనా నేర్చుకోవాలంటే ఉండే భయం. దీన్నుంచి బయటపడాలంటే నిరంతరం నేర్చుకునే లక్షణాన్ని అలవర్చుకోవాలి. దీనివల్ల మార్పు అంటే భయం పోయి ఆసక్తిగా మారుతుంది. కొత్త పరిస్థితుల్లో నెట్టుకు రాగలనన్న నమ్మకం ఏర్పడుతుంది!

ఈ నేర్చుతో ఉన్నతస్థాయికి...

పరిస్థితులకు అనుకూలంగా మారడం అనే సామర్థ్యాన్ని అలవరచుకుంటే అలవాటుగా మార్చుకుంటే అగోచరంగా వుండే అవకాశాలను అందరికంటే ముందు అందుకోవచ్చు.

చేతన్‌ మైనీ

పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోతే ప్రస్తుత కాలం కంటే ముందుకు ఆలోచించగలుగుతాం. బెంగుళూరులో పుట్టిన చేతన్‌ బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ చేశాడు. కార్ల ప్రపంచాన్ని ఆసక్త్తిగా గమనించి పర్యావరణ పరంగా ఎదురవుతున్న సవాళ్లను గమనించాడు. ప్రభుత్వాలు వాహన కాలుష్యాలకు కళ్లెం వేసేందుకు తీసుకువస్తున్న చట్టాలను చూశాడు. పరిస్థితుల్లో ఒదిగిపోయి బాగా అర్ధం చేసుకున్న తర్వాత చేతన్‌కు అంతకుమించి ఆలోచించే శక్తి వచ్చింది. అదే కాలుష్య రహితంగా ఎలక్ట్రిక్‌ కారు తయారుచేయడం. ఈ ప్రయత్నంలో విజయం సాధించి దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ ‘రేవ్‌’ను స్థాపించాడు. ఎలక్ట్రిక్‌ కార్ల సాంకేతిక పరిజ్ఞానంలో అందెవేసిన చేయి అయిన ఇతడి సహకారాన్ని ప్రపంచ ప్రసిద్ధ జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తీసుకుంటోంది. రేవ్‌ ప్రస్తుతం మహేంద్ర గ్రూప్‌లో చేరినా చేతన్‌ పేరు చెక్కుచెదరలేదు.

రంజీవ్‌ రామ్‌చందాని

ముంబయికి చెందిన రంజీవ్‌ రామ్‌చెందాని చదువులో నెట్టుకుంటూ వెళ్లి చివరికి మైక్రోబయాలజీలో పడ్డాడు. అది ఏమాత్రం అతనికి రుచించలేదు. ఎలాగోలా డిగ్రీ పూర్తిచేసి వ్యంగ్య చిత్రాలు వేయడంలో అభిరుచి వుండటంతో వ్యాపార ప్రకటనల రంగం వైపు ఆకర్షితుడయ్యాడు. సృజనాత్మకతకు పెద్దపీట వేయాల్సిన వ్యాపార ప్రకటనల నిర్మాణ రంగంలో కూడా పదవుల పందారం, ఆశ్రిత పక్షపాతం అతనికి నచ్చలేదు. అయితే అప్పటికే సృజనాత్మక రంగంలో ఇమిడిపోయిన రంజీవ్‌ స్వయంగా ‘తంత్ర’ కంపెనీని నెలకొల్పి కొత్త పోకడకు తెరతీశాడు. ప్లెయిన్‌ టీ-షర్టులపై చిత్రాతి చిత్రమైన ముద్రణలతో విడుదల చేసి సంచలనం సృష్టించాడు. నవ్య ధోరణికి ఆద్యుడయ్యాడు. 

చేతన్, రంజీవ్‌ల విజయగాధలు చెబుతున్నవి- ఇమిడిపోయే నైపుణ్యాన్నే. ఆసక్తి, అభిరుచి ఉన్న రంగాలపై ఆ రంగంలో పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోవడం.

Posted Date: 22-02-2021


 

అడాప్టబిలిటీ

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం