• facebook
  • whatsapp
  • telegram

వ్యక్తీకరణే శక్తి!

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

వ్యక్తుల మధ్య సమాచార వ్యాప్తి ఫలితంగా అవగాహన పెరుగుతుంది. ఆలోచనలూ, సందేశాలూ, సంభాషణలూ, సంజ్ఞలూ, ప్రవర్తనల బదలాయింపే కమ్యూనికేషన్‌. ఉద్యోగులు ఎవరి పని వారు చేసి మౌనంగా ‘ఎవరికి వారే యమునా తీరే’ చందాన వెళ్లిపోతే కంపెనీ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే కంపెనీలు బలమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థలను వివిధ అంచెల్లో ఏర్పరచుకుంటాయి. ఉద్యోగులు అందులో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తాయి!  

యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు కంపెనీ యాజమాన్యం ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమం సాగుతోంది. కమ్యూనికేషన్‌ (భావ వ్యక్తీకరణ) ప్రాధాన్యాన్ని అర్ధం చేసుకునేందుకు ట్రెయినర్‌ రెండు కేస్‌ స్టడీలను వివరించాడు.  

తనకు ఎంఎన్‌సీ ఐటీ కంపెనీలో జూనియర్‌ ప్రోగ్రామర్‌గా అవకాశం రాగానే- ఆ ఉద్యోగంలో ఏమేం చేయాల్సి ఉంటుందో వివరంగా తెలుసుకున్నాడు తపస్య. సీనియర్ల సలహాలు తీసుకుంటూ రోజూ పనిచేయాల్సి ఉంటుందనీ, అందులో తన తక్షణ బాస్‌తో ప్రత్యక్షంగా, ఆపై బాస్‌తో పరోక్షంగా సంబంధాలు నెరపాల్సి ఉంటుందని గుర్తించాడు. అలాగే మిగతా బృందంతో కలిసి ఒక ప్రాజెక్టులో పనిచేస్తున్నప్పుడు వృత్తిరీత్యా క్లయింట్లతో మాట్లాడి వివరాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటికీ తగ్గట్టుగా ఆరు నెలల్లో తనను తాను మలచుకున్నాడు. అందుకే సంవత్సరానికే మేనేజ్‌మెంటు గుర్తించి అవార్డును ఇచ్చింది. శాలరీ ప్యాకేజీని ఉన్నతీకరించింది.  

తీర్థ కూడా తపస్యలాగే ఉద్యోగంలో చేరాడు. అయితే మేనేజ్‌మెంట్‌ ఆశిస్తున్న పనులను జీర్ణించుకోలేకపోయాడు. ‘జూనియర్‌ స్థాయిలో ఇన్ని బరువు బాధ్యతలా?’ అని అతడి మనసు మొరాయించింది. దీనితో తక్షణ బాస్‌కి మాత్రమే బాధ్యత వహించేవాడు. క్లయింట్లను కలవడం తనకి ఇష్టం ఉండదనీ- ప్రస్తుతం ఉన్న వర్క్‌తో వదిలేయమనీ మేనేజ్‌మెంట్‌కు చెప్పేవాడు. ఆపై సీనియర్లు ఎవరూ పని విషయంలో అతని జోలికి పోలేదు. 

ఇదంతా చెప్పిన ట్రెయినర్‌- బాసులతో, క్లయింట్లతో తపస్య వివిధ రూపాల్లో (మెయిల్స్, పి.పి.టి. లాంటివి) మెరుగుపరచుకున్న కమ్యూనికేషన్‌ అతడికి అక్కరకు వచ్చిందని చెప్పాడు.  

పేరు తెచ్చుకున్న వీరు  

కొవిడ్‌ వ్యాప్తి కారణంగా ప్రజాబాహుళ్యాన్ని కలవలేని పరిస్థితుల్లో కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఆచరణాత్మక భావ వ్యక్తీకరణతో పేరు తెచ్చుకున్నవారు -  

ఆనంద్‌ మహేంద్ర: మహేంద్ర కార్పొరేట్‌ గ్రూప్‌ అధినేత. కరోనా ప్రారంభంలో లాక్‌డౌన్‌ సమయంలో వార్తాపత్రికలు వేస్తున్న పేపర్‌బాయ్‌కి ట్విట్టర్‌ ద్వారా శాల్యూట్‌ చేయడం నుంచి నిన్నమొన్నటి సంఘటన తమిళనాడు కోయంబత్తూరు రూపాయికి ఇడ్లీ అమ్మే బామ్మగారి వ్యాపారంలో సామాజిక హితంతో పెట్టుబడి పెట్టడం వరకు ఆనంద్‌ మహేంద్ర కమ్యూనికేషన్, ఆచరణ దేశ ప్రజలను కట్టిపడేశాయి.   

సోనూసూద్‌: కరోనా విపరిణామాల వేళ నిస్సహాయులకు ఆప్తమిత్రులుగా నిలిచారు. మాటలతో మంత్రం వేయాలనుకోలేదు. చేతలతో ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో ఆయన ప్రకటనలు, వ్యాఖ్యానాల కంటే తన దృష్టికి తీసుకువచ్చినవారికి చేయూతనివ్వడమే సోనూసూద్‌ చేసిన పని. ఇదే భావ వ్యక్తీకరణగా నిలిచి ఆయన్ను ఇంటింటికీ అన్నగా నిలిపింది.  

ఎందుకింత ప్రాధాన్యం?  

భావ ప్రసారం మనిషికి ప్రాణవాయువు లాంటిది. ఏదో ఒక దశలో ఆగిపోయేది కాదు. జీవిత పర్యంతం కొనసాగుతూనే ఉంటుంది. మాట్లాడటమొక్కటే కాదు. శ్రద్ధగా వినడమూ భావ వ్యక్తీకరణలో భాగమే. 45 శాతం వినడం, 30 శాతం మాట్లాడటం, 16 శాతం చదవడం, 9 శాతం రాయడం- ఈ నాలుగూ ఆయా పాళ్లలో కలిస్తేనే నిజమైన కమ్యూనికేషన్‌గా భాసిల్లేది. వీటిలో వినడానికీ¨, మాట్లాడటానికీ ఉన్న ప్రాముఖ్యం గుర్తించవచ్చు. మనిషి నిమిషానికి గరిష్ఠంగా 150 పదాలు మాట్లాడగలిగితే, నిమిషానికి 450 పదాలు వినగలడు. ఈ శక్తిని శక్తిమంతంగా వినియోగించుకునేవారే కమ్యూనికేషన్‌లో పటిష్ఠమవుతారు. 

మాటకారులు ఎన్నో రకాలు

మాటల ద్వారా భావాలను వ్యక్తం చేయడంలో మనచుట్టూ తారసపడేవారిలో కొన్ని రకాలు-  

ముక్తసరి మాటకారులు: పలుకే బంగారం టైపు. మీరెంత మాట్లాడినా ఎంత సుదీర్ఘంగా మీ ప్రశ్న ఉన్నా వీరి జవాబులు క్లుప్తంగా ఒకటి-రెండు పదాల్లో ఉంటాయి. 

అంతా తామై: సంభాషణ ప్రారంభమైన తర్వాత మరొకరికి చోటివ్వరు. అంతా తామై నడిపించాలనుకుంటారు. మొత్తం పరిస్థితిని తమకు అనుకూలంగా మరల్చుకొని, తమ నియంత్రణలోకి తీసుకుంటారు. ఒకవేళ మరొకరెవరైనా కాస్త దూకుడు ప్రదర్శించినా సహించరు.  

అధిక ప్రసంగం: మరొకరికి మాట్లాడే అవకాశం ఇవ్వరు. అవసరమైన దానికంటే ఎక్కువ మాట్లాడతారు. ఎదుటివారికి మాట్లాడనివ్వాలన్న స్పృహ వీరికుండదు. ఒకటికి...రెండు మాట్లాడతారు.  

కత్తిదూసే టైపు: వీరి మాట తీరే వేరు. మాటిమాటికీ కసురుకుంటారు. ఎదుటివారిపై విమర్శల కత్తులు దూస్తుంటారు. ఆ ధాటికి జడిసి ఎదుటి వ్యక్తి నోటమాట పెగలదు.  

నొసటితో నెక్కిరిస్తూ: ఇదొక విధమైన వ్యక్తీకరణ. సంభాషణలో సరళంగా మాట్లాడుతున్నట్లుంటారు. మనల్ని సహాయం అడుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అంతలోనే ‘సహాయం చేయగల సత్తా మీకెక్కడుంది?’ అంటూ హేళన చేస్తారు. నోటితో సాయం అడుగుతారు. నొసటితో వెక్కిరిస్తారు. వీరితో మాట్లాడటమే పెద్ద గందరగోళం. 

మాటకారులు ఎన్ని రకాలైనా అత్యంత చాకచక్యంగా, చతురతతో కావలసినవిధంగా సంభాషణ నడిపి కావలసినది సాధించడమే  మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యం.


 

Posted Date: 31-05-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం