• facebook
  • whatsapp
  • telegram

మూసను వదులు.. కొత్తగా కదులు! 

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

సాంకేతిక పరిజ్ఞానం... సృజనాత్మకత- ఈ రెండింటిలో ఏది ముందంటే.. సృజనాత్మకతకే పెద్దపీట! ఎందుకంటే నూతన సృష్టి ఏదైనా సృజనాత్మక ఆలోచనలనుంచే కదా జనించేది. అందుకే సృజనాత్మక ఆలోచనా ధోరణి (క్రియేటివ్‌ థింకింగ్‌) జీవన నైపుణ్యాల్లో ఒకటిగా అలరారుతోంది!  

సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానం...రెండూ కలిసి ఒకప్పుడు మిథ్యా ప్రపంచం అనుకున్నవాటిని సాధ్యంచేసి చూపిస్తున్నాయి. గడప దాటి కాలు బయటపెట్టాల్సిన అవసరం లేకుండానే సమస్త వస్తు ప్రపంచాన్నీ కళ్లెదుట ఉంచి, ఒక క్లిక్‌తో ఆర్డర్‌ చేస్తే ఇంటికి తెచ్చే ఈ-కామర్స్, వేల మైళ్లదూరంలో వున్నా ఎదురెదురుగా ఉన్నట్టు కబుర్లు చెప్పుకోగలిగేలా చేసే సోషల్‌ మీడియా, థియేటర్లకు వెళ్లి క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇంటిల్లిపాదీ సినీ వీక్షణం చేయగలిగే ఓటీటీ- ఇలా ఇంకెన్నో ఉదాహరణలు. టెక్నాలజీ, క్రియేటివిటీ కలగలిసి ఇవన్నీ మన ముందుకు వచ్చాయి!  

సమాజంలో ఒక అవసరం, ఒక సమస్య పట్ల భిన్నంగా ఆలోచించడం, అప్పటివరకు మరెవరూ యోచించని రీతిలో స్పందించి స్వీయ సామర్థ్యాలను వినియోగించి పరిష్కారానికి కృషి చేస్తే.. అది నూతన సృజనకు దారితీస్తుంది. ఇలా కొత్త పంథాలో అడుగులు వేయడమే సృజనాత్మక ఆలోచనా ధోరణి (క్రియేటివ్‌ థింకింగ్‌). మూసకు భిన్నమైన ఈ ఆలోచనా సరళిని ‘అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ థింకింగ్‌’ అనీ వ్యవహరిస్తారు. నేటి ఐటీ కంపెనీల్లో ఈ తరహా ఆలోచనా సామర్థ్యం ఉన్న యువతను గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. వివిధ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లలో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ఒకే ధోరణిలో చేసే ప్రయత్నాలవల్ల వ్యయ ప్రయాసలే తప్ప ఫలితం వుండదు. ఇలాంటి జటిల సందర్భాల్లో క్రియేటివిటీ చూపించే యువతీ యువకులే కంపెనీలకు విలువైన సంపద.  

సృజనాత్మకతే వీరి పెట్టుబడి

ఒకప్పుడు కండ గలవాడిదే రాజ్యం. కానీ ఇప్పుడు సృజనాత్మక ఆలోచనలే జగత్తును శాసిస్తున్నాయి. సృజనాత్మక ఆలోచనలే సంపదకు పునాది అవుతున్నాయి..  

స్విగ్గి: ఒకప్పుడు ఆకలేస్తే తినడానికి దగ్గరలో మంచి హోటల్‌ ఎక్కడుందో వెతకాల్సివచ్చేది. ఇప్పుడు క్షణాల్లో స్విగ్గి యాప్‌ తెరచి వందలాది హోటళ్ల నుంచి కావలసినవి ఎంపిక చేసుకొని ఇంటికే ఆర్దర్‌ ఇవ్వవచ్చు. బిట్స్‌పిలానీ (గ్రాడ్యుయేట్‌ శ్రీహర్న మాజేటి, నందన్‌ రెడ్డి 2014లో దేశంలో ఆహారపదార్థాలు ఆర్డర్‌ చేసే ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభించాలన్న సృజనాత్మక ఆలోచన ఫలితమే మరో స్నేహితుడు రాహుల్‌తో కలిసి ప్రారంభించిన స్విగ్గి. కోడింగ్, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కలను నిజం చేసుకున్న స్విగ్గి కంపెనీ ప్రస్తుత విలువ రూ. 25వేల కోట్లు. 

జూమ్‌కార్‌: ప్రజారవాణా లేదా క్యాబ్స్‌లో వెళ్లడం ఇష్టం లేదు. సొంత వాహనమూ లేదు. ఇలాంటివారికి నగరాల్లో కార్ల సౌకర్యం కల్పించాలన్న సృజనాత్మక ఆలోచన రూపమే సెల్ప్‌ డ్రైవ్‌ రెంటల్‌ కార్‌ సర్వీస్‌... జూమ్‌కార్‌. ఈ ఆలోచనతో అమెరికానుంచి ఇండియాకు వచ్చేసి బెంగళూరులో 2013లో గ్రేగ్‌ మోరన్, డేవిడ్‌ బ్యాక్‌ అనే ఇద్దరు ప్రారంభించిన జూమ్‌ కార్‌కు ప్రస్తుతం 245 నగరాల్లో 15 వేల కార్లున్నాయి.  

జోస్టల్‌: హోటల్‌ సౌకర్యాలను హాస్టల్‌ రేట్లకే ఇవ్వాలన్న భిన్నమైన ఆలోచన నుంచి పుట్టిందే జోస్టల్‌. జో రూమ్స్‌ ఛైన్‌. కలకత్తా ఐఐఎం నుంచి మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసిన ధరమ్‌వీర్‌ చౌహాన్‌ సృజనాత్మక ఆలోచన ఇది. కేవలం రూ.500కే ఏసీ గదులు, మంచి సౌకర్యాలు కల్పిస్తూ జోస్టల్‌ యువతరాన్ని అమితంగా ఆకట్టుకుంటోంది. 

క్రమపద్ధతిలో సాధన

ఒక అవసరం... భిన్నంగా ఆలోచించాలన్న తపన కారణంగా మన ముందుకు వచ్చినవే స్విగ్గి, జూమ్‌కార్, జోస్టల్‌. క్రమపద్ధతిలో సాధన చేస్తే భవిష్యత్తులో సృజనశీరులుగా రాణించటం సాధ్యమే! .  

విశ్లేషించే అలవాటు: ఏ విషయాన్నయినా కేవలం సమాచారం తెలుసుకొని వదిలేయకుండా దాన్ని వివిధ కోణాల్లో విశ్లేషించడం అలవాటు చేసుకోవాలి. తెలిసిన విషయంతో పోల్చిచూడటం, మరింత సమాచారాన్ని వెతికి విశ్లేషించడం నిరంతరం చేస్తూవుండాలి. దీనివల్ల పట్టు ఏర్పడుతుంది.  

మేధా మధనం: విశ్లేషించడం ఒక్కరే కూర్చొని చేసినా, ముఖ్యమైన విషయాలపై ఆసక్తి ఉన్న నలుగురు కలిగి చర్చించాలి. మేధా మథనం (బ్రెయిన్‌ స్టార్మింగ్‌) చేయాలి. ఇందులో పాల్గొనేవారు ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఆసక్తిగల వారైతే మంచిది. అంటే ఒకరు గణాంకాలపై ఆసక్తి గలవారైతే మరొకరు భవిష్యత్తు పరిణామాలపై అంచనా వేయగలిగేవారు. గత డేటాపై అవగాహన గలవారు... ఇలా వేర్వేరు దృక్కోణాలున్నవారు బృందంలో ఉంటే ఈ మథనం ప్రయోజనకరంగా ఉంటుంది.  

మైండ్‌ మ్యాపింగ్‌: ఒక విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు మనోఫలకంపై దానికి సంబంధించిన వేర్వేరు అంశాలు నమోదు అవుతుంటాయి. అలా ఎంతమేరకు అవకాశముంటే అంతవరకు ఏర్పడేలా చూసుకోవాలి. సమయం వచ్చినప్పుడు వీటన్నింటినీ మెదడు అనుసంధానం చేసుకుంటుంది.  

అత్యుత్తమ పరిష్కార సామర్థ్యం: ఈ దశలన్నీ ఒక సమస్యపై లోతైన అవగాహనకు ఆస్కారం కల్పిస్తాయి. దీనిపై అసంకల్పితంగా మానసిక సాధన జరిపి అత్యుత్తమ పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల మేధాశక్తి సృజనాత్మకత వైపు ప్రయాణం సాగిస్తుంది. ఆపై సృజనాత్మక ఆలోచనా సామర్ధ్యం అలవడుతుంది.


 

Posted Date: 01-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం