• facebook
  • whatsapp
  • telegram

ఆల‌స్యం వ‌ద్దు... అల‌క్ష్యం అస‌లే వ‌ద్దు!

స‌రైన స‌మ‌యంలో స‌ముచిత‌ నిర్ణ‌యం మేలు

సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకోవడం వృత్తిలోనైనా, వ్యక్తిగత జీవితంలోనైనా ఎంతో ముఖ్యం. ‘నిర్ణయ సామర్థ్యం’ అవసరం రాని సందర్భాలు నేటి పరిస్థితుల్లో అరుదు. ఈ జీవన నైపుణ్య ప్రాముఖ్యాన్నీ, దాన్ని పెంపొందించుకునే మార్గాలనూ తెలుసుకుందాం!

క్యాంపస్‌ సెలక్షన్స్‌లో వచ్చిన అవకాశాలను సుధీర్, క్రాంతి అందిపుచ్చుకున్నారు. సుధీర్‌ సొంత ఊరుకు దగ్గరని కంపెనీ చిన్నదైనా, వేతన ప్యాకేజీ అంత సంతృప్తికరం కాకపోయినా హైదరాబాద్‌లో చేరిపోయాడు. క్రాంతి కాస్త రిస్క్‌ చేశాడు. కంపెనీ మంచిదని ప్రస్తుత ప్యాకేజీ తక్కువైనా భవిష్యత్తు బాగుంటుందని దూరం పట్టించుకోకుండా పుణె కంపెనీలో చేరాడు.

ఐదేళ్ల తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. సుధీర్‌ చేరిన కంపెనీ బ్రాంచి హైదరాబాద్‌లో తీసివేయగా అదే వేతనానికి అతడు గుడ్‌గావ్‌ వెళ్లాల్సివచ్చింది. కానీ  చేరిన కంపెనీ విస్తరణలో భాగంగా క్రాంతికి రెండు ప్రమోషన్లు వచ్చాయి. పెరిగిన వేతన ప్యాకేజీతో హైదరాబాద్‌ ఆఫీసుకు బదిలీ అయ్యాడు. దీనితో నిర్ణయ సామర్థ్య (డెసిషన్‌ మేకింగ్‌) ప్రభావం సుధీర్‌కు తెలిసొచ్చింది.

కెరియర్‌లో, జీవితంలో వివిధ సమయాల్లో సాధారణ, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. వీటి ఫలితాలు ఎంత సానుకూలంగా ఉంటే అంతగా నిర్ణయ సామర్థ్యం వున్నట్టు పరిగణించాలి. ముఖ్యంగా ఉద్యోగ జీవితంలో వివిధ సమయాల్లో ఎన్నో నిర్ణయాలు కంపెనీ తరపున తీసుకోవాల్సి    ఉంటుంది. అందుకే కంపెనీలు నియామక సమయంలో అభ్యర్థి నిర్ణయ సామర్థ్యంపై దృష్టి పెడుతున్నాయి. ప్రాధాన్యం ఇస్తున్నాయి.

ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న వివిధ మార్గాలు, ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీసుకొని వాటిలో ఉత్తమమైనది ఎంచుకోవడమే నిర్ణయ సామర్థ్యం.

సాధారణంగా నిర్ణయ సామర్థ్యంలో చాలామంది వెనుకబడుతుంటారు. చాలా సందర్భాల్లో వారి నిర్ణయాలు విఫలమవుతుంటాయి. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

పలాయన ధోరణి: నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతూ తరచూ దాన్ని వాయిదా వేయడం. దీనివల్ల చివరికి నిర్ణయం తీసుకున్నా ఆశించిన ఫలితం రాదు.

నిర్లక్ష్యం: నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైనా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం, దానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం.

ఉద్రేకం: కోపంతో తీసుకునే నిర్ణయాలు సాధారణంగా ఎప్పుడూ ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి. ఉద్రేకంలో, ఉద్వేగంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తరచూ విఫలమవుతుంటాయి.

ఖ్యాతిని చేకూర్చిన నిర్ణయాలు

తమ జీవితాల్లో వివిధ క్లిష్ట సమయాల్లో తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇద్దరు వ్యక్తులు అపర కుబేరులుగా అవతరించారు ఖ్యాతి పొందారు. 

కిండర్‌ జాయ్‌ కోడిగుడ్డు ఆకారంలో ఉండే చాక్లెట్‌ అంటే పిల్లలకు ఇష్టం. అయితే ఈ క్రేజ్‌ కేవలం చాక్లెట్‌ కోసం కాదు. అందులో ఉండే గిప్ట్‌ బొమ్మలకోసం! దీన్ని సృష్టించిన కంపెనీని ప్రారంభించిన ఫెరెరో మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక ఇటలీలో పేస్ట్రీ దుకాణంతో జీవితాన్ని ఆరంభించి అది సరిగ్గా నడవక ఆఫ్రికా వెళ్లి బ్రెడ్లు అమ్మారు. అక్కడా ఇమడక ఇటలీ వచ్చి చాక్లెట్ల తయారీకి బీజం వేశారు. ఆ పరంపరే కొనసాగి 2001లో ఫెరెరో నెలకొల్పిన సంస్థ ఫెరెరో రోషే కిండర్‌ జాయ్‌ను తయారుచేసింది. కిండర్‌ జాయ్‌ ఉత్పత్తి కేంద్రాలు ఇప్పుడు 170 దేశాల్లో ఉన్నాయి. 

ఆనంద్‌ భవన్‌ స్వీట్స్‌ సృష్టికర్త కె.ఎస్‌. తిరుపతిరాజా ఇప్పుడు మనమధ్య లేకపోయినా రూ.800 కోట్ల విలువైన వ్యాపారాన్ని వదలి వెళ్లారు. 50 ఏళ్ల క్రితం వ్యాపారం అచ్చిరాక తమిళనాడులోని రాజుపాలెంలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. ఆ కుంగుబాటునుంచి బయటపడి చెన్నైకీ, ఆపై బెంగళూరుకూ, అక్కడినుంచి ముంబయికీ వెళ్లి స్వీట్స్‌ తయారీలో ఆరితేరారు.తమిళనాడుకు తిరిగివచ్చి ఆనంద్‌భవన్‌ను నెలకొల్పారు. రాజా మూడోతరం రూ.800 కోట్ల టర్నోవర్‌తో వ్యాపారాన్ని నడుపుతోంది.

సాధన చేసేదెలా?

చేపట్టే వృత్తిలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ అద్భుతంగా ఎదిగేలా చేస్తుంది నిర్ణయ సామర్థ్యం. దీన్ని పెంపొందించుకునే దశలున్నాయి. వీటిని సాధన చేయవచ్చు. 

1. గమ్యంపై స్పష్టత: కెరియర్‌లో, వ్యక్తిగత జీవితంలో సాధించదలచుకున్న లక్ష్యాలేమిటనేదానిపై స్పష్టత వుండాలి. ఈ స్పష్టత ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకోవడంలో తొట్రుపాటు ఉండదు. 

2. తగిన సమాచారం: నిర్ణయం తీసుకోవాల్సిన విషయంపై సంపూర్ణ సమాచారం సమీకరించాలి. ఏ కంపెనీలో చేరాలన్న మీమాంస ఏర్పడినప్పుడు ఆఫర్స్‌ వచ్చిననాటినుంచి కంపెనీ పూర్వాపరాలపై విషయ సేకరణ చేసి అవగాహన ఏర్పరచుకోవాలి. 

3. ప్రత్యామ్నాయాలపై దృష్టి: నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఎదురుగా ఒకే ఒక మార్గం వుంటే ఆత్మ స్థైర్యం కొరవడుతుంది. వివిధ ప్రత్యామ్నాయాలు ఆలోచించి వాటిని బేరీజు వేసుకుంటేనే తగిన నిర్ణయాలకు అవకాశం ఉంటుంది. 

4. ఉద్వేగం వద్దు: ఉద్వేగంతో తీసుకునే నిర్ణయం అనుకున్న ఫలితం ఇవ్వదు. కీలక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ప్రశాంత చిత్తం అవసరం. ఉద్వేగరహిత స్థితిలో తీసుకునే నిర్ణయాలే రాణిస్తాయి. 

5. పర్యవసానాల పరిగణన: నిర్ణయాలను గుడ్డిగా తీసుకోకుండా, ముందు దాని పర్యవసానాలను ఆలోచించాలి. తగిన పర్యవసానాలైతే అందుకు సిద్ధంగా ఉండగలగాలి. లేదా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి.  

6. రాగ ద్వేషాలకు అతీతంగా: నిర్ణయాన్ని నిష్పాక్షికంగా తీసుకునేలా సాధన చేయాలి. నిర్ణయ సమయంలో ఇష్టాయిష్టాలవైపు మొగ్గు చూపకుండా ఫలాపేక్షతో వ్యవహరించగలగాలి. అప్పుడే నిర్ణయం సానుకూల ఫలితం ఇస్తుంది.  


 

Posted Date: 05-04-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం