• facebook
  • whatsapp
  • telegram

ఏక దృష్టి.. ఎదురులేని అస్త్రం! 

కెరియర్‌ ఉన్నతికి జీవన నైపుణ్యాలు

చీకట్లో నడుస్తున్నపుడు మన వెంట వచ్చే కాగడా లాంటిది- ఫోకస్‌ (ఏక దృష్టి). ఈ జీవన నైపుణ్యం మన సంకల్పానికి వజ్రాయుధం. ఈ మార్గంలో ప్రయాణించిన వారంతా విజయపథంలోనే ఉన్నారు. వివిధ రంగాల్లో అగ్రగాములుగా వెలుగొందుతున్నారు.

కీర్తి తన ల్యాప్‌టాప్‌లో వచ్చిన మెయిల్‌ వైపు నిస్తేజంగా చూస్తోంది. ఇది సంస్థ తనకు పంపిన మూడో రిజెక్షన్‌ లెటర్‌. దానికే వాళ్లు రిగ్రెట్‌ లెటర్‌ అని ఊరడింపు పేరు పెట్టారు. సారాంశం ఒక్కటే- కొన్ని కారణాల వల్ల మిమ్మల్ని ఉద్యోగిగా చేర్చుకోలేకపోతున్నామనే. అయితే ఈ రిజెక్షన్‌ (తిరస్కరణ) మీ సామర్థ్యాన్ని తక్కువ చేయడం కాదనే ఓదార్పు వాక్యాన్ని అందులో చేర్చారు. ఇంజినీరింగ్‌ తుది సంవత్సరంలో ఉన్న కీర్తి కొన్ని రోజుల నుంచి ఈ ఎంఎన్‌సీ ఆఫర్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. చివరకు ఆశాభంగమే ఎదురైంది. తాను చేసిన తప్పేంటి? అన్ని విధాలా తాను మంచి ప్రతిభనే చూపుతున్నానే అని మధనపడుతున్న కీర్తి అదే ఎంఎన్‌సీకి ఎంపికైన తన రూమ్‌మేట్‌ ధాత్రిని అడిగింది.

ధాత్రి తన స్నేహితురాలిని ఊరడించిందే కానీ కారణం చెప్పలేకపోయింది. నిజానికి కీర్తి కంటే ధాత్రి ప్రతిభ రీత్యా మరీ ముందేమీ ఉండదు. ఇంచుమించు ఇద్దరూ క్లాస్‌లో ఒకేరకమైన టాలెంట్‌ చూపేవారు. సబ్జెక్టులో కానీ సాఫ్ట్‌స్కిల్స్‌లో కానీ ఇద్దరిదీ ఒకే కొలమానం. మరి లోపం ఎక్కడ జరిగింది?

కీర్తి, ధాత్రిల గురించి బాగా తెలిసిన సీనియర్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ రజనీ అసలు కారణాన్ని విశ్లేషించారు. కీర్తి ఆరో సెమిస్టర్‌ పూర్తయినప్పటినుంచి కెరియర్‌లో ముందడుగు యత్నాలు మొదలుపెట్టింది. తన కజిన్స్‌ అమెరికాలో ఉండటంతో ఎంఎస్‌ దిశగా కొన్ని నెలలు కృషి చేసింది. తన సీనియర్‌ ఒకరు ఐఈఎస్‌ (ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌)కు ఎంపిక కావడంతో యూపీఎస్‌సీకి దరఖాస్తు చేసింది. కొంత సన్నద్ధత మొదలుపెట్టింది. ఈలోపు ధాత్రి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై దృష్టిపెట్టడం చూసి వాటికీ పోటీ పడింది.

ధాత్రి మాత్రం మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌నే ఎంచుకుంది. వాటిల్లో మంచి ఎంఎన్‌సీకి ఎంపిక కావాలన్న దీక్షతో చదివింది. ఆ ఉద్యోగావకాశాన్ని అందుకోవడానికి ఉన్న అవరోధాలను గుర్తించింది. చివరి సెమిస్టర్‌లో పూర్తిగా దృష్టి కేంద్రీకరించడంతో అనుకున్న ఫలితం సాధించింది. ఒకే మార్గం ఎంచుకుని దానిపై దృష్టిపెట్టడంతో కెరియర్‌లో కోరుకున్న విజయాలు సాధించవచ్చని డాక్టర్‌ రజని విశ్లేషించారు. దీన్నే ఫోకస్‌ (ఏక దృష్టి) అంటున్నారు. ఎంత ప్రతిభ ఉన్నా, ఎన్ని నైపుణ్యాలున్నా ఏకదృష్టితో కృషిచేయకపోతే ఫలితం ఆలస్యమవుతూనే ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న గమ్యం చేరలేకపోవచ్చు కూడా!

ఏమిటీ ఫోకస్‌?

ఇది ఒక జీవన నైపుణ్యంగా విరాజిల్లుతోంది. అనుసరించిన వారిని శిఖరాగ్రాలకు చేర్చింది. ఫోకస్‌ అంటే నిర్దేశించిన లక్ష్యంవైపు గురిపెట్టడం. శక్తి సామర్థ్యాలన్నింటినీ కలగలిపి కృషి చేయడం. సూర్యగ్రహణం సమయంలో పిల్లలు ఒక ప్రయోగం చేస్తుంటారు. ఒక భూతద్దాన్ని ఎండలో పట్టుకుని కింద కాగితం పెడితే కొంతసేపటికి పేపర్‌పై కాలినట్టు నల్లని చారలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో కాగితంపై మంటను చూడవచ్చు. సూర్యకిరణాలు ఒక్కటిగా చేసి భూతద్దం కింద ఉన్న కాగితంపై ప్రసరింపజేయడంతో ఆ వేడికి పేపర్‌ కాలుతుంది. సర్వశక్తులూ కూడగట్టుకుని లక్ష్యం వైపు దృష్టి కేంద్రీకరించడమంటే ఇదే.

‣ తన స్నేహితుడు పాల్‌ అలెన్‌తో కలిసి బిల్‌గేట్స్‌ అప్పుడప్పుడే కనువిప్పుతున్న కంప్యూటర్‌ రంగంలో కృషి చేయాలనుకున్నపుడు తన తల్లితో.. ‘అమ్మా! నువ్వు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడెయ్‌. రాబోయే పదేళ్లు నేను నీకు అందుబాటులో ఉండను’ అన్నారట. ఫోకస్‌గా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ రాయాలనుకుంటున్న కొడుకు వైపు ఆమె ఆశ్చర్యంగా చూసింది.. అర్థం కాక!

అందరి లాగే భవిష్యత్తును వెతుక్కుంటూ ముంబయి వెళ్లి మెక్‌ డొనాల్డ్‌ స్ఫూర్తితో... వంటపాత్రలు కడిగే స్థాయి నుంచి పాతికకుపైగా శాఖలున్న ‘దోశ ప్లాజ’ అధిపతి అయ్యారు ప్రేమ్‌ గణపతి. ఈయన పాఠశాలలో సాధారణ విద్యార్థి. 

బీఎస్‌సీ గ్రాడ్యుయేట్‌ అయిన అనేకమందిలో ఒకరైన కున్వర్‌ సచ్‌దేవ్‌ ఫిజిక్ట్‌ సబ్జెక్టుపై అనురాగంతో ఫోకస్‌తో కృషిచేసి రూ.500 కోట్ల సు-కామ్‌ అధిపతిగా విజయాలు సాధించగలిగారు.

ఏం చేయాలి?

అనుసరించేవారిని అగ్రభాగాన నిలిపే ఈ జీవన నైపుణ్యాన్ని కింది విధంగా పెంపొందించుకోవచ్చు.

ఒకే విషయంపై దృష్టి: కెరియర్‌ లక్ష్యం లేదా మనసుకు నచ్చిన విషయంపై దృష్టి నిలపడం, దాని గురించే ఆలోచించడం. స్వామి వివేకానంద ‘ఒక మంచి ఆలోచన చేయి. దాన్నే జీవితాశయంగా స్వీకరించు. మెలకువలోనూ, నిద్రలోనూ దానిపైనే ధ్యాస ఉంచు. దాన్ని సాధించేవరకూ విశ్రమించకు’ అని ఏకదృష్టి విధానాన్ని ఉద్బోధించారు.

ఆసక్తి పెంచుకోవాలి: ఫోకస్‌ చేసిన విషయంపై ఆసక్తి పెంచుకోవాలి. ఇందుకు ఉన్న మంచి మార్గం- సాధ్యమైనంత ఎక్కువ విషయ సేకరణ. అనురక్తి గల విషయంపై సమాచారం సేకరిస్తున్నకొద్దీ ఆ ప్రక్రియలో మరింత ఉత్సాహం ఉత్పన్నమవుతుంది. ఫోకస్‌ చేస్తున్న విషయానికి మనల్ని మరింత సన్నిహితం చేస్తుంది.

సామర్థ్యాల పెంపు: దృష్టి పెడుతున్న అంశంతో మనకు విడదీయరాని అనుబంధం ఏర్పడితే ఇక మన ప్రయాణం ఆ దిశగా దృఢంగా సాగుతుంది. ఫోకస్‌ చేసే విషయసాధనకు మనలో కొరవడుతున్న సామర్థ్యాలను పెంచుకోవడానికి సాధన చేయాలి. దీనివల్ల ఫోకస్‌ చేస్తున్న లక్ష్యంపై మన గురి ఇంకా పెరుగుతుంది.

దారి మార్చొద్దు: ఫోకస్‌ చేసి, లక్ష్యాన్ని సాధించే క్రమంలో అవరోధాలు, కష్టాలు ఎదురవొచ్చు. దారులు మూసుకుపోవచ్చు. అవకాశాలు ఆశాజనకంగా కనిపించకపోవచ్చు. అయినా ఆ మార్గం వదలకూడదు. దారి మారిస్తే ఫోకస్‌ మసకబారుతుంది. పట్టుదల సడలుతుంది. ఆటంకాలు ఎదురవుతున్నకొద్దీ ఏకదృష్టికి మరింత పదునుపెట్టి ముందుకు కదలాలి.

Posted Date: 19-01-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం